The Five Maha-vratas : యుగయుగాలుగా మహిళను ఉన్నత స్థానంలో నిలబెట్టింది సనాతన ధర్మం. ఆ మహిళల్లో ద్రౌపది, సీత, తార, మండోదరి, కుంతిని పంచకన్యలుగా చెబుతారు..
ద్రౌపది
ద్రుపదుడి యఙ్ఞవాటి నుంచి జన్మించిన శక్తి స్వరూపిణి ద్రౌపది. ఈమె అందమైన, బలమైన స్త్రీ మాత్రమే కాదు... మంచి వ్యూహకర్త. కురుసభలో దుశ్శాసనుడు, అడవిలో సైంధవుడు, విరాటరాజు కొలువులో కీచకుడు ఇలా ఎంతో మందినుంచి అవమానాలు, వేధింపులు ఎదుర్కొంది. కానీ ఎక్కడా తొణకలేదు..వ్యూహాత్మకంగా వ్యవహరించి ఒక్కొక్కరికీ బుద్ధిచెప్పింది. అహంకారంతో వ్యవహరించే రాజులను నాశనం చేసేందుకే శచీదేవి ఈ అవతారం ఎత్తిందని చెబుతారు. నిండు సభలో జరిగిన అవమానం గుర్తుచేసుకుని పాండవులను యుద్ధం దిశగా నడిపించింది ఈమె. అంటే పరోక్షంగా కురుక్షేత్ర యుద్ధానికి కారణం ద్రౌపదినే. తనను వెలియాలి చూసి ఈడ్చుకొచ్చిన దుశ్శాననుడి రక్తం కళ్లచూసేంతవరకూ ముడివేయనంది..ఆ శపథం నెరవేర్చుకుంది.
Also Read:సెల్ప్ రెస్పెక్ట్ కి ఇంతకన్నా నిదర్శనం ఎవరుంటారు, అందుకే ఆమె తరతరాలకు ఆదర్శం
సీత
జనకమహారాజు కుమార్తె, శ్రీరాముని ధర్మపత్ని అయిన సీతమ్మ సహనానికి మారుపేరు. క్షమాగుణంలో తల్లి భూదేవిని మించిన తనయ అనిపించుకుంది. పుట్టినింట్లో ముద్దుగా పెరిగిన సీత మెట్టినింట్లో అడుగుపెట్టినప్పటి నుంచి తిరిగి భూదేవి ఒడికి చేరేవరకూ ఎన్నో కష్టాలు పడింది. ఎక్కడా ఆత్మస్థైర్యం కోల్పోలేదు. ఉత్తమ భార్యగా భర్త వెంట నడిచింది.. ఉత్తమ తల్లిగా పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించింది.
మండోదరి
రావణాసురుడి భార్య అయిన మండోదరి పంచకన్యల్లో ఒకరు. ఈమె మాయాసురుడి కుమార్తె. రావణాసురుడు ఈమెను మోహించి ఎత్తుకొచ్చి రాక్షస వివాహం చేసుకుంటాడు. అయినప్పటికీ పతియే ప్రత్యక్షదైవం అని ఉత్తమభార్యగా నిలిచింది. దుర్మార్గుడైన రావణుడిని సన్మార్గంలో నడిపించేందుకు తాపత్రయపడింది. సీతమ్మను ఎత్తుకొచ్చినప్పుడు కూడా హెచ్చరించింది, అభ్యర్థించింది. కానీ రావణుడు మండోదరి మాట పట్టించుకోలేదు. అలా భార్య మాట పెడచెవిన పెట్టి తన పతనాన్ని తానే కొనితెచ్చుకున్నాడు. లంకలో రాక్షసుల మధ్యనే ఉన్నప్పటికీ ఆమె తులసిమొక్కలానే వెలిగింది.
తార
తార అంటే..రామాయణంలో వాలి, సుగ్రీవులు ఉంటారు కదా వారిలో వాలి భార్య. వాలి మరణానంతరం వానర రాజనీతిని ప్రకారం సుగ్రీవుడి భార్య అయింది. తన కుమారుడైన అంగదుడిని కాపాడుకునేందుకు అండం అవసరం...అలా రాముడి సలహా అనుసరించి సుగ్రీవుడిని వివాహం చేసుకుంది. లౌకిక పరిస్థితులను గమనిస్తూ భర్తకు సహకరించేదే భార్య అని చాటిచెప్పింది తార.
కుంతి
పాండురాజు భార్య, పాండవుల తల్లి కుంతీదేవి. చిన్నతనంలో దుర్వాసుడి నుంచి వరం పొందుతుంది. ఆ వరం ప్రకారం తాను కోరుకున్నప్పుడు ఏ దేవుడైనా ప్రత్యక్షమై సంతానప్రాప్తి కలిగించేలా దీవించాడు. అలా ఆ మంత్రాన్ని పరీక్షించేందుకు సూర్యుడిని ప్రార్థిస్తుంది. అప్పుడు జన్మించినవాడే కర్ణుడు. వివాహానికి ముందే జన్మించిన కర్ణుడిని ఓ బుట్టులో పెట్టి నదిలో వదిలేస్తుంది. ఆ తర్వాత పాండురాజుని వివాహం చేసుకుని ఆయన శాపం గురించి తెలుసుకుంటుంది. యమధర్మరాజు , ఇంద్రుడు, వాయుదేవుడు, అశ్వినీదేవతలను ప్రార్థించి పాండవులకు జన్మనిస్తుంది కుంతీదేవి. అనుక్షణం తనయుల వెంటే ఉంటూ వారిలో ధైర్యసాహసాలు నూరిపోయడంలో ఈమెకు ఈమె సాటి.
పంచకన్యల శ్లోకం
అహల్యా, ద్రౌపది, సీతాతారా, మండోదరీ తధా పంచకన్యా స్మరణ
ఈ శ్లోకాన్ని నిత్యం పఠిస్తే దీర్ఘసుమంగళిగా జీవిస్తారని పండితులు చెబుతారు