మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) అభిమానులను 'రామ బాణం' సినిమా రిజల్ట్ డిజప్పాయింట్ చేసింది. మినిమంలో మినిమం ఏవరేజ్ అయినా అవుతుందని ఆశించారంతా! 'లక్ష్యం', 'లౌక్యం' విజయాల తర్వాత 'రామ బాణం'తో దర్శకుడు శ్రీవాస్, గోపీచంద్ హ్యాట్రిక్ హిట్ అందుకుంటారని అనుకున్నారు. అయితే... ఆ సినిమా అనూహ్యంగా పరాజయం పాలైంది. 'రామ బాణం' ఫలితాన్ని పక్కనపెట్టి త్వరలో కొత్త సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి గోపీచంద్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన కొత్త సినిమా మీద దృష్టి పెట్టారు. ఈ మధ్యే ఆ సినిమాలో కథానాయికను ఎంపిక చేశారని తెలిసింది. 


కన్నడ దర్శకుడితో గోపీచంద్ సినిమా
గోపీచంద్ కథానాయకుడిగా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కె.కె. రాధా మోహన్ ఓ సినిమా నిర్మిస్తున్నారు. హీరోగా గోపీచంద్ 31వ సినిమా ఇది. అటు నిర్మాత రాధామోహన్ 14వ సినిమా. ఇంతకు ముందు వీళ్లిద్దరి కలయికలో 'బెంగాల్ టైగర్', 'పంతం' సినిమాలు వచ్చాయి. ఇప్పుడు చేయబోయే సినిమా మూడోది.


గోపీచంద్ 31వ చిత్రానికి హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. నృత్య దర్శకుడిగా సుమారు 300 పాటలకు కొరియోగ్రఫీ అందించిన హర్ష... కన్నడ సినిమా 'గెలియా'తో 2007లో దర్శకుడిగా మారారు. ఓ పది సినిమాలకు దర్శకత్వం వహించారు. శివ రాజ్ కుమార్ కథానాయకుడిగా హర్ష తెరకెక్కించిన 'భజరంగి', 'భజరంగి 2', 'వేద' సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు గోపీచంద్ సినిమాతో ఆయన తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. 


గోపీచంద్ జోడీగా మాళవికా శర్మ
గోపీచంద్ హీరోగా హర్ష తెరకెక్కిస్తున్న సినిమాలో కథానాయికగా మాళవికా శర్మ (Malvika Sharma )ను ఎంపిక చేసినట్లు తెలిసింది. మాస్ మహారాజా రవితేజ 'నేల టికెట్' సినిమాతో ఆమె వెండితెరకు కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత యంగ్ & ఎనర్జిటిక్ స్టార్ రామ్ 'రెడ్'లో నటించారు. ఆ రెండు సినిమాలూ మాళవికా శర్మకు విజయాలు ఇవ్వలేదు. ఇప్పుడు గోపీచంద్ సైతం ఫ్లాపుల్లో ఉన్నారు. ఆయనకు 'రామ బాణం', దానికి ముందు సినిమాలు ఏవీ సాలిడ్ సక్సెస్ అందించలేదు. ఇప్పుడు హీరో హీరోయిన్లు ఇద్దరూ ఈ సినిమాతో సక్సెస్ అందుకోవాలి మరి!


'కెజిఎఫ్' రవి బస్రూర్ సంగీతంలో...
ఈ సినిమాకు 'కెజిఎఫ్' ఫేమ్ రవి బస్రూర్ (KGF Ravi Basrur) సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా సినిమాను రూపొందిస్తున్నట్లు నిర్మాత కె.కె. రాధా మోహన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ''మా సంస్థలో గోపీచంద్ గారు, దర్శకుడు హర్షతో కలసి ప్రొడక్షన్ నంబర్ 14 చేయడం ఆనందంగా ఉంది. కన్నడలో పలు బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను హర్ష అందించారు'' అని చెప్పారు.


Also Read : ఐపీఎస్ అధికారితో గొడవ - 'ఖిలాడీ' హీరోయిన్ డింపుల్ హయతిపై కేసు


భారీ నిర్మాణ వ్యయంతో ఎక్కడా రాజీ పడకుండా కొత్త కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయట. అలాగే, మాసివ్ యాక్షన్ సీక్వెన్సులు సైతం డిజైన్ చేశారట. ఈ చిత్రానికి స్వామి జే ఛాయాగ్రహణం అందించనున్నారు.


Also Read తెలుగు హీరోను డమ్మీ చేస్తే ఎలా? తమిళ క్యారెక్టర్ ఆర్టిస్టులే ఎక్కువా?