Karthika Somavara Vratham:  భోళా శంకరుడికి సోమవారం అత్యంత ప్రీతికరం . సోమ .. అంటే.. స - ఉమ , అర్ - ఉమతో కూడినవాడు అని అర్థం.. అంటే పార్వతీ సమేత శివుడు అని అర్థం. అందుకే సోమవారం పరమేశ్వరుడికి చేసే పూజలు అత్యంత విశిష్టమైనవిగా భావిస్తారు. 


ఏ సోమవారం అయినా శంకరుడికి ప్రీతికరమే..కానీ కార్తీక సోమవారం..ముఖ్యంగా మూడో వారం మరింత విశిష్టమైనదిగా చెబుతారు పండితులు.


వేకువజామునే స్నానమాచరించి దీపారాధన చేసుకుని ఆలయానికి వెళ్లి శివదర్శనం చేసుకుంటారు. ఈ రోజు శివుడికి అభిషేకం చేసినవారికి, బిల్వదళాలతో పూజించినవారికి మనోభీష్టం నెరవేరుతుంది. 


ముత్తైదువులు ఈరోజు శివాలయంలో దీపాలు వెలిగిస్తే మాంగల్యబలం చేకూరుతుంది, సమస్త దోషాలు నశిస్తాయి. ఉత్థాన ఏకాదశి, క్షీరాబ్ధి ద్వాదశి , కార్తీక పౌర్ణమి తర్వాత అత్యంత విశిష్టమైన రోజు కార్తీకమాసం మూడో సోమవారం. ఈ రోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేయకపోయినా ఉపవాసం ఉండి శివుడిని భక్తితో ప్రార్థిస్తే నెలంతా నియమాలు ఆచరించిన ఫలితం సిద్ధిస్తుందంటారు


Also Read: కార్తీక మాసం ఎప్పటితో ఆఖరు .. పోలి స్వర్గం ఎప్పుడు - ఆ పేరెలా వచ్చింది!


ఈ రోజు రుద్రాభిషేకం, సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తారు..ఈ రోజు శివుడికి చేసే అభిషేకం వల్ల ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని చెబుతారు 


శివుడికి ప్రీతికరమైన బిల్వపత్రాలతో పూజిస్తే త్వరగా అనుగ్రహిస్తాడని, మోక్షం ప్రాప్తింపచేస్తాడంటారు...సర్వ శుభాలు చేకూర్చుతుంది కాబట్టే బిల్వ వృక్షాన్ని శివుడితో సమానంగా పూజిస్తారు


కార్తీకమాసంలో మూడో సోమవారం ఉపవాసం ఉండి.. సూర్యాస్తమయం తర్వాత నక్షత్ర దర్శనం చేసుకుని ఉపవాసం విరమించాలి. కార్తీక సోమవార విశిష్టతను వివరిస్తూ ఓ కథ స్కాంద పురాణంలో ఉంది...  


Also Read: కార్తీకమాసంలో మారేడు దళం సమర్పించి బిల్వాష్టకం పఠిస్తే చాలు శివయ్య దిగివచ్చేస్తాడు!


పూర్వకాలంలో కర్కశ అనే మహిళ ఉండేది..అత్యంత కర్కశంగా ప్రవర్తించే ఆమెకు వేదపండితుడు అయిన మిత్రశర్మతో వివాహం జరిగింది. పండితుడు, సాత్విక స్వభావం ఉన్న మిత్రశర్మని కూడా తన ప్రవర్తనతో హింసించింది కర్కశ. ఫలితంగా ఆమె జీవిత చరమాంకంలో భయంకరమైన వ్యాధితో పోరాడి ప్రాణం విడిచింది. ఆ పాపానికి ఫలితంగా మరో జన్మలో కుక్కగా జన్మించింది. కార్తీక సోమవారం రానే వచ్చింది. ఆ రోజంతా ఊరంతా ఉపవాసం ఉండడంతో కుక్కకి ఎక్కడా ఆహారం లభించలేదు. అంటే పగలంతా ఆ కుక్క కూడా ఉపవాసం ఉంది. సూర్యాస్తమయం తర్వాత ఓ వేద పండితుడు ఉపవాసం విరమించేముందు ఓ ముద్ద అన్నాన్ని తీసి ఇంటి బయట పెట్టాడు. ఆకలితో ఉన్న శునకం ఆ ఆహారం తింది. వెంటనే ఆ కుక్కకి గత జన్మ గుర్తుకువచ్చింది. అనుకోకుండా మాట్లాడడం మొదలుపెట్టి..తన పూర్వజన్మ్ గురించి ఆ వేదపండితుడికి వివరించింది. ఇదెలా జరిగిందని ప్రశ్నించిన ఆ కుక్కతో.. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం అన్నం ముద్దను తినడం వల్ల పూర్వజన్మ గుర్తుకువచ్చిందని చెప్పిన పండితుడు తన సోమవార వ్రత ఫలితాన్ని శునకానికి ధారపోశాడు. అప్పుడు ఆ శునకం దేహాన్ని వదిలి కైలాశానికి చేరుకుంది. అలా కార్తీకసోమవార వ్రతాన్ని తెలిసో తెలియకో ఆచరిస్తే శివసాయుజ్యం పొందుతారని ఈ కథ వెనుకున్న ఆంతర్యం...


ఓం నమఃశివాయ....


Also Read: మీరు దర్శించుకుంటున్నది ఎలాంటి శివలింగం - ఎన్ని రకాలున్నాయో తెలుసా!