'పది నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్ దగ్గరకు అయినా వెళ్లి నిలబడు, అక్కడ నీకో స్లోగన్ వినబడుతుంది. అది నేను' - 'వీర సింహా రెడ్డి' సినిమాలో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ చెప్పిన డైలాగ్! హైదరాబాదులో 'జై బాలయ్య' స్లోగన్ వినబడని పబ్ ఉండదు. ఆ మాటకు వస్తే... తెలుగు ప్రజలు వెళ్ళే ప్రతి పబ్ లో ఆ మాట వినబడుతుంది. 'జై బాలయ్య'కు ముందు? చాలా పాటలు ప్లే చేస్తారు.
పబ్ (Pub Songs) అంటే పాటలు కామన్! హైదరాబాదులో పబ్బులో ఏ పాటలు ప్లే చేస్తారు? అంటే... తెలుగు నుంచి మొదలు పెడితే హిందీ, ఇంగ్లీష్ వరకు అన్ని భాషల సాంగ్స్ ఉంటాయి. అలా కాకుండా కేవలం తెలుగు పాటలు వినిపించే పబ్ ఒకటి కొత్తగా మొదలైంది. అదీ ప్రముఖ సంచలన దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా!
గచ్చిబౌలిలోని 'మారేడుమిల్లి'లో తెలుగు పబ్!
నవదీప్, పూనమ్ బజ్వా జంటగా నటించిన 'మొదటి సినిమా' గుర్తు ఉందిగా! ఆ చిత్రానికి కూచిపూడి వెంకట్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ప్రముఖ హాస్య నటుడు కృష్ణ భగవాన్ కథానాయకుడిగా 'జాన్ అప్పారావు 40 ప్లస్' తీశారు. ఆయన హైదరాబాదులోని గచ్చిబౌలిలో 'మారేడుమిల్లి' పేరుతో ఓ రెస్టారెంట్ స్టార్ట్ చేశారు. దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి చేతుల మీదుగా అది ప్రారంభం అయ్యింది. ఇప్పుడు దానికి అనుసంధానంగా ఓ పబ్ కూడా స్టార్ట్ చేశారు. దాని పేరే తెలుగు పబ్ (Telugu Pub). రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా ఆ పబ్ ఓపెనింగ్ జరిగింది.
Also Read : ప్రభాస్ ఫ్యాన్స్‌ను భయపెట్టిన 'శాకుంతలం' - 'ఆదిపురుష్' ఎలా ఉంటుందో?
''పబ్బుల్లో పాశ్చాత్య సంగీతం మాత్రమే ఎందుకు ప్లే చేయాలి? అచ్చమైన మన తెలుగు పాటలు ఎందుకు వినిపించకూడదు? ఇతర పాటలతో పోలిస్తే మన పాటలు ఏం తక్కువ? అనే ఆలోచనల నుంచి ఈ 'తెలుగు పబ్' మొదలైంది. 'డీజే అప్పారావ్' తెలుగు పాటలే ప్లే చేస్తారు'' అని కూచిపూడి వెంకట్ (Kuchipudi Venkat) తెలిపారు. ఇందులో రకరకాల ఫ్లేవర్లలో 'బీర్ టెయిల్' పేరుతో బీరు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. కూచిపూడి వెంకట్ ప్రవేశపెట్టిన 'బీర్ టెయిల్, డీజే అప్పారావ్' కాన్సెప్టులు తనకు విపరీతంగా నచ్చాయని రామ్ గోపాల్ వర్మ చెప్పారు.
త్వరలో మూడో సినిమా ప్రారంభిస్తా! - కూచిపూడి వెంకట్
'మొదటి సినిమా', 'జాన్ అప్పారావు 40 ప్లస్' సినిమాల తర్వాత దర్శకత్వం నుంచి కూచిపూడి వెంకట్ కొంత విరామం తీసుకున్నారు. త్వరలో తన దర్శకత్వంలో మూడో సినిమా ప్రారంభిస్తానని 'తెలుగు పబ్' ఓపెనింగులో ఆయన తెలిపారు. 'తమ కాలక్షేపం కోసం ఎదుటివారి సమయాన్ని విచ్చలవిడిగా వేస్ట్ చేసే వారికి చెంప పెట్టు లాంటి వినూత్నమైన కాన్సెప్టుతో ఓ ఐడియా రెడీ చేశా. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది'' అని వెంకట్ చెప్పుకొచ్చారు. ప్రముఖ నిర్మాత సుమన్ వర్మ, రచయిత బి.వి.ఎస్. రవి తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
Also Read : వెంకటేష్ vs నాని - బాక్సాఫీస్ బరిలో 'సైంధవ్'తో పోటీ