Interest Rate On EPF For FY 2024-25: 'ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్'లోని దాదాపు 7 కోట్ల మంది సభ్యులకు ఈ వారం చాలా కీలకమైంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగ భవిష్య నిధిపై వడ్డీ రేట్లకు (EPF Interest Rate For FY25) సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల (EPFO Central Board of Trustees) సమావేశం ఈ నెలాఖరున, అంటే శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025 నాడు జరగవచ్చు.
కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రి మన్‌సుఖ్ మాండవీయ అధ్యక్షతన ట్రస్టీల బోర్డు (CBT) సమావేశం అవుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) EPF పై వడ్డీ రేటుకు సంబంధించి ఆ భేటీలోనే నిర్ణయం తీసుకుంటారు. వడ్డీ రేటుపై CBT సమావేశంలో ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత, ఆ ప్రతిపాదనను ఆమోదం కోసం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ (Union Ministry of Finance)కు పంపుతారు.
గత ఆర్థిక సంవత్సరంలో 8.25 శాతం వడ్డీ
EPF ఖాతాదారులకు, గత ఆర్థిక సంవత్సరం 2023-24 కోసం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌పై 8.25 శాతం వడ్డీని నిర్ణయించారు. దీని కంటే ముందు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 8.15 శాతం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 8.10 శాతం వడ్డీని అందించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, EPFO తన పెట్టుబడులపై అద్భుతమైన రాబడిని అందుకున్నందున, ఈ సంవత్సరం కూడా EPFO ఖాతాదారులకు 8.25 శాతం వడ్డీ రేటు లేదా మరికొంత పెంచే అవకాశం ఉంది.
వడ్డీ స్థిరీకరణ రిజర్వ్ ఫండ్‌పైనా చర్చ
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో 'వడ్డీ స్థిరీకరణ రిజర్వ్ ఫండ్'ను సృష్టించే అంశంపై చర్చ జరిగే అవకాశం ఉంది. దాదాపు 7 కోట్ల మంది EPFO ఖాతాదారులకు, వారి పెట్టుబడులపై (ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్) స్థిరమైన రాబడిని అందించడం ఈ నిధిని సృష్టించడం వెనుకున్న ఉద్దేశం. వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ లేదా EPFO తన పెట్టుబడులపై తక్కువ రాబడిని పొందుతున్నప్పటికీ ఖాతాదారులు స్థిర రాబడిని పొందేందుకు ఈ ఫండ్ వీలు కల్పిస్తుంది. ఈ పథకం EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల ఆమోదం పొందితే, 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి రావచ్చు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలలో కేంద్ర కార్మిక & ఉపాధి శాఖ మంత్రితో పాటు కార్మిక సంఘాల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.
ప్రైవేట్ రంగంలో పని చేసే వాళ్లకు EPFO పథకం అతి పెద్ద సామాజిక భద్రత పథకం (Social Security Scheme)లా పని చేస్తుంది. ప్రైవేట్ రంగ ఉద్యోగుల జీతం నుంచి, ఆ కంపెనీ, ప్రతి నెలా స్థిరమైన మొత్తాన్ని పీఎఫ్ పేరుతో పక్కకు తీసి EPFO ఖాతాలో జమ చేస్తుంది. కంపెనీ యాజమాన్యం కూడా అంతే మొత్తంలో డబ్బును ఉద్యోగి పీఎఫ్ ఖాతాకు (PF Contribution) అందిస్తుంది. ఈ మొత్తం డబ్బు + వడ్డీ కలిపి ఉద్యోగ విరమణ తర్వాత, కొన్ని షరతుల ప్రకారం, ఉద్యోగి చేతికి వస్తుంది. ఉద్యోగ విరమణ కంటే ముందే డబ్బు అవసరమైతే, అంటే ఉద్యోగం కోల్పోవడం, ఇల్లు కట్టడం లేదా కొనుగోలు చేయడం, వివాహం, దీర్ఘకాలిక అనారోగ్యానికి చికిత్స లేదా పిల్లల ఉన్నత విద్య వంటి సందర్భాల్లో పీఎఫ్ డబ్బును పాక్షికంగా ఉపసంహరించుకోవచ్చు.
మరో ఆసక్తికర కథనం: ఎదురుచూపులు ఫలించే వేళ ఇది - రైతుల ఖాతాల్లోకి ఈ రోజు రూ.2000 జమ