CM Chandrababu Pays Tribute Brother Rammurthy Naidu: తన సోదరుడు రామ్మూర్తి నాయుడు (Rammurthy Naidu) మరణంపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి చేరుకున్న ఆయన.. తన తమ్ముడి పార్థివ దేహానికి నివాళి అర్పించారు. సోదరుడి భౌతిక కాయాన్ని చూసి చలించిపోయారు. తనను విడిచి తన సోదరుడు వెళ్లిపోయాడని.. తమ నుంచి దూరమై మా కుటుంబంలో ఎంతో విషాదం నింపాడన్నారు. అలాగే, ప్రజా జీవితంలో పరిపూర్ణ మనసుతో తమ్ముడు రామ్మూర్తినాయుడు ప్రజలకు సేవ చేశారని చెప్పారు. సోదరుడి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. తమ్ముడి కుమారులు గిరీష్, రోహిత్‌లను ఓదార్చారు. అటు, రామ్మూర్తినాయుడు భౌతిక కాయాన్ని స్వగ్రామం నారావారిపల్లెకు తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం అంత్యక్రియలు జరగనున్నాయి. రామ్మూర్తినాయుడు మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.






చికిత్స పొందుతూ కన్నుమూత


చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కార్డియాక్ అరెస్ట్ కావడంతో శనివారం తుదిశ్వాస విడిచారు. తమ్ముడి మరణ వార్త తెలిసిన వెంటనే ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని హైదరాబాద్ చేరుకున్నారు. మంత్రి నారా లోకేశ్ సైతం తన కార్యక్రమాలు రద్దు చేసుకుని హైదరాబాద్‌కు వచ్చారు.


1994లో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక


నారా కర్జురనాయుడు, అమ్మన్నమ్మ దంపతుల పెద్ద కుమారుడు చంద్రబాబు కాగా, రెండో కుమారుడు నారా రామ్మూర్తినాయుడు. వీరి స్వస్థలం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నారావారిపల్లె. సోదరుడు చంద్రబాబు పార్టీ టీడీపీలో కీలకంగా మారుతున్న సమయంలో రామ్మూర్తి నాయుడు టీడీపీ నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. 1994 ఎన్నికల్లో చంద్రగిరి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమి చెందగా, రామ్మూర్తి నాయుడు రాజకీయాల నుంచి వైదొలిగారు. రామ్మూర్తి నాయుడుకు సంతానం నారా రోహిత్, నారా గిరీష్ ఉన్నారు. గత నెలలోనే హీరో నారా రోహిత్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. నారా, నందమూరి కుటుంబ సభ్యుల సమక్షంలో అక్టోబర్ 13న ఈ వేడుక సాగింది. మరికొన్ని రోజుల్లో రోహిత్ పెళ్లిపీటలు ఎక్కాల్సి ఉండగా ఇంతలోనే ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.


Also Read: CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు