ప్రముఖ సీనియర్ నటుడు శరత్ బాబు మరణం సినిమా ఇండస్ట్రీని విషాదంలో ముంచేసింది. కుటుంబ సభ్యులు, అభిమానులు, ఆయన సన్నిహిత సినీ ప్రముఖుల అశ్రునయనాల మధ్య మంగళవారం ఆయన అంత్యక్రియలు జరిగాయి. 50 ఏళ్ల ఆయన సినీ జీవితంలో తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ.. ఇలా చాలా భాషల్లో ఆయన నటించారు. అప్పట్లోనే పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో శరత్‌బాబు మరణంపై యావత్ సినీ ప్రేమికులు విషాదంలో మునిగిపోయారు. సినీ ప్రముఖులంతా మంగళవారం చెన్నైలోని టీ-నగర్‌లోని ఆయన నివాసం వద్దకు చేరుకుని భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సుహాసిని సైతం అక్కడికి వెళ్లి నివాళులు అర్పించారు. అంతేకాదు, ఆయన అంత్యక్రియలకు అవసరమైన ఏర్పాట్లను కూడా ఆమె స్వయంగా పర్యవేక్షించడం గమనార్హం.
సుహాసిని శరత్‌బాబుతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. అంతేకాదు, వారిద్దరు మంచి స్నేహితులు కూడా. శరత్‌బాబు హైదరాబాద్‌లోని హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నప్పుడు కూడా సుహాసిని అక్కడికెళ్లి ఆయన్ని పరామర్శించారు. ఆయనకు అందిస్తున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. సుహాసినితోపాటు మెగస్టార్ చిరంజీవి కూడా హాస్పిటల్‌కు వెళ్లారు. ఆ విషయాన్ని సుహాసిని మంగళవారం మీడియాతో పంచుకున్నారు.
శరత్‌బాబును అలా పిలుస్తుంటే చిరంజీవి కంట్లో నీళ్లు తిరిగాయ్: సుహాసిని
‘‘శరత్ బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో నేను, చిరంజీవి కలిసి వెళ్లి ఆయనను పరామర్శించాం. రోజులో సగం అక్కడే ఉన్నాం. శరత్ బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించాం. దాదాపు గంటపాటు శరత్‌బాబును పిలిచినా స్పందన రాలేదు. శరత్ అన్నా కళ్లు తెరవండి, మాట్లాడండి అంటూ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఆయన్ని పిలిచాను. నా మాటలు విని ఆయన తన చేతిని పైకెత్తారు. నువ్వు నన్ను చూసుకుంటావు చెల్లమ్మా అనే సంతృప్తి ఆయన కళ్లలో కనిపించింది. నేను శరత్ బాబును అలా పిలుస్తుంటే చిరంజీవి కళ్లలోంచి నీళ్లు వచ్చేశాయి. సుహాసిని మనం ఏం చేసైనా సరే శరత్‌ను కాపాడుకుందాం అని చిరంజీవి అన్నారు. ఆయన పరిస్థితి చూసి చిరంజీవి చాలా బాధపడ్డారు’’ అని తెలిపారు.
సిగరెట్ తాగొద్దని మందలించేవారు: రజినీకాంత్
తనకు శరత్ బాబు ఎప్పుడూ ధూమపానం మానేయమని సలహా ఇస్తుండేవారని రజనీ కాంత్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయనకు తనపై చాలా ప్రేమ, ఆప్యాయత ఉండేవని చెప్పారు. తాను ఎప్పుడైనా అతనికి సిగరెట్ తాగుతూ కనిపిస్తే దాన్ని లాక్కొని ధూమపానం చేయకుండా ఆపేవాడని రజనీ అన్నారు. కాబట్టి తాను అతని ముందు సిగరెట్ తాగడ మానేశానని చెప్పారు. ఓ సందర్భంలో నేను సిగరెట్ కాల్చడం చూసి.. మానేయమంటూ మందలించినట్టు రజనీ తెలిపారు. ‘అన్నామలై’ సినిమాలో ఓ ఛాలెంజింగ్ సన్నివేశాన్ని రజినీకాంత్ గుర్తు చేసుకున్నారు. ‘‘శరత్‌బాబుతో స్నేహం చెడిపోయిన తర్వాత వచ్చే భావోద్వేగ సీన్ సరిగ్గా రాకపోవడంతో చాలా టేకులు తీసుకోవల్సి వచ్చింది. ఆ సమయంలో శరత్ బాబు తనకు సిగరెట్ ఇచ్చారు. దీంతో నేను కాస్త రిలాక్స్ అయ్యాను. ఆ తర్వాత శరత్‌తో కలిసి ఆ సన్నివేశంలో నటించా. ఆ టేక్ కూడా ఓకే అయింది’’ తెలిపారు. అతను ఎల్లప్పుడూ తనకు మంచి జరగాలని, తన ఆరోగ్యం గురించి సలహా ఇచ్చేవాడని, తనను బాగా ఇష్టపడేవారని.. కానీ అతను ఇప్పుడు మధ్య లేడని రజనీకాంత్ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మ శాంతించాలని భగవంతుడిని కోరుకుంటున్నా అంటూ శరత్ బాబుతో తనకున్న అనుబంధాన్ని చెప్పుకొచ్చారు.
Read Also: హాలీవుడ్ అరంగేట్రంపై రామ్ చరణ్ హింట్ - జీ20 సదస్సులో ఏం చెప్పారంటే?