Ashada Masotsavam 2024: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాడమాసోత్సవాలు ఏటా వైభవంగా నిర్వహిస్తుంటారు. ఆషాడమాసంలో ఆడపిల్లలు పుట్టింటికి చేరుకుంటారు...అలాగే దుర్గమ్మను కూడా తమ ఇంటి ఆడపడుచుగా భావించి చీరె,సారె, పూజ సామగ్రి సమర్పించనున్నారు భక్తులు. కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే కాదు తెలంగాణ నుంచి కూడా భారీగా భక్తులు తరలివచ్చి అమ్మకు మొక్కులు చెల్లించుకుంటారు. ఇలా అమ్మవారికి సారె పెట్టేందుకు వచ్చే భక్త బృందాలకు ఘనంగా స్వాగతం పలికి..ప్రత్యేక క్యూలైన్లలో దర్శనానికి ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. గర్భగుడిలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుని ఆ తర్వాత మహా మండపంలో ఉన్న ఉత్సవ మూర్తికి సారె సమర్పించిన తర్వాత..తమతో పాటూ వచ్చిన మిగిలిన భక్తులకు కూడా పసుపు కుంకుమ ఇచ్చిపుచ్చుకుంటారు. 


Also Read:  ఆషాడం వచ్చేస్తోంది..ఇక కొత్త దంపతులు జరగండి జరగండి - అసలు ఎందుకీ నియమం!


నెల రోజులు పండుగ వాతావరణం


ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు, భవానీ దీక్షలు, శ్రావణమాసంలో నిర్వహించే ఉత్సవాల తర్వాత స్థానం ఆషాడమాసోత్సవాలదే. ఈ ఏడాది జూలై 6 న ప్రారంభమయ్యే ఆషాడమాసం ఆగష్టు 4 న ముగుస్తుంది. ఈ నెల రోజులు కొండపై పండుగ వాతావరణమే..భక్త బృందాల సారె సమర్పణల, వారాహి నవరాత్రులు, శాకంబరీ ఉత్సవాలతో సహా దుర్గమ్మకి కూడా బోనాలు సమర్పిస్తారు. ఈ మేరకు ఆలయ మహా మండపం ఆరో అంతస్తులో అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రతిష్టిస్తారు...సారె సమర్పించేందుకు భారీగా భక్తులు తరలివస్తారన్న అంచనా మేరకు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవో కేఎస్‌ రామరావు అధికారులతో పలు మార్లు సమీక్ష సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆషాఢ మాసోత్సవాలు, వారాహి నవరాత్రులు, శాకంబరీ  ఉత్సవాలతో పాటూ ప్రతి శుక్రవారం, శనివారం భక్తుల రద్దీ మరింత పెరగనుంది. ఈ మేరకు కీలక ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని నియమిస్తున్నామని..భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు ఈవో కేఎస్ రామారావు.  


శాకాంబరి ఉత్సవాలు


ఆషాడమాసంలోనే శాకాంబరి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ మేరకు కూరగాయలు, పండ్లు, ఆకు కూరలతో అమ్మవారిని  విశేషంగా అలంకరిస్తారు. దేశమంతా పచ్చగా ఉండాలని, పాడి పంటలతో కళకళలాడాలని అమ్మను ప్రార్థిస్తూ శాకాంబరి ఉత్సవాలు నిర్వహిస్తారు. శాకాంబరి అమ్మవారి గురించి దేవీభాగవంతో పాటూ మార్కండేయ పురాణంలోనూ ఉంది.  


Also Read: దాన వీర శూర 'కర్ణుడు' నిజంగా హీరోనేనా? విలన్ ని చేశారా..భీష్ముడు ఏం చెప్పాడంటే!


2017 నుంచి ప్రారంభమైన సారె సమర్పణ


2016 లో  కృష్ణానది పుష్కరాలు జరిగిన ఏడాది నగరానికి చెందిన భక్తుల బృందం అమ్మవారికి సారె సమర్పించారు. అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి కైవల్యాకృతి సేవా సమితి పేరుతో....మేళతాళాలతో తరలి వెళ్లి...  పట్టుచీర, పూలు, పండ్లు, వివిధ రకాల స్వీట్లు, పసుపు, కుంకుమ సమర్పించారు.    2017లోనూ ఈ సేవా సమితి అమ్మవారికి సారెను సమర్పించాలని నిర్ణయించి ఆలయ ఈవోని సంప్రదించారు. అప్పటి నుంచి దుర్గమ్మకు సారె సమర్పించే కార్యక్రమాన్ని దేవస్థానం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించడం ప్రారంభించారు. అదే రోజు నగరంలో ఉన్న అమ్మవారి ఆలయాల్లోనూ స్థానిక భక్తులు సారె సమర్పిస్తున్నారు.  


Also Read: ఈ దుర్మార్గపు ఆలోచన కర్ణుడిదా? మహాభారతంలో అత్యంత కీలకఘట్టం వెనుక అసలు నిజం తెలిస్తే ఆశ్చర్యపోతారు!