చెన్నైలో నిన్న మంగళవారం మధ్యాహ్నం సీనియర్ నటుడు శరత్ బాబు అంత్యక్రియలు ముగిశాయి. అంతకు ముందు టీనగర్ లోని నివాసంలో శరత్ బాబు భౌతికకాయానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. రజనీకాంత్, సూర్య, కార్తీ, సుహాసిని మణిరత్నం, శరత్ కుమార్, రాధిక వంటి వారు ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించి, నటుడితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే శరత్ బాబు అంత్యక్రియలకు కమల్ హాసన్ హాజరు కాలేదు.


కమల్ హసన్, శరత్ బాబుల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. సాగర సంగమం, సత్తం, ఇది కథ కాదు, ఆళవంధన్ వంటి ఎన్నో చిత్రాలలో వీరిద్దరూ స్క్రీన్ స్పేస్ పంచుకున్నారు. శరత్ బాబు మరణ వార్త తెలిసిన వెంటనే కమల్ సోషల్ మీడియాలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “గొప్ప నటుడు, గొప్ప స్నేహితుడు శరత్ బాబు మరణించారు. ఆయనతో కలిసి నటించిన రోజులు నా మదిలో నిలిచే వుంటాయి. నా గురునాథ్ ద్వారా ఆయన తమిళంలో పరిచయమయ్యారు. ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు. చిత్ర పరిశ్రమ మంచి నటుడిని కోల్పోయింది. ఆయనకు నా నివాళులు. #RIPSarathBabu" అని కమల్ ట్వీట్ చేశారు. కానీ శరత్ బాబు అంత్యక్రియలకు రాలేకపోయాడు. అయితే కమల్ కు సమీప బంధువైన సుహాసిని అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చూసుకుంది.


శరత్ బాబు అంత్యక్రియలకు కమల్ హాసన్ హాజరు కాకపోవడానికి గల కారణాన్ని సుహాసిని వెల్లడించింది. "భారతీయుడు-2 షూటింగ్ లో ఉన్నందున కమల్ రాలేకపోయాడు. సినిమాలోని లుక్ లో ఉన్నందున బయటకు రాలేకపోయాడు. శరత్ బాబు కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు. మొదటి రోజు నుంచి శరత్ బాబును ఎలాగైనా కాపాడాలనుకున్నాడు. ఆయన చికిత్స కోసం రజనీ సర్, కమల్ సర్లు అన్నీ చేస్తామని చెప్పారు. రజనీ కాంత్ గారు శరత్ బాబు అంత్యక్రియలకు హాజరయ్యారు. కానీ ఈ కార్యక్రమానికి రాలేకపోయినందుకు కమల్ క్షమాపణలు చెప్పారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ కు చెందిన సభ్యులు ఇక్కడ అన్ని విషయాల్లో సహాయం చేస్తున్నారు" అని సుహాసిని తెలిపారు.


నిజానికి శరత్ బాబు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఏఐజీ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న సమయంలోనే, ఆయన మరణించారంటూ కొన్ని మీడియా సంస్థలు తొందరపాటుతో వార్తలను ప్రసారం చేశాయి. ఇవి చూసిన కమల్ హాసన్ సైతం శరత్ బాబుకు నివాళి అర్పిస్తూ ట్వీట్ చేశారు. ‘‘నా ప్రియమైన పెద్దన్నయ్య శరత్ బాబు నాకు స్నేహితుడు. మంచి మనసున్న వ్యక్తి, శ్రేయోభిలాషి. నీవు నటించిన ఎన్నో సినిమాలు నిన్ను ఎప్పటికీ మా మధ్య చిరంజీవిగా నిలిపి ఉంచుతాయి. ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి’’ అంటూ నివాళులు అర్పించారు. అయితే శరత్ బాబు అప్పటికి కోలుకుంటున్నారని తెలియడంతో, కమల్ వెంటనే తన తప్పు తెలుసుకుని ట్వీట్ డిలీట్ చేశారు. 


Also Read : అమెరికాలో 'ఆదిపురుష్' టికెట్ సేల్స్ షురూ - రేటు ఎంతంటే?


గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శరత్ బాబు.. మే 22న హైదరాబాద్ హాస్పిటల్ లో కన్నుమూశారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమ మొత్తం తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యింది. తెలుగు, తమిళ, కన్నడ సినీ ప్రముఖులు అంతా ఆయన మరణానికి చింతిస్తూ, సంతాపం తెలియజేశారు. అభిమానులు సందర్శనార్థం శరత్ బాబు భౌతికకాయాన్ని హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో ఉంచారు. అనంతరం చెన్నైలోని నివాసానికి తరలించారు. గిండి ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోని శ్మశానవాటికలో బంధువులు, సన్నిహితులు, అభిమానుల అశ్రునయనాల మధ్య శరత్ బాబు అంత్యక్రియలను నిర్వహించారు.


Also Read కన్నడ దర్శకుడితో బాలకృష్ణ, రజనీకాంత్ పాన్ ఇండియా మల్టీస్టారర్!?