Spirituality: కాళీకా దేవి కొన్ని ఫొటోల్లో శివుడు ఆమె పాదాల దగ్గర కనిపిస్తాడు. సాధారణంగా భార్యల కాళ్ల దగ్గర కూర్చున్న దేవుళ్లు తక్కువ. రాధాకృష్ణ సంప్రదాయంలో రాధా పాదాల దగ్గర కృష్ణుడు కూర్చుని పాదసేవ చేసే రూపాలు మనకు దర్శనమిస్తాయి. సత్యభామ అలక తీర్చేందుకు శ్రీ కృష్ణుడు కాళ్లదగ్గర కూర్చుంటాడు. అయితే శాక్తేయ సంప్రదాయంలో కాళీదేవి చిత్రాలలో శివుని రూపం ఆమె పాదాల కింద ఉన్నట్టు కనిపిస్తుంది. ఆవేశంతో ఊగిపోతున్న అమ్మవారిని శాంతింపజేసేందుకే శివుడు పాదాల దగ్గర చేరుతాడు శివయ్య. దీనివెనుక ఓ పురాణ గాథ చెబుతారు పండితులు


కాళిగా ఉగ్రరూపం దాల్చిన దుర్గ


రక్తబీజుడు అనే  రాక్షసుడు ఉండేవాడు. ఘోర తపస్సుచేసి బ్రహ్మదేవుడినుంచి వరం పొందుతాడు. తన రక్తపు చుక్క భూమి మీద పడితే వెయ్యిమంది రక్తబీజులు మళ్లీ పుట్టేటట్లు వరం పొందుతాడు. ఈ వర ప్రభావం వల్ల రోజురోజుకు చాలా క్రూరంగా మారిపోతాడు. మునులు, సాధువులు, సాధారణ ప్రజలందరినీ చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. దాంతో దేవతలందరూ వెళ్లి త్రిమూర్తుల వద్ద మొర పెట్టుకుంటారు. త్రిమూర్తులు ఈ విషయంలో దుర్గామాత సాయం కోరుతారు. దుర్గామాత తన అంశ అయిన కాళికా రూపంలో రక్తబీజుడితో యుద్ధం చేయడానికి వెళుతుంది. రాక్షస గణాలను అందరినీ అంతమొందిస్తుంది దుర్గాదేవి. అయితే బ్రహ్మ ఇచ్చిన వరం ఫలితంగా రక్తబీజుడి ఒంటి నుంచి ఒక్క రక్తం చుక్క భూమిపై పడితే అప్పుడే వందల మంది రక్తబీజులు పుట్టుకొస్తారు. దీంతో దుర్గ తలపడి గాయపరిచిన కొద్దీ సైన్యం సంఖ్య పెరుగుతూవచ్చింది. దీంతో ఉగ్రరూపం దాల్చిన దుర్గ.. కాళిగా ఆవిర్భవించింది. సైనికులందర్నీ సంహరించి చివరకు రక్తబీజుడిపై దాడి చేస్తుంది. రక్తబీజుడిని ఒడిసి పట్టుకుని  ఆ రాక్షసుడి శరీరంలో ఉన్న రక్తాన్ని పూర్తిగా తాగేస్తుంది. అనంతరం రక్తబీజుడి తలని చేతిలో పట్టుకుని రక్తం కింద పడకుండా కింద ఓ చిప్ప పట్టుకుంటుంది. దీంతో రక్తబీజుడు మరణిస్తాడు.


