Tulsidas Jayanti 2023: హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని ఏడవ రోజున తులసీదాసు పుట్టినరోజు జరుపుకొంటారు. ఈ సంవత్సరం తులసీదాస్ జయంతి 23 ఆగస్టు 2023 బుధవారం జరుపుకొంటారు. తులసీదాస్ గొప్ప కవి. రామచరిత మానస్‌ను సృష్టించిన ఘనత ఆయనది. మహాకవి తులసీదాస్ తన జీవితమంతా రామ భక్తుడిగానే గడిపాడు. రామచరితమానస్‌, దోహావళి, కవితావళి, గీతావళి, వినయ పీఠిక, జానకీ మంగళ్‌, రామలాల నహచాచు. రామాంజ ప్రసన్న, పార్వతి మంగళ్‌, కృష్ణ గీతావళి, హుమాన్‌ బాహుక, సంకట మోచనస వైరాగ్య సందీపిని, హనుమాన్‌ చాలీసా వంటి గొప్ప కావ్యాలను తులసీదాస్ రాశారు. ఈ కావ్యాల‌న్నీ ఆయ‌న‌ను గొప్ప కవిని చేశాయి. తులసీదాస్‌ను ఆధ్యాత్మిక గురువుగా కూడా పరిగణిస్తారు. మహాకవి తులసీదాస్ జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.


తులసీదాసు వృత్తాంతం
తులసీదాసు తండ్రి ఆత్మారాముడు, తల్లి హులసీ. తులసీదాసు జన్మించినప్పుడు అయిదు సంవత్సరాల బాలుడిలా కనిపించాడట. తల్లితండ్రులు అతని విలక్షణ రూపానికి భయపడి తమ ఇంటి దాసి మునియాకు పెంచుకోవ‌డానికి ఇచ్చారు.  తరువాత కొద్దికాలానికి ఆతనిని పెంచుకొన్న మునియా దాసి కూడా చనిపోయింది. అపుడు బాబా నరహరిదాసు అనే సాధువు ఆ అనాథ బాలుడైన తులసీదాసుని పెంచి విద్య నేర్పారు. తరువాత శేష సనాతనుడనే శ్రేష్ఠుని దగ్గర తులసీదాసు వేద, వేదాంగాలు అభ్యసించాడు. తులసీదాసు అనాథ బాలుడైనా ఆతని రూప, గుణ, శీల, స్వభావ, విద్వత్తులకు ముగ్ధుడై ఒక కులీన బ్రాహ్మణడతనికి తన కూతురునిచ్చి వివాహం చేశాడు. తన భార్య రత్నావళి అంటే తుల‌సీదాసు ఎంతో ప్రేమ చూపించేవాడు.


Also Read : హనుమాన్ చాలీసా ఎందుకు చదవాలి, పఠిస్తే కష్టాలెందుకు తీరుతాయి


భార్య మాట‌ల‌తో వ్య‌క్తిత్వంలో మార్పు
ఒకసారి తుల‌సీదాసు ఇంట్లో లేనప్పుడు ఆయ‌న భార్య‌ రత్నావళి పుట్టింటికి వెళ్లింది. ఈ విష‌యం తెలియగానే తులసీదాసు ఆమెను కలుసుకునేందుకు బయలుదేరాడు. చిమ్మ చీకటి, దానికితోడు కుంభవృష్టి పడుతూవుంది. అటువంటి సమయంలో గంగానదిని దాటి భార్య ఇంటికి చేరుకొన్నాడు. అప్పుడు అతని భార్య రత్నావళి చేసిన హెచ్చరిక అతని జీవితాన్నే మార్చేసింది.


అస్థిచర్మమయ దేహ మను తామేజైసీప్రీతి 
తైసి జో శ్రీరామమహ హోత వతౌభవతి!


