భారతీయ సౌందర్య ప్రపంచంలో కొత్త అందం మెరిసింది. 59వ ఫెమినా మిస్ ఇండియాగా నందిని గుప్తా నిలిచింది. ఇక మొదటి రన్నరప్‌గా ఢిల్లీకి చెందిన శ్రేయా పూంజా, రెండో రన్నరప్ గా మణిపూర్‌కు చెందిన తౌనోజం స్ట్రెలా లువాంగ్ నిలిచారు. ఈ పోటీలు మణిపూర్‌లోని ఇంఫాల్‌లోని ఖుమాన్ లంపాక్‌లోని ఇండోర్ స్టేడియంలో జరిగాయి. ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఎంతో మంది బాలీవుడ్ హీరో, హీరోయిన్లు ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఈ పోటీలో నిలబడి గెలవాలన్న లక్ష్యంతో దేశం నలుమూలల నుంచి అందగత్తెలు పాల్గొన్నారు. 29 రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలు ఈ పోటీలు పాల్గొన్నారు. వారందరినీ ఓడించి నందిని గుప్తా తన అందంతో, తెలివి తేటలతో మిస్ ఇండియాగా మారింది.
నందిని గుప్తా ఎవరు?
నందిని గుప్తా రాజస్థాన్‌లోని కోటా నగరానికి చెందినది. బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీని పూర్తి చేసింది. పదేళ్ల వయసులో ఉన్నప్పుడు ఎప్పటికైనా మిస్ ఇండియా అవ్వాలని ఆశ పడింది. 19 ఏళ్ల వయసులో ఆ కోరికను నెరవేర్చుకుంది. ఆ ప్రయాణంలో ఎన్నో చేదు అనుభవాలు, ఛీత్కారాలు, ఎదురుదెబ్బలు తగులుతాయని ఆమెకు తెలుసు. వాటిని భరించేందుకు చిన్న వయసులోనే సిద్ధపడింది. ఎదురుపడే సవాళ్లను జయించడం కోసం మానసికంగా సిద్ధపడింది. ఎంతో మంది బంధువులు, స్నేహితులు విమర్శించినా తన కల నెరవేర్చుకోవడం పైనే ఆమె దృష్టి పెట్టింది.
2022లో ఫెమీనా మిస్ ఇండియా కిరీటాన్ని కర్ణాటకకు చెందిన సినీ శెట్టి గెలుచుకుంది. విజేతగా నిలిచిన నందిని గుప్తాకు సినీ శెట్టి కిరీటాన్ని అలంకరించింది.
మిస్ ఇండియా పోటీలు ప్రతి ఏడాది భారత దేశంలో జరిగే అందాల పోటీ. మిస్ వరల్డ్ పోటీలో ప్రతి ఏడాది పాల్గొనే వారిని ఈ మిస్ ఇండియా పోటీల ద్వారానే ఎంపిక చేస్తారు. తొలిసారి 1947లో ఈ పోటీలు జరిగాయి. మొదటి మిస్ ఇండియాగా ప్రమీల (ఎస్తేర్ విక్టోరియా అబ్రహాం) గెలిచింది. ఆమె కోల్‌కతాకు చెందిన యువతి. ఆ తరువాత రెండో మిస్ ఇండియా పోటీలు జరగడానికి అయిదేళ్ల సమయం పట్టింది. 1952లో జరిగిన మిస్ ఇండియా పోటీలో ముస్సోరీకి చెందిన ఇంద్రాణి రెహ్మాన్ గెలిచింది. 1955 నుంచి 1959 వరకు మిస్ ఇండియా పోటీలు జరగలేదు. అప్పట్నించి ఇప్పటి వరకు ప్రతి ఏడాది ఈ పోటీలు జరుగుతూనే ఉన్నాయి.
ఫెమీనా చేతిలోకి...
ఫెమీనా సంస్థ చేతిలోకి తొలిసారి 1964లో మిస్ ఇండియా పోటీలు వచ్చాయి. అప్పట్నించి ఇప్పటివరకు ఆ సంస్థే ఈ పోటీలను నిర్వహిస్తోంది. అందుకే ‘ఫెమీనా మిస్ ఇండియా’ అని పిలుస్తారు. 1966లో రీటా ఫారియా మిస్ ఇండియా ప్రతినిధిగా మిస్ వరల్డ్ పోటీలకు వెళ్లి... తొలి ‘మిస్ వరల్డ్’ కిరీటాన్ని భారత్‌కు తీసుకొచ్చింది.
Also read: మన భారతీయులు రోజుకు ఆరు గంటలు కూడా నిద్రపోవడం లేదట - చెబుతున్న సర్వే