Importance of Rama Rajyam
కలియుగంలో రామరాజ్యం సాధ్యమేనా!
- అధికారం కోసం కుట్రలు...
- గెలుపు కోసం ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు..
- తప్పొప్పులతో సంబంధం లేకుండా బురదచల్లుకోవడం..
- ప్రజావసరాలతో పట్టింపులేదు..
- అభివృద్ధి అనేమాటే అస్సలు వినిపించదు..
- అవినీతిలో పోటీ పడుతుంటారు...
కలియుగంలో పాలకుల లక్షణాలు
స్వధర్మాన్ని విడిచిపెట్టి చెడ్డవారితో స్నేహం చేస్తారు. శూరత్వం ఉండదు. దొంగలే పాలకులవుతారు, పాలకులు దొంగల్లా ప్రవర్తిస్తారు..ఇవే కలియుగంలో పాలకుల లక్షణాలు అని పండితులు ఎప్పుడో చెప్పారు. అసలు కలియుగం అంటేనే ధర్మం ఒంటికాలిపై నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మన పాలకులు...రామరాజ్యం తీసుకొచ్చేస్తాం అని ప్రసంగాల్లో ఊదరగొడుతుంటారు. ఇది సాధ్యం కావాలంటే అసలు రామరాజ్యం ఎలా ఉంటుందో తెలుసా?
Also Read: రామాయణం - మహాభారతం రెండింటిలోనూ కామన్ గా కనిపించే ముఖ్యమైన క్యారెక్టర్స్ ఇవే!
ఘనంగా పట్టాభిషేకం
వనవాసం పూర్తిచేసుకుని అయోధ్యలో అడుగుపెట్టిన రాముడికి సాదరంగా స్వాగతం పలికాడు తమ్ముడు భరతుడు. తిరిగి రమ్మని అడిగితే నీ పాదుకలని ఇచ్చి రాజ్య పాలన చేయమన్నావు...నాకు నువ్వు రాజ్యాన్ని ఎలా ఇచ్చావో అలాగే తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెడుతున్నాను అన్నాడు. భరతుడి మాటలకి సంతోషించిన రాముడు తిరిగి రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరించాడు. నలుగురు సోదరులు క్షురకర్మలు చేయించుకుని మంగళస్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి..దివ్యాభరణాలు వేసుకున్నారు. కోడలికి అభ్యంగన స్నానం చేసి అలంకరించి చూసుకుని మురిసిపోయింది కౌసల్యాదేవి. మంగళవాయిద్యాలు, వేదమంత్రాలలో అయోధ్య మారుమోగిపోయింది. వశిష్ఠుడు, జాబాలి, కాశ్యపుడు, గౌతముడు సహా ఋషులందరూ రాముడి పట్టాభిషేకానికి అన్నీ సిద్ధం చేశారు. నాలుగు సముద్రాల నుంచి జలాలు, ఐదువందల నదుల జలాలను వానరులు తీసుకొచ్చారు. ఆ జలాలతో అభిషేకం చేసి ఘనంగా పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించారు. యువరాజుగా పట్టాభిషేకం భరతుడికి జరిగింది. ఈ సందడంతా పూర్తయ్యాక రాముడి పాలన ప్రారంభమైంది..
Also Read: ఎవరినైనా పొగిడినప్పుడు 'సాక్షాత్తు రామచంద్రుడే' అంటాం - రాముడిలో అంత గొప్పదనం ఏంటి!
రామరాజ్యం ఇలా ఉండేది
- శ్రీ రామచంద్రుడు సింహాసనం అధిష్టించిన రోజు నుంచీ రామ అనే మాట తప్ప ఆ రాజ్యంలో మరో పేరు వినిపించలేదు
- ప్రజలు, పాలకులు ధర్మబద్ధులై వుండేవాళ్లు..రామరాజ్యంలో దొంగల భయం లేదు
- అందరూ ఆరోగ్యవంతులుగా ఎలాంటి రోగాలు లేకుండా సుఖంగా జీవించేవారు
- వర్షాలు సకాలంలో కురిసేవి..ప్రజలు తమ వృత్తుల్లో రాణించేవారు
- రామచంద్రుని పాలనలో అసత్యాలు, దుర్వార్త ప్రచారం, పుకార్లకు చోటులేదు
- మనిషి ప్రశాంతంగా, సంతృప్తిగా ఎలా జీవించాలో అందుకు అవసరమైన పరిస్థితులు రాముడు పాలించిన రాజ్యంలోనే ఉన్నాయి
- ధర్మ ప్రవర్తనతో అకాల మరణాలు ఉండేవి కావు
Also Read: వనవాసానికి వెళ్లేముందు తల్లిదండ్రులు, రాజగురువుతో రాముడి సంభాషణ ఇదే!
పాలకులు ప్రజలకు ఏం చెబుతారో ముందుగా ఆచరించి చూపాలి. అప్పుడే ప్రజానీకానికి మార్గదర్శిగా ఉంటారు. రామరాజ్యంలో పాలకుడు ధర్మం తప్పకుండా ఉండడం వల్ల ప్రజలు కూడా పాలకులను అనుసరించారు. అందుకనే పాలన అంటే ఎలా ఉండాలో చెప్పేటప్పుడు రామరాజ్యంని ఉదారహణగా చెబుతారు.. ఇలాంటి పాలన ఈ రోజుల్లో సాధ్యమా-కాదా? అనేది మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా...!