Asaduddin Owaisi About Atiq Ahmed  Shot Dead: ఉత్తరప్రదేశ్ లో గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్‌, అతడి సోదరుడు అష్రాఫ్ అహ్మద్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. అతీక్, అతడి సోదరుడు దారుణహత్య అనేది యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అన్నారు. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తులు, చేతులకు బేడీలు కూడా ఉన్నాయి. అలాంటి వారిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి చంపడం దారుణమైన ఘటన అన్నారు. 


హత్య చేసిన దుండగులు జైశ్రీరామ్ అని నినాదాలు చేశారని, పోలీసులు మాత్రం నిందితులను ఏ మాత్రం అడ్డుకోకపోవడాన్ని అసదుద్దీన్ తప్పుపట్టారు. ఈ ఘటన యోగి పాలనలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతోందని చెప్పడానికి నిదర్శనం అన్నారు. ఎన్ కౌంటర్లు చేస్తే సెలబ్రేట్ చేసుకుంటున్న ఎన్ కౌంటర్ రాజ్యం సైతం హత్య చేయడంతో సమానం అని ట్వీట్ చేశారు. ఎవరినైనా హత్యలు చేస్తే.. మరికొందరు సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే ఇదేనా న్యాయ వ్యవస్థ, న్యాయం చేసే తీరు అని యూపీ సీఎం యోగి ప్రభుత్వాన్ని అసదుద్దీన్ ప్రశ్నించారు.






Atiq Ahmed Shot Dead: గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్‌, అతడి సోదరుడు దారుణహత్య 
ఉమేశ్‌ పాల్‌ హత్య కేసులో అరెస్టై జైలులో ఉన్న అతీక్ అహ్మద్ ను మెడికల్‌ చెకప్‌ కోసం తీసుకెళ్తుండగా కొందరు దుండగులు సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతీక్ తో పాటు అతడి సోదరుడు అష్రాఫ్‌ అహ్మద్‌ కూడా చనిపోయాడు. మరోవైపు గ్యాంగ్ స్టర్ అతీక్‌ అహ్మద్‌ కుమారుడు అసద్ అహ్మద్ ను పోలీసులు గురువారం ఎన్‌కౌంటర్‌ చేయడం తెలిసిందే. అది జరిగిన మూడో రోజే గ్యాంగ్ స్టర్ ఫ్యామిలీలో మరో ఇద్దరు వ్యక్తులు కాల్పుల ఘటనలో చనిపోయారు.






ప్రయాగ్‌రాజ్‌లో సెక్షన్ 144, విచారణకు సీఎం యోగి ఆదేశాలు 
ప్రయాగ్ రాజ్ లో గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ దారుణహత్య ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు యోగి ఆదేశించారు. ఘటనా స్థలాన్ని సందర్శించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ ప్రసాద్‌ను ఆయన ఆదేశించారు. గ్యాంగ్ స్టర్ దారుణహత్య జరగడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ప్రయాగ్‌రాజ్‌లో సెక్షన్ 144 విధించారు.


నిందితులు అరెస్ట్..
ప్రయాగ్‌రాజ్‌లో శనివారం అతీక్ అహ్మద్, సోదరుడిపై కాల్పులు జరిపి హత్య చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను లవ్లేష్ తివారీ, సన్నీ, అరుణ్ మౌర్యలుగా పోలీసులు గుర్తించారు.  కాల్పుల ఘటనలో ఒక పోలీసు, ఓ జర్నలిస్ట్ సైతం గాయపడ్డారని సమాచారం.