''ఎన్టీ రామారావు గారు, మా నాన్నగారు రాజ్ కుమార్ ఎంతో స్నేహంగా ఉండేవారు. ఆ తర్వాత తరంలో బాలయ్య బాబు, మా సోదరుల మధ్య ఆ స్నేహ బంధం అలా కొనసాగుతోంది. బాలయ్య బాబు నాకు బ్రదర్! ఆయన వందో సినిమా 'గౌతమి పుత్ర శాతకర్ణి'లో చిన్న పాత్ర చేసే అవకాశం రావడం గర్వంగా ఉంది. నన్ను తెలుగు చిత్ర పరిశ్రమకు స్వాగతించినందుకు థాంక్స్. ఇంకో విషయం ఏమిటంటే... మేం ఇద్దరం కలిసి ఓ సినిమా చేయబోతున్నాం'' అని విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల్లో కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తనయుడు, స్టార్ కన్నడ హీరో శివన్న చెప్పారు. 


రెండు భాగాలుగా బాలకృష్ణ మల్టీస్టారర్!? 
నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ (Shiva Rajkumar) మల్టీస్టారర్ చేయనున్నారని ఎన్టీఆర్ శత జయంతి ఉత్సావాల్లో క్లారిటీ వచ్చింది. అసలు, విషయం ఏమిటంటే... ఆ మల్టీస్టారర్ రెండు భాగాలుగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారట! 


పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేలా భారీ ఎత్తున బాలకృష్ణ మల్టీస్టారర్ రూపొందుతోందని తెలిసింది. తొలి భాగంలో బాలకృష్ణ, శివ రాజ్ కుమార్ పాత్రలు మాత్రమే ఉంటాయట. రెండో భాగంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంటర్ అవుతారని ఫిల్మ్ నగర్ వర్గాల ఖబర్. అందులో శివన్న ఉండరని, రజనీతో పాటు బాలకృష్ణ మాత్రమే ఉంటారని సమాచారం. 


బాలకృష్ణ మల్టీస్టారర్ దర్శకుడు ఎవరు?
కన్నడ దర్శకుడు హర్ష చేతిలో ఈ మల్టీస్టారర్ పెట్టారట. శివ రాజ్ కుమార్, హర్ష మధ్య మాంచి సాన్నిహిత్యం ఉంది. వాళ్ళిద్దరి కలయికలో నాలుగు సినిమాలు వచ్చాయి. 'భజరంగి' నుంచి మొదలు పెడితే... ఆ సినిమా సీక్వెల్, ' వజ్రకాయ', 'వేద' సినిమాలు కన్నడ నాట మంచి విజయాలు నమోదు చేశాయి. 


బాలకృష్ణ, రజనీకాంత్, శివ రాజ్ కుమార్ హీరోలుగా నటించనున్న సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం హర్ష అందుకున్నారట. దీనిని ఓన్ ప్రొడక్షన్ హౌస్, భార్య పేరు మీద స్థాపించిన గీత పిక్చర్స్ పతాకంపై శివ రాజ్ కుమార్ ప్రొడ్యూస్ చేయనున్నారు. ఈ మల్టీస్టారర్ కంటే ముందు తెలుగులో గోపీచంద్ హీరోగా కె.కె. రాధా మోహన్ నిర్మాణంలో హర్ష తెలుగు సినిమా చేయనున్నారు.


Also Read గోపీచంద్‌తో 'రెడ్' బ్యూటీ - ఇద్దరికీ ఫ్లాపులే, హిట్ వస్తుందా?  


ఇప్పుడు బాలకృష్ణ చేస్తున్న సినిమాలకు వస్తే... అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ డిఫరెంట్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. విజయదశమి కానుకగా ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


NBK 108 తర్వాత రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి బాలకృష్ణ ప్లాన్ చేస్తున్నారట. రామ్ హీరోగా చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత ఆ సినిమా స్క్రిప్ట్ మీద బోయపాటి శ్రీను కాన్సంట్రేషన్ చేయనున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ 'జైలర్' చేస్తున్నారు. ఆ సినిమాలో శివ రాజ్ కుమార్ కూడా నటిస్తున్నారు. ఆ షూటింగ్ చేసేటప్పుడు మల్టీస్టారర్ ప్రతిపాదన ముందుంచగా... రజనీకాంత్ ఓకే అన్నారట. ముగ్గురు హీరోల కమిట్మెంట్స్ కంప్లీట్ అయ్యాక మల్టీస్టారర్ పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. 


Also Read ఐపీఎస్ అధికారితో గొడవ - 'ఖిలాడీ' హీరోయిన్ డింపుల్ హయతిపై కేసు