నాథా! ఎముకలు, చర్మంతో కూడిన ఈ దేహంపై ఉన్నంత ప్రేమ ఆ శ్రీరాముని మీద ఉంటే భవభీతియే ఉండదు కాదా! అన్న రత్నావళి మాటలే తులసీదాసుకు తారకమంత్రమయ్యాయి.  


కాశీ, అయోధ్యలోనే నివాసం
భార్య మాట‌ల‌తో ప‌రివ‌ర్త‌న చెందిన‌ తులసీదాసు విరాగిగా మారి శ్రీరామచంద్రుని భక్తిలో నిమగ్నుడ‌య్యాడు. కాశీ, అయోధ్య ఆయనకు నివాస స్థానాలయ్యాయి. జీవిత చరమదశలో ఆయన కాశీలోనే ఉన్నాడు.  లోకకల్యాణ కరమైన ‘రామచరితమానస్’ మహాకావ్యాన్ని రాయడం తులసీదాసు అయోధ్యలోనే ప్రారంభించాడు. తరువాత కాశీలో ఉంటూ రెండున్నర సంవత్సరాలలో రామచరితమానస్ పూర్తి చేశాడు.


అభిన‌వ వాల్మీకి
తులసీదాసును వాల్మీకి అవతారమని అంటారు. భక్తిభావం, కావ్య రచన, తాదాత్మ్యత, భాష చూస్తే ఆయన అపర వాల్మీకి అనటానికి ఏ సందేహమూ లేదు. తులసీదాసు తన జీవిత కాలంలో సంస్కృతంతో పాటుగా హిందీలో 22 రచనలు చేశాడు. తులసీదాసు ఇతర రచనల్లో దోహావళి, కవితావళి, గీతావళి, వినయ పీఠిక, జానకీ మంగళ్‌, రామలాల నహచాచు, రామాంజ ప్రసన్న, పార్వతి మంగళ్‌, కృష్ణ గీతావళి, హుమాన్‌ బాహుక, సంకట మోచనస వైరాగ్య సందీపిని, హనుమాన్‌ చాలీసా వంటివి ఉన్నాయి. అయితే రామచరితమానస్ ఆయ‌న పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసింది.


హిందూ ధ‌ర్మ ప‌రిర‌క్ష‌కుడు
తుల‌సీదాసు కేవలం రచన‌ల‌కే ప‌రిమితం కాకుండా, కొడిగడుతున్న హిందూ జ్వాలను భక్తి ఉద్యమం ద్వారా మళ్లీ ప్రజ్వరిల్లేట్లు చేసిన మహా భక్తుడు. ఆయన ఉత్తర భారతదేశమంతా పర్యటించి అఖాడాల స్థాపన ద్వారా యువతలో పోరాట పటిమను రేకెత్తించాడు. ఇప్పటికీ ఆ అఖాడాలు కొనసాగుతూ ఉండటం గమనార్హం. తుల‌సీదాసు ఎన్నో ఆంజనేయ స్వామి ఆలయాలు స్థాపించాడు. వారణాసిలోని సంకటమోచన్‌ దేవాలయాన్ని ఆయ‌నే కట్టించాడు. త‌న‌కు రాముని దర్శన భాగ్యం కల్పించిన హనుమంతునికి కృతజ్ఞతగా ఈ ఆల‌యాన్ని కట్టించాడని ప్రతీతి. 


Also Read : హనుమంతుడు సింధూరం ధరించడం వెనుక రహస్యం ఇదే


హ‌నుమ స‌హాయం
తులసీదాసు ప‌ర‌మేశ్వ‌రుడిని, ఆంజనేయ స్వామిని ప్రత్యక్షంగా చూసినట్లు చెబుతారు. రామచరిత మానస్‌ రచనలో తులసీదాసుకు ఆంజనేయ స్వామి చాలా సహాయం చేశాడని చెప్పుకొంటారు. తులసీదాసు విరచిత హనుమాన్ చాలీసా జగత్ప్రసిధ్ధి చెందిన సాధనామంత్రం.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.