Actress Kasturi In Hyderabad: తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి పరారీలోనే ఉంది. గత కొద్ది రోజులుగా చెన్నైలోని తన నివాసానికి తాళం వేసి ఉన్న నేపథ్యంలో.. ఆమె హైదరాబాద్ లోనే తలదాచుకున్నట్లు  తమిళ పోలీసులు అనుమానిస్తున్నారు.  ఆమె కోసం రెండు ప్రత్యేక బృందాలు హైదరాబాద్ కేంద్రంగా గాలింపు చర్యలు చేపట్టాయి.  ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినా, కోర్టు ఆమె పిటిషన్ ను కొట్టి వేసింది. ఈ నేపథ్యంలో ఆమె ఓ నిర్మాత సాయంతో హైదరాబాద్ లోనే ఉంటున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.  ఆమెను అరెస్టు చేసేందుకు చెన్నై పోలీసులు ప్రయత్నిస్తున్నారు.


తెలుగు మాట్లాడే వారిపై అనుచిత వ్యాఖ్యలు


కొద్ది రోజుల క్రితం హిందూ పీపుల్స్ పార్టీ చెన్నైలో నిర్వహించిన ఓ నిరసన కార్యక్రమంలో నటి కస్తూరి పాల్గొన్నది. ఈ సందర్భంగా తెలుగు మాట్లాడే వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఒకప్పుడు అంతపురంలో సేవలు చేసేందుకు వచ్చిన వాళ్లు ఈ రోజు హిందువులమని చెప్పుకుంటున్నారని విమర్శించింది.  అసలు వాళ్లు హిందువులే కాదని కామెంట్ చేసింది. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ తర్వాత కస్తూరి క్షమాపణలు చెప్పింది. అయినా, తెలుగు వారు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు స్టేషన్లలో ఆమెపై కేసులు పెట్టారు. తెలుగు వారిని కించపరిచిన కస్తూరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.. ఈ నేపథ్యంలో మధురై, తిరునగర్, అండిపట్టి సహా పలు పోలీస్ స్టేషన్లలో ఆమెపై కేసులు నమోదయ్యాయి.  



Also Read: ధనుష్ చేసిన దాంట్లో తప్పేముంది? నయనతారకు షాక్ ఇచ్చేలా నెటిజనుల రియాక్షన్


ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన న్యాయస్థానం


అటు ఈ కేసుకు సంబంధించి కస్తూరి ముందస్తు బెయిల్‌ను కోరింది. ఈ పిటిషన్ ను జస్టిస్ ఆనంద్ వెంకటేష్ విచారించారు. ఆమెకు బెయిల్ ఇవ్వకూడదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యర్థించారు.  కస్తూరి తరఫు న్యాయవాది వాదిస్తూ.. ‘‘కస్తూరి కొంతమంది వ్యక్తులను మాత్రమే ప్రస్తావించారు. జనరలైజ్ చేస్తూ చెప్పలేదు. తన వ్యాఖ్యల పట్ల ఆమె విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆమెకు బెయిల్ ఇవ్వాలి” అని కోరారు. ‘‘కొంత మందిని మాత్రమే ప్రస్తావిస్తే అంతఃపురం అనే పదం ఎందుకు వస్తుంది? తెలుగు మాట్లాడే అమ్మాయిలు ఎందుకు వస్తారు? పశ్చాత్తాపంలో తన మాటలను సమర్థిస్తున్నాననే భావన కలుగుతుంది. అంతఃపురం ప్రత్యేక పదానికి ఆమె విచారం వ్యక్తం చేయలేదు. అందుకే బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తున్నాను” అని తీర్పు చెప్పారు. 


ఈ నేపథ్యంలోనే కస్తూరిని పట్టుకునేందుకు 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. చెన్నై నుంచి పారిపోయిన నటి కస్తూరి హైదరాబాద్ లోనే ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వెతికి పట్టుకునేందుకు  ఈ టీమ్స్ ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె సెల్ ఫోన్లు కూడా స్విచ్ఛాప్ లో ఉన్నాయి. సోషల్ మీడియాలోనూ ఎలాంటి పోస్టులు పెట్టడం లేదు. త్వరలోనే ఆమెను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.  



Read Also: తమిళ సినిమా పరిశ్రమలో విషాదం... లివర్ సంబంధిత సమస్యలతో యంగ్ డైరెక్టర్ మృతి