Also Read: శిరస్సు లేని ఈ అమ్మవారికి పసుపు నీళ్లతో మొక్కులు తీర్చుకుంటే చాలు


కాళిపై రక్తబీజుడి రక్తం ప్రభావం


రక్తబీజుడి రక్తం దుష్ప్రభావం చూపడంతో కాళి కరాళనృత్యం చేయడం ప్రారంభించింది. భూమిపై ఆమె వేస్తున్న ఒక్కో అడుగుతో  వినాశనం జరుగుతూ ఉంటుంది. దేవతలంతా కలసి వెళ్లి శివుడిని వేడుకుంటారు. కాళిని శాంతింపజేయడానికి యుద్ధభూమికి వచ్చిన శివుడు ఆమెను పరిపరి విధాలుగా ప్రార్థించినా ఆవేశం చల్లారదుయ రాక్షసుల మాంసాన్ని తింటూ నృత్యం కొనసాగిస్తుంటుంది కాళీ..ఆమె కొప్పుముడి తొలిగి కేశరాశిగా మారుతుంది.ఆమె కేశాల నుంచి వెలువడే గాలి దేవతలను దూరానికి విసిరేస్తూ ఉంటుంది. అన్నివిధాలుగా ప్రయత్నించిన శివుడు ఎప్పటికీ కాళి శాంచింతక పోవడంతో చివరకు పాదాల దగ్గరకు చేరుతాడు. అప్పటికి స్పృహలోకి వచ్చిన కాళి..తన పాదాల దగ్గరున్నది భర్త పరమేశ్వరుడు అని తెలుసుకుని కొద్దిసేపటికి శాంతిస్తుంది. అలా శివుడు పాదాలచెంతకు చేరితే కానీ అమ్మవారి ఉగ్రరూపం చల్లారలేదు..




 



Also Read:గర్భాదానం (First Night) ఎందుకు జరిపిస్తారు, మంచి ముహూర్తంలో జరగకపోతే ఏమవుతుంది!



శివుడికి కూడా కాళిరూపమే ఇష్టమట


ఓ సందర్భంలో పార్వతీదేవి పరమేశ్వరుడితో- ‘‘స్వామి.. నేను ఎన్నో రూపాలు ధరించాను. సప్త మాతృకా స్వరూపాలతోను, నవదుర్గ రూపాలతోను, దశమహావిద్యల రూపాలతోను ప్రకాశిస్తూ ఉంటాను. నేను ధరించిన రూపాలలో ఏది మీకు ఎక్కువ ఇష్టం అని అడిగింది. దానికి పరమేశ్వరుడు-  కాళీ స్వరూపం అంటే చాలా ఇష్టం అన్నాడు. ఆశ్చర్యపోయిన పార్వతీదేవి... అందరూ నా సుకుమారమైన లలితా స్వరూపాన్ని ఆరాధిస్తూ ఉంటారు. కానీ మీకు కాళీ రూపం ఇష్టమంటే ఆశ్చర్యంగా ఉంది అంటుంది. అప్పుడు పరమేశ్వరుడు ఏం చెప్పాడంటే...లలితా స్వరూపం అతి సుందరమైనది. కామేశ్వరుడిగా నేను నీ పక్కనే ఉన్నా. ఇలా ప్రతి రూపంలోనూ నీ వెంట ఉన్నా. అయితే కాలానికి అధిదేవతగా కాళిగా ఉన్నప్పుడు నిరాడంబరంగా, నిజమైన దివ్య సౌందర్యంతో ప్రకాశించావు. జ్ఞాన స్వరూపిణిగా వెలిగావు. అందుకే ఆ స్వరూపంలో నేను నీ పాదాల దగ్గర ఉన్నా అని బదులిచ్చాడు. 


అందుకే అర్థనారీశ్వరుడయ్యాడు


జీవిత భాగస్వామి  ప్రవప్రర్తన, అవసరం, ఆపదను ముందుగానేగ్రహించి వారికి  అనుకూలంగా మారడమే అర్థనారీశ్వర తత్వం. ఇక తెలుపు-నలుపు అంటే వేదపరిభాషలో తెలుపు అంటేశాంతం-నలుపు అంటే కోపం. భార్య కోపంగా ఉంటే నల్లగా ఉందని- శాంతంగా కనిపిస్తేతెల్లగా ఉందని అంటారు. తెల్లగా ఉండే స్వరూపాన్ని గౌరి అని, నల్లగా ఉండేస్వరూపాన్ని కాళి అంటారు. ఓ సందర్భంలో అమ్మవారికోపాన్ని గ్రహించిన స్వామివారు కాళీ అని పిలిచారట. వెంటనే భర్త మనోగతాన్ని తెలుసుకున్న కాళి...తపస్సు చేసిశాంతస్వరూపిణి అయిన గౌరిగా మారిందని చెబుతారు. అంటే స్థిరచిత్తం ఉన్న పురుషుడిని అర్థం చేసుకుంటూ స్త్రీలో మార్పులు ఉండాలన్నదే అర్థనారీశ్వర తత్వం అసలైన అర్థం. అందుకే ధర్మశాస్త్రం లో స్త్రీకి ఉండే నియమాలు పురుషుడికి ఉండవ్.


గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.