చరిత్రకు మనం బానిసలు కాకూడదు కానీ అదే సమయంలో మన చరిత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ మరువకూడదు అన్నారు చాచా నెహ్రూ. ఏ ప్రాంతానికైనా దాని చరిత్రను చెప్పే ఆనవాళ్ళు తప్పకుండా ఉంటాయి. చారిత్రిక స్మృతులకు ఖ్యాతినార్జించిన విశాఖ నగరంలో కూడా అలనాటి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటి తరానికి పెద్దగా తెలియని అలాంటి అరుదైన జ్ఞాపికల్లో నగరంలోని వన్ టౌన్ వద్ద గల పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్న క్వీన్ విక్టోరియా కాంస్య విగ్రహం ఒకటి. నగరంలోని 118 ఏళ్ల పైగా చరిత్ర ఉన్న ఈ స్మారకం ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురవుతోంది.
ఇంతకీ ఈ విగ్రహం విశాఖకు రావడానికి కారణం షేర్ మహమ్మద్ పురంతో పాటు యమ్రుమ్ ఎస్టేట్స్ జమీందార్ అంకితం వెంకట జగ్గారావు తన ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా 1900 లో విక్టోరియా మహారాణిని, ప్రిన్స్ ఆఫ్ వేల్స్‌ను కలిశారు. ఆ సందర్భంగా ఆయన్ను సన్మానించిన బ్రిటీష్ ప్రభుత్వం విక్టోరియా మహారాణి కాంస్య విగ్రహాన్ని విశాఖ నగరానికి కానుకగా బహూకరించింది. 1904 మే 4 న విశాఖ కలెక్టర్ ఆర్‌హెచ్ క్యాంప్ బెల్ ఆ కాంస్య రాతి వేదికను, స్మారక మందిరాన్ని నిర్మించి అందులో విక్టోరియా మహారాణి కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇప్పటికీ ఆ గోడ గాని, విగ్రహం గానీ అంతే ఠీవిగా నిలుచున్నాయి. ఈ విగ్రహం పేరు మీదుగా ఈ ప్రాంతానికి రాణీ బొమ్మ సెంటర్ అనే పేరు కూడా వచ్చిందని వైజాగ్ అసిస్టెంట్ డైరెక్టర్ (ఆర్కియాలజీ ) వెంకట రావు తెలిపారు.
అయితే విశాఖ నగరం లోని పోర్ట్ కాలుష్యం, ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా కాంస్య విగ్రహం కాస్తా తన రూపం మార్చుకుని నల్లగా మారింది. ప్రస్తుతం ఈ విగ్రహం కాంస్యంతో చేసింది అంటే ఎవరూ నమ్మలేని పరిస్థితి నెలకొంది. అలాగే విగ్రహం చేతిలో గోళంతో పాటు మరో చేతిలో బ్రిటిష్ రాజదండం ఉండేదని, అయితే కాలగమనంలో ఆ రాజదండం కనిపించకుండా పోయిందని వైజాగ్ వాసి కోన ప్రమీల తెలిపారు.
ఏదేమైనా వైజాగ్ నగర చరిత్రకు సాక్ష్యంగా నిలిచే ఇలాంటి అద్భుతమైన, అరుదైన పురాతన స్మారకాలు మరుగున పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు నగర పాలక సంస్థపై ఉందని స్థానికులు అంటున్నారు.
Also Read: Snake Catcher Bhaskar Naidu: టీటీడీ స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు ఆరోగ్యంపై వైద్యులు ఏమన్నారంటే..
Also Read: Weather Updates: ఏపీ, తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. అకాల వర్షాలతో పెరిగిన చలి తీవ్రత..