తెలుగమ్మాయి, యువ కథానాయిక డింపుల్ హయతి (Dimple Hayathi)పై జూబ్లీ హిల్స్ (హైదరాబాద్) పోలీస్ స్టేషనులో కేసు నమోదు అయ్యింది. ఆమెతో పాటు విక్టర్ డేవిడ్ అనే మరో వ్యక్తిని కూడా స్టేషనుకు పిలిపించి నోటీసులు ఇచ్చారు. ఎందుకు? కేసు పూర్వాపరాలు ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే... 


ట్రాఫిక్ డీసీపీ కారును డ్యామేజ్ చేసిన డింపుల్!
జర్నలిస్ట్ కాలనీలోని హుడా ఎంక్లేవ్ (Huda Enclave Jubilee Hills)లో డింపుల్ హయతి ఉంటున్నారు. ఆమెతో పాటు డేవిడ్ కూడా బస చేస్తున్నారు. ఆ బహుళ అంతస్థుల భవనంలో ట్రాఫిక్ డీసీపీ ఐపీఎస్ రాహుల్ హెగ్డే (Rahul Hegde IPS) సైతం నివాసం ఉంటున్నారు. కారు పార్కింగ్ విషయంలో డింపుల్ ప్రవర్తన వివాదానికి కారణమైంది. 


ఐపీఎస్ రాహుల్ హెగ్డే డ్రైవర్, కానిస్టేబుల్ చేతన్ ప్రతిరోజూ అపార్ట్మెంట్ సెల్లార్ ఏరియాలో కారు పార్క్ చేస్తున్నారు. పోలీస్ వాహనం పక్కనే కథానాయిక డింపుల్ హాయతి, డేవిడ్ తమ వాహనాన్ని పార్కింగ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ ప్రతి రోజూ డీసీపీ వాహనానికి ఉన్న కవర్ తొలగించడం, ఆ వాహనానికి అడ్డుగా పెట్టిన కోన్‌లను కాలితో తన్నడం వంటి పనులు చేస్తున్నారు. 


డింపుల్ హయతి, విక్టర్ డేవిడ్ ప్రవర్తన హద్దులు మీరడంతో పాటు... ఈ నెల 14న పార్క్ చేసి ఉన్న డీసీపీ వాహనాన్ని తన కారుతో డింపుల్ హయతి ఢీ కొట్టారు. ఆ చర్య కారణంగా డీసీపీ కారు ముందు భాగం డ్యామేజ్ అయ్యింది. సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాత అసలు విషయం అర్థం కావడంతో... జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషనులో రాహుల్ హెగ్డే డ్రైవర్ చేతన్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఐపీఎస్ కారు డ్యామేజ్ కావడానికి కారణమైన డింపుల్, డేవిడ్ మీద చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సాక్ష్యంగా సీసీ టీవీ ఫుటేజ్ సమర్పించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... డింపుల్, విక్టర్ - ఇద్దరినీ స్టేషనుకు పిలిపించారు. 353, 341, 279 సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత 41 నోటీసులు ఇచ్చి పంపించేశారు. 


'రామ బాణం'లో నటించిన డింపుల్
డింపుల్ హయతి కొన్ని రోజుల క్రితం 'రామ బాణం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అందులో గోపీచంద్ జోడిగా నటించారు. మే 5న విడుదలైన ఆ సినిమా థియేటర్ల దగ్గర ఆశించిన విజయం అందుకోలేదు. ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దానికి ముందు మాస్ మహారాజా రవితేజ 'ఖిలాడీ' సినిమాలోనూ డింపుల్ హయతి యాక్ట్ చేశారు. అందులో ఓ సన్నివేశంలో బికినీ ధరించారు. గ్లామరస్ హీరోయిన్ అని పేరు తెచ్చుకున్నారు. అయితే, ఆ సినిమా కూడా ఆమెకు హిట్ ఇవ్వలేదు. 


Also Read తెలుగు హీరోను డమ్మీ చేస్తే ఎలా? తమిళ క్యారెక్టర్ ఆర్టిస్టులే ఎక్కువా?


తెలుగులో 'గద్దలకొండ గణేష్' ఒక్కటే డింపుల్ హయతికి హిట్టు. ఆ సినిమాలోని స్పెషల్ సాంగ్ 'జర్రా జర్రా...'లో ఆమె డ్యాన్స్ చేశారు. తమిళంలో 'అభినేత్రి 2', హిందీలో 'అతరంగి రే' వంటి సినిమాల్లో కూడా డింపుల్ నటించారు. 'రామ బాణం' ఫ్లాప్ తర్వాత ఆమెకు ఎవరు అవకాశం ఇస్తారోనని ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు.


Also Read పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ బైక్స్ & కారుకు సేమ్ నంబర్, సమంత కారుకూ... హరీష్ శంకర్ 2425 సెంటిమెంట్!