వేదానికి సరైన అర్ధం చెప్పిన వ్యక్తి, అంటరానితనం, ఛాందసభావాలను రూపుమాపేందుకు కృషిచేసిన మహాసంస్కర్త, భక్తి, శరణాగతి, సేవ వంటి సుగుణాలతో భగవంతుణ్ణి చేరుకోవచ్చన్న విశిష్టాద్వైతాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు రామానుజాచార్యుడు. ఆయన మరణించి వెయ్యేళ్లు అయినా ఇప్పటికీ ఆ శరీరం భద్రపరిచి ఉంది
రామానుజులు క్రీస్తు శకం 1017 సంవత్సరంలో చెన్నై పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపెరంబుదూరు (భూతపురి)లో జన్మించారు. దాదాపు 123 ఏళ్లు జీవించిన రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రచారానికి విశేష కృషి చేశారు. ఆయన జీవిత కాలంలో సగభాగం తమిళనాడులోని శ్రీరంగం, కాంచీపురం క్షేత్రాల్లోనే గడిపారు. వేంకటేశ్వరుడి పరమభక్తుడు తిరుమల నంబి... రామానుజాచార్యులకు మేనమామ. విశిష్టాద్వైతాన్ని, ఆళ్వారుల వైభవాన్ని, భక్తిమార్గాలను మేనల్లుడికి పరిచయం చేసింది ఆయనే. భక్తి, పాండిత్యం, సంస్కరణ తత్వం కలిగిన తల్లి కాంతిమతి నుంచి రామానుజాచార్యులు అభ్యుదయ భావాలను అలవరచుకున్నారు. అందుకే ఆయన మూఢాచారాలను వ్యతిరేకించేవారు.
ఆత్మప్రబోధంతో కొన్నిసార్లు గురువులకు కూడా కనువిప్పు కలిగించారు. ఒకసారి ఆయన గురువు గోష్ఠిపూర్ణ ‘ఓమ్ నమో నారాయణాయ’ అనే అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశించి, ‘దీన్ని గోప్యంగా ఉంచాలి! ఎన్నడూ, ఎవరికీ చెప్పకు’ అన్నారు. కానీ ఆ మహామంత్ర జపంతో లభించే ఆధ్యాత్మిక ఫలం కొద్దిమందికే పరిమితం కాకూడదు అనుకున్నారు రామానుజులు. మర్నాడు స్థానికులందరినీ సౌమ్యనారాయణ ఆలయం వద్దకు ఆహ్వానించి, అష్టాక్షరీ మంత్రాన్ని వినిపించారు. గురువు ఉపదేశించిన విజ్ఞానాన్ని దాపరికం లేకుండా ప్రకటించారు. అందుకు గోష్ఠిపూర్ణులు ఆగ్రహించి, ఫలితంగా నరకానికి వెళతావంటూ మందలించారు. దానికి రామానుజులు ‘గురువర్యా! ఇదిగో, ఇంతమంది ఆధ్యాత్మికోన్నతి సాధించారు. నేనిక నరకానికి వెళ్లినా చింతలేదు’ అన్నారు వినయంగా. గురువు పశ్చాత్తాపంతో రామానుజులను ఆలింగనం చేసుకుని, ‘నువ్వు నాకు శిష్యుడివి కాదు, గురువువి!’ అన్నారు.
సమాజంలో రావాల్సిన సంస్కరణలు తొలుత మతాలు, ఆలయాల నుంచే ఆరంభం కావాలని రామానుజులు ఆకాంక్షించారు. అందుకే ఆలయాల్లోని అస్తవ్యస్త పరిస్థితులను, అక్రమాలను సరిదిద్దారు. ఆధ్యాత్మికత పేరుతో జరుగుతున్న ఆగడాలను అరికట్టారు. తన నిర్వహణలోని శ్రీరంగనాథ దేవాలయం నుంచే సంస్కరణలు ఆరంభించారు. మూఢాచారాలకు స్వస్తి పలికారు. కుల వివక్ష లేకుండా భగవంతుణ్ణి దర్శించుకునేలా, పెరుమాళ్ల ఉత్సవంలో అందరూ పాల్గొనేలా విధి విధానాలను సవరించారు.
ఏడు ప్రాకారాలతో నిర్మితమైన శ్రీరంగనాథ ఆలయంలో అడుగడుగునా ఎన్నో ప్రత్యేకలున్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది శ్రీ రామానుజాచార్యుల వారి శరీరం. క్రీస్తు శకం 11 - 12 శతాబ్ధాల మధ్య రామానుజాచార్యులు శ్రీరంగంలో శరీరాన్ని విడిచి పెట్టారు. అప్పటి నుంచి ప్రత్యేక లేపనాలను అద్ది ఆయన శరీరాన్ని భద్రపరుస్తున్నారు. శ్రీరంగంలోని 4వ ప్రాకారంలో ఉన్న రామానుజాచార్యుల ఆలయాన్ని సందర్శించినా... అక్కడ ఉన్నది ఆయన దివ్య శరీరం అని మాత్రం గుర్తించలేరు. పద్మాసనంలో యోగ భంగిమలో కూర్చుని రామానుజులు ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టారు. ఆ కూర్చున్న భంగిమలోనే ఇప్పటికీ ఆ శరీరం కనిపిస్తుంది. ఏటా రెండు సార్లు ఆయన కోసం ఓ ఉత్సవం నిర్వహిస్తారు. ఆ సమయంలో కర్పూరం, కుంకుమ పువ్వును ఓ ముద్దగా నూరి రామానుజుల శరీరానికి పూస్తారు. అందువల్ల ఆయన శరీరం ఓ ఎర్రని వర్ణంలో విగ్రహంలా మెరుస్తూ కనిపిస్తుంది. అయితే హారతి ఇచ్చే సమయంలో ఆయన కళ్లు, గోర్లను మనం స్పష్టంగా గుర్తించవచ్చు. కుంకుమ పువ్వు లేపనాన్ని అక్కడ అద్దకపోవడం వల్ల హారతి వెలుగులలో అవి మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాయంటారు...
Also Read: ముచ్చింతల్ లో రామనుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల షెడ్యూల్ ఇదే..
Also Read: శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లో కొలువుతీరనున్న శ్రీరామానుజాచార్యుల విగ్రహం ప్రత్యేకతలివే…