మెగాస్టార్ చిరంజీవి విదేశాలకు షూటింగ్ వెళ్లారంటే.. ఏదో ఒక లీక్ ఇవ్వకుండా ఉండరు. అందుకే ఫ్యాన్స్ కూడా చిరు ‘లీక్స్’ గురించి తెగ ఎదురుచూస్తుంటారు. అందుకే, ఆయన ఎట్టకేలకు మంగళవారం కొన్ని ఫొటోలు లీక్ చేసి అభిమానుల్లో ఆనందం నింపారు. అయితే, అప్పటికే.. దర్శకుడు మెహర్ రమేష్ కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టేశారు అనుకోండి. కానీ, చిరంజీవి ఇచ్చే లీకులు మాత్రం ఫ్యాన్స్‌కు చాలా ప్రత్యేకం. ఎందుకంటే.. ఆయన అందమైన లొకేషన్లతోపాటు.. ఆ పాటలోని ప్రత్యేకతను, తన సరికొత్త లుక్‌ను కూడా చూపిస్తూ ఊరిస్తుంటారు. ఒకరకంగా ఇది ఆ సినిమా ప్రమోషన్స్‌కు కూడా ప్లస్ అవుతుంది. 


స్విట్జర్లాండ్‌లో తమన్నాతో ఆటపాట


మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘భోళాశంకర్’ మూవీలో పాట చిత్రీకరణ కోసం చిత్రయూనిట్ అంతా స్విట్జర్లాండ్ చెక్కేసింది. అక్కడ అందమైన లొకేషన్లలో చిరంజీవి, తమన్నాపై పాటను చిత్రీకరించారు. షూటింగ్ పూర్తయిన తర్వాత చిరంజీవి రిలాక్స్‌గా అక్కడే కూర్చొని ప్రకృతి అందాలను చూస్తూ పరవశించిపోయారు. ఆ చిత్రాలను ఆయన తన అభిమానులతో పంచుకోకుండా ఉండలేకపోయారు. అందుకే, మంగళవారం చిరు లీక్స్ పేరుతో ఆ ఫొటోలను ట్వీట్ చేశారు. ‘‘స్విట్జర్లాండ్‌లో కళ్ళు చెదిరే  అందాలతో.. మైమరిపించే లొకేషన్స్ లో ‘భోళాశంకర్’ కోసం తమన్నాతో ఆట పాట (Song Shoot ) ఎంతో ఆహ్లాదంగా జరిగింది. ఈ పాట ప్రేక్షకులందరినీ, మరింతగా అభిమానులందరినీ మెప్పిస్తుందని చెప్పగలను. త్వరలోనే మరిన్ని సంగతులు  పంచుకుందాం. అప్పటివరకూ ఈ 'చిరు లీక్స్' పిక్స్’’ అంటూ ఫొటోలను వదిలారు. చిరు ట్వీట్‌ను ఇక్కడ చూడండి.






ఇంతకు ముందే దర్శకుడు మెహర్ రమేష్ ఈ సాంగ్‌పై సోషల్ మీడియాలో అప్‌డేట్ ఇచ్చారు. స్విట్జర్లాండ్‌లో ‘భోళా శంకర్’ సాంగ్ షూటింగ్ కంప్లీట్ కావడంతో తమ యూనిట్ ఇండియా రిటర్న్ అయ్యిందని మెహర్ రమేష్ పేర్కొన్నారు. పాట చాలా అందంగా వచ్చిందని ఆయన తెలిపారు. అదే సమయంలో అక్కడ చిత్రీకరణ చేయడం చాలా కష్టమని ఆయన చెప్పుకొచ్చారు. సంగీత దర్శకుడు సాగర్ మహతి అందించిన బాణీకి శేఖర్ మాస్టర్ అద్భుతమైన కొరియోగ్రఫీ చేయగా.. సినిమాటోగ్రాఫర్ డడ్లీ అందంగా తెరకెక్కించారని మెహర్ రమేష్ ట్వీట్ చేశారు. 


ఆగస్టు 11న 'భోళా శంకర్' విడుదలకు సన్నహాలు


‘భోళాశంకర్’ మూవీని ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ పేర్కొంది. విడుదల తేదీ మారోచ్చని ఆ మధ్య వినిపించింది. అయితే, మే డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లలో విడుదల తేదీని మరోసారి కన్ఫర్మ్ చేశారు. టాక్సీ డ్రైవర్ లుక్కులో చిరు పోస్టర్లు కూడా అభిమానులను ఆకట్టుకున్నాయి. ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావుకు చెందిన క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ  నిర్మిస్తున్న చిత్రమిది. ఇందులో చిరంజీవి సోదరిగా కీర్తీ సురేష్ నటిస్తున్నారు. ఏయన్నార్ మనవడు, నాగార్జున మేనల్లుడు, యువ హీరో సుశాంత్ కూడా సినిమాలో ఉన్నారు. ఆయన కీర్తీ సురేష్ జంటగా నటిస్తున్నట్లు సమాచారం. అయితే, ఆ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేయలేదు. 


Also Read: ‘ఖిలాడీ’ భామపై తప్పుడు ఆరోపణలు? నిజంగా ఆమె కారుతో గుద్దిందా? ఇదిగో సీసీటీవీ వీడియో!