శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో, నిద్ర కూడా అంతే ముఖ్యం. రోజుకు 8 గంటల నిరంతర నిద్ర అవసరమని వైద్యులు చెబుతూనే ఉంటారు. అయినా సరే ఎనిమిది గంటల పాటూ నిద్రపోతున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్టు సర్వేలు చెబుతున్నాయి. కోవిడ్ వంటి మహమ్మారి వచ్చినప్పుడు రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి  ఎక్కువగా ఆసక్తి చూపించారు. అయితే ఆహారం పైన ఎక్కువ దృష్టిని పెట్టారు, కానీ నిద్రను పట్టించుకోలేదు. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి నిద్ర కూడా చాలా అవసరం అన్న సంగతి వారికి తెలియదు.  ఇటీవల జరిగిన ఒక జాతీయ అధ్యయనంలో భారతీయులు రోజుకు ఆరుగంటల కంటే తక్కువగా నిద్రపోతున్నట్టు తేలింది. 


మనదేశంలోని 309 జిల్లాల్లోని 39 వేలపై మందిపై చేసిన అధ్యయనంలో 55 శాతంమందికి పైగా భారతీయులు ఆరుగంటలుకూడా నిద్ర పోయినట్టు చెప్పలేదు.  కరోనా వైరస్ తర్వాత భారతీయుల నిద్రా సమయాలు క్షీణించినట్టు సర్వే చెప్పింది. నిద్ర తగ్గడం వల్ల ఆరోగ్యం కూడా క్షీణిస్తుందని చెబుతున్నారు అధ్యయనకర్తలు. 


ఈ సర్వేలో పాల్గొన్న 43% మంది తాము 6 నుంచి 8 గంటల కన్న తక్కువ నిద్రపోతున్నట్టు చెప్పారు. 34 శాతం మంది నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య నిద్రపోతున్నట్టు చెప్పారు. 21 శాతం మంది నాలుగు గంటలు నిద్రపోతున్నట్టు వివరించారు. కేవలం రెండు శాతం మంది మాత్రం 8 నుంచి పదిగంటల పాటూ నిద్రపోతున్నట్టు తెలిపారు. అంటే మొత్తం మీద సర్వేలో పాల్గొన్న 55% మంది భారతీయులు రోజు 6 గంటల కంటే తక్కువ నిద్రను పొందుతున్నారు. 


కారణాలు ఇవే...
తక్కువ నిద్ర పొందడానికి కారణాలు ఏమిటని అడిగితే 12 శాతం మంది పిల్లల కారణంగా తాము ఎక్కువ సేపు నిద్రపోలేకపోతున్నామని వివరించారు. 14% మంది తమకు వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌ల వల్ల అంతరాయం కలుగుతున్నట్టు వివరించారు. 10 శాతం మంది నిద్రపోయే మంచం, పరుపు కారణంగా నిద్ర పట్టడం లేదని వివరించారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో కారణాలు చెప్పారు. 


నిద్ర తగ్గడం వల్ల శరీరం త్వరగా ముసలిదైపోతుంది. 30  ఏళ్ల వయసులోనే 40 ఏళ్ల  వయసులా కనిపిస్తోంది. ఇప్పుడు ప్రపంచంలో నిద్రలేమి అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. నిద్ర సరిపోకపోవడం వల్ల ఎన్నో రోగాలకు స్వాగతం పలికినట్టే. నిద్ర తగ్గడం వల్ల మానసిక, శారీరక సామర్థ్యాలు తగ్గిపోతాయి. విషయాలు గ్రహించే సామర్థ్యం తగ్గిపోతుంది. కాబట్టి రోజుకు ఎనిమిది గంటలు తగ్గకుండా నిద్రపోవాల్సిన అవసరం ఉంది. 


Also read: నా భర్త అతని అక్కలు ఏం చెబితే అదే చేస్తున్నారు, ఇది నాకు నచ్చడం లేదు


Also read: కోవిడ్ వైరస్ పుట్టింది గబ్బిలాల్లో కాదు మనుషుల్లోనే, చైనీస్ శాస్త్రవేత్త కొత్త వాదన






























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.