New Toyota Camry Hybrid Facelift: జపనీస్ కార్ల తయారీ సంస్థ టయోటా త్వరలో కొత్త క్యామ్రీ హైబ్రిడ్ ఫేస్‌లిఫ్ట్‌ను భారతదేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. టయోటా క్యామ్రీ కొత్త వెర్షన్ డిసెంబర్ 11వ తేదీన జరిగే ఈవెంట్‌లో భారతదేశంలో లాంచ్ కానుంది. ఇది పూర్తిగా కొత్త ఇంటీరియర్‌తో వచ్చే క్యామ్రీ ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్. టయోటా క్యామ్రీ డిజైన్ లెక్సస్ లాగా ఉంటుంది. భారతీయ మార్కెట్లో ఈ కారు గత కొన్నేళ్లుగా హైబ్రిడ్ కార్ల విభాగంలో ముందుకు దూసుకుపోతుంది.


కొత్త టొయోటా క్యామ్రీని మునుపటి వెర్షన్ లాగా భారతదేశంలో అసెంబ్లింగ్ చేయవచ్చు. దీన్ని స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో కొనుగోలు చేయవచ్చు. మునుపటి వెర్షన్‌తో పోలిస్తే ఈ కారును అప్‌డేట్ చేసిన ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో లాంచ్ చేసే అవకాశం ఉంది. టయోటా క్యామ్రీ మునుపటి కంటే షార్ప్ లుక్‌తో మార్కెట్లో లాంచ్ అయింది. దీంతో పాటు కొత్త బంపర్ డిజైన్ కారణంగా ఈ కారు ప్రస్తుత క్యామ్రీ హైబ్రిడ్ కంటే కొంచెం పెద్దదిగా ఉంటుందని భావిస్తున్నారు. 


మరోవైపు అక్టోబర్‌లో టయోటా సేల్స్‌లో బాగా దూసుకుపోయింది. ఒక్క నెలలోనే ఏకంగా 30,845 యూనిట్లను విక్రయించింది. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే ఏకంగా 41 శాతం వృద్ధిని కనపరిచింది. ఇప్పుడు టయోటా క్యామ్రీ హైబ్రిడ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లాంచ్ అయితే టయోటా సేల్స్ మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంది.



Also Read: సేఫ్టీ రేటింగ్‌లో దుమ్ము దులుపుతున్న థార్ రోక్స్ - సెక్యూరిటీ ఫీచర్లు అదుర్స్!


కొత్త టయోటా క్యామ్రీలో ఏ ఫీచర్లు ఉండవచ్చు?
ఇది కాకుండా కొత్త టయోటా క్యామ్రీ కొత్త డ్యాష్‌బోర్డ్ డిజైన్ ఆర్కిటెక్చర్‌తో కూడిన కొత్త టచ్‌స్క్రీన్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది వైర్‌లెస్ యాపిల్ కార్ ప్లే ఫీచర్లతో పాటు ఏడీఏఎస్ ఫీచర్లను కూడా పొందవచ్చని భావిస్తున్నారు. దీంతో పాటు క్యామ్రీలో స్టీరింగ్ అసిస్ట్, కర్వ్ స్పీడ్ తగ్గింపుతో కూడిన డైనమిక్ రాడార్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ అలర్ట్, ప్రీ కొలిజన్ బ్రేకింగ్ సిస్టం ఫీచర్లు ఉన్నాయి.


టయోటా క్యామ్రీ ఇంజిన్ ఎలా ఉంది?
అప్‌డేట్ చేసిన టయోటా క్యామ్రీ ఇంజిన్ గురించి చెప్పాలంటే ప్రస్తుత మోడల్‌లో 2.5 లీటర్ హైబ్రిడ్ ఇంజన్ ఉన్నట్లుగానే కొత్త క్యామ్రీ కూడా 2.5 లీటర్ హైబ్రిడ్ ఇంజన్‌ని పొందనుంది. ఇది ఫ్రంట్ వీల్, ఆల్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్‌లో ఉంటుంది. కొత్త టయోటా క్యామ్రీ హైబ్రిడ్ ఇంజన్ 222 బీహెచ్‌పీ అవుట్‌పుట్‌ను జనరేట్ చేస్తుందని అంచనా. ఇది ప్రస్తుత మోడల్ కంటే 9 హెచ్‌పీ ఎక్కువ.



Also Read: రూ.10 లక్షల్లోపు ఆరు ఎయిర్‌బ్యాగ్స్ ఉన్న కార్లు ఇవే - మహీంద్రా నుంచి మారుతి వరకు!