Hanuman Chalisa:  కాశీ అంటేనే ఘాట్లకు పెట్టింది పేరు.  మొత్తం 84 ఘాట్ లు వారణాసిలో ఉన్నాయి. అయితే వాటిలో ప్రత్యేకమైనవి ప్రసిద్ధి చెందినవి కొన్ని మాత్రమే. తులసి ఘాట్ వాటిలో ఒకటి.


తులసి దాస్ "రామ్ చరిత్ మానస్" రాసిన చోటు ఇది 


దక్షిణాదిలో వాల్మీకి రామాయణం ఎంత ఫేమస్సో ఉత్తరాదిన తులసీదాస్ రాసిన "రామ్ చరిత్ మానస్ "కూడా అంతే ఫేమస్.  16వ శతాబ్దం లో ప్రస్తుత ఉత్తరప్రదేశ్లో పుట్టిన తులసీదాస్ తన జీవితంలో అధిక భాగం  కాశి అయోధ్యల్లోనే గడిపారు. సామాన్యుల 'అవధి 'భాషలో అనేక రామాయణాల నుంచి స్ఫూర్తి పొంది  " రామ్ చరిత్ మానస్ " ను ఆయన కాశీలో తులసి ఘాట్ లోనే రాసారు. సామాన్యుల భాషలో రాయడంతో  తులసీదాస్ రామాయణం చాలా వేగంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. మధ్య యుగాల్లో భక్తికి సంబంధించి రచించిన  అతి గొప్ప కావ్యంగా రామచరిత మానస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. 100 ఏళ్లకు పైబడి జీవించిన తులసీదాస్  ఇక్కడే తన శరీరాన్ని త్యాగం చేశారు. 


తులసీదాస్ ని  వాల్మీకి అవతారంగా ఆయన భక్తులు అనుచరులు ఆరాధించడంతో ఆయన పేరు మీద కాశీలోని ఆ ఘాట్ కు తులసి ఘాట్ అనే పేరు వచ్చింది. అంతకుముందు లోలార్క్ ఘాట్ అని పిలిచేవారు. ఇది పూర్వకాలం నుంచి  పుత్ర కామేష్టి యాగాలకు ప్రసిద్ధి. ఇక్కడ స్నానం చేస్తే సంతానం కలగడంతో పాటుగా, కుష్టు లాంటి శారీరక వ్యాధులు నయమవుతాయని భక్తుల నమ్మకం. ఈ ఘాట్ కు తులసి ఘాట్ అని పేరు పెట్టాక  కార్తీకమాసంలో  కృష్ణ లీలలు ప్రదర్శించడం మొదలుపెట్టారు. 1941లో  పారిశ్రామికవేత్త బల్ దేవ్ దాస్ బిర్లా  సిమ్మెంటుతో తులసి ఘాట్ ను డెవలప్ చేసారు. తులసి ఘాట్ వద్ద  బోటు అద్దెకు తీసుకుంటే కాశీలోనే మొత్తం ఘాట్లను గంగా నదిలో ప్రయాణిస్తూ చూడొచ్చు.


Also Read: గంగనెత్తికెత్తినోడు , గౌరీదేవి మెచ్చినోడు శివయ్య..ఈ శివరాత్రికి మంగ్లీ సాంగ్ వచ్చేసింది చూశారా!


హనుమాన్ చాలీసా పుట్టింది ఇక్కడే 


ప్రపంచవ్యాప్తంగా హిందువుల్లో ప్రసిద్ధి పొందిన హనుమాన్ చాలీసా ను  ఈ ఘాట్ వద్దే రాశారు. ఈ ఘాట్ కి సమీపంలోనే తులసీదాస్ స్థాపించిన సంకట మోచన హనుమాన్ ఆలయం ఉంది. కాశీ వెళ్లినవారు విశ్వనాధ్ ఆలయంతో పాటుగా ఈ హనుమాన్ ఆలయాన్ని తప్పక దర్శిస్తారు. కాశీలోని ఘాట్ లలో కాస్త చివరగా ఉండే ఈ తులసి ఘాట్ మెట్ల పై కూర్చుని గంగానదిని చూడడం చాలా ప్రశాంతతను కలిగిస్తుందని భక్తులు చెబుతుంటారు.


 కలియుగంలో హనుమంతుని ఆరాధన అత్యంత ముఖ్యమైనది. రామనామం ఉన్నచోట హనుమంతుడు ఉంటాడు. రాముడిని పూజించే దగ్గర హనుమంతుడు ఉంటాడు. అందుకే చాలా మంది హనుమంతుడి అనుగ్రహం కోసం రామ నామాన్ని జపిస్తారు. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల దుష్ట శక్తుల నుంచి రక్షణ లభిస్తుందని నమ్మకం. నిత్యం హనుమాన్ చాలీసా పారాయణం చేసే వ్యక్తులకు ఎలాంటి ప్రమాదాలు జరగవని పూర్తి కవచంలా కాపాడుతాయని చెబుతారు


Also Read: పంచారామాలు, పంచభూత లింగాలు మాత్రమే కాదు..పంచకేదార క్షేత్రాల గురించి తెలుసా!