‘ఖిలాడీ’ నటి డింపుల్ హయతి వివాదంలో చిక్కుకుంది. ఆమెపై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జర్నలిస్ట్ కాలనీలోని హుడా ఎంక్లేవ్‌లో డింపుల్ హయతి నివసిస్తోంది. ఈ నెల 14న ఆమె అదే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ట్రాఫిక్ డీసీపీ, ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే కారును తన కారుతో ఢీకొట్టి కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సీసీటీవీ కెమేరాలో రికార్డైన వీడియోను ఆధారంగా చూపిస్తున్నారు. అయితే, ఆమెపై వచ్చిన ఆరోపణలపై అనుమానాలు నెలకొంటున్నాయి. 


డింపుల్‌పై వచ్చిన ఆరోపణలు ఏమిటీ? 


ఐపీఎస్ రాహుల్ హెగ్డే డ్రైవర్, కానిస్టేబుల్ చేతన్ చేసిన ఫిర్యాదు ప్రకారం..  అపార్ట్మెంట్ సెల్లార్ ఏరియాలో డీసీపీ పోలీస్ వాహనం పక్కనే డింపుల్ హాయతి, ఆమె సన్నిహితుడు డేవిడ్ తమ వాహనాన్ని నిలుపుతున్నారు. అయితే, వారిద్దరూ  ప్రతిరోజూ డీసీపీ వాహనానికి ఉన్న కవర్ తొలగించడం, ఆ వాహనానికి అడ్డుగా పెట్టిన కోన్‌లను కాలితో తన్నడం వంటి పనులు చేస్తున్నారు. ఇటీవల డింపుల్ సహనం కోల్పోయి తన కారుతో కావాలనే డీసీపీ వాహనాన్ని ఢీకొట్టినట్లు ఆరోపించారు. ఇందుకు సీసీటీవీ కెమేరాలో రికార్డైన వీడియోను ఆధారంగా చూపించారు. 


వీడియోలో ఏముంది?


అయితే, ఆ వీడియోను పరిశీలనగా చూస్తే.. డింపుల్ తన కారుతో కేవలం కోన్స్ మాత్రమే ఢీకొట్టినట్లు కనిపిస్తోంది. ఆమె కారు.. డీసీపీ వాహనాన్ని ఢీకొట్టినట్లు కనిపించలేదు. డింపుల్ కారు దిగి కోన్‌లను అసహనంగా తన్నుతున్నట్లు కూడా కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజనులు.. ఆ వీడియోను చూసి ఒక నిర్ణయానికి వచ్చేయలేమని అంటున్నారు. వీడియో చూస్తే డింపుల్ తప్పేమీ కనిపