వెయ్యేళ్ల క్రితం ధరాతలంపై నడయాడిన సమతామూర్తి జగద్గురు శ్రీరామానుజాచార్యులు మళ్లీ మనకు దర్శనమివ్వనున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లో 45 ఎకరాల విస్తీర్ణంలో శిల్పకళా శోభితమైన కళ్లు చెదిరే నిర్మాణాలు, వందకు పైగా ఆలయాల గోపురాలపై దేవతా మూర్తులతో ఆధ్యాత్మిక పరిమళాల మధ్య 216 అడుగుల భారీ లోహ విగ్రహం కొలువుతీరింది. శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి సంకల్పంతో ముచ్చింతల్ దివ్యక్షేత్ర పనులు 2016లో ప్రారంభమయ్యాయి. 45 ఎకరాల విస్తీర్ణంలో రూ.1000 కోట్లతో పనులు జరిగాయి. పల్లవ, చోళ, చాళుక్య, కాకతీయ, విజయనగర నిర్మాణ శైలులను మేళవించి నిర్మాణాలు జరిగాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన 2700 మంది శిల్పులు పాల్గొన్నారు. ప్రధానంగా.. సమతామూర్తి 216 అడుగుల మహా పంచలోహ విగ్రహాన్ని చైనాలో తయారు చేయించారు. దీని బరువు 1800 కిలోలు. తొమ్మిది నెలల పాటు శ్రమించి..1600 భాగాలుగా విగ్రహాన్ని తయారు చేశారు. ఆ భాగాలను మనదేశానికి తీసుకొచ్చిన తర్వాత చైనాకు చెందిన 60 మంది నిపుణులొచ్చి విగ్రహ రూపునిచ్చారు.
Also Read: యజ్ఞయాగాదులు దేవుడికోసం అనుకుంటే మీరు పొరబడినట్టే...
వాతావరణ మార్పులను తట్టుకుని వెయ్యేళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కూర్చున్న భంగిమలో ఉన్న అత్యంత ఎత్తైన విగ్రహాల్లో ఈ సమతామూర్తి విగ్రహం రెండోది కావడం విశేషం. మహా విగ్రహం కింద విశాలంగా ఉన్న గర్భగుడిలో 120 కిలోల బంగారు విగ్రహ రూపంలో రామానుజులు నిత్యపూజామూర్తిగా కనిపిస్తారు. ఈ విగ్రహం చుట్టూ సప్తవర్ణ కాంతులు ప్రసరించే విధంగా ఏర్పాట్లు చేశారు. విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు వేదికను సిద్ధం చేశారు. ఈ గది ప్రధాన ద్వారంతో పాటు ఇతర ద్వారాలకు బంగారు రేకులను తొడిగారు. ఫిబ్రవరి 5న ముచ్చంతలకు రానున్న ప్రధాని మోదీ ఆ రోజు మధ్యాహ్నం మూడున్నర గంటలకు విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేస్తారు. 13వ తేదీన రానున్న రాష్ట్రపతి కోవింద్.... ప్రధానాలయంలోని నిత్యపూజామూర్తి బంగారు విగ్రహానికి తొలి పూజ చేయడం ద్వారా ఆవిష్కరిస్తారు. ఈ వేడుకలను ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరుండి పర్యవేక్షించనున్నారు.
ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు 12 రోజుల పాటూ జరగనున్న శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో దేశం నలుమూలల నుంచి 5వేల మంది రుత్వికులు పాల్గొననున్నారు. 120 యాగశాలల్లో 1035 హోమగుండాలను సిద్ధం చేశారు.
Also Read: నవగ్రహాల ఆరాధన వల్ల ఏం జరుగుతుంది… గ్రహ దోషాల నుంచి విముక్తి పొందాలంటే నిత్యం ఈ శ్లోకం చదవండి..
Also Read: ఈ ముఖి రుద్రాక్ష ధరిస్తే ఐశ్వర్యం-అదృష్టం.. ఈ ముఖి రుద్రాక్ష వేసుకుంటే మృత్యుదోషం పోతుందట...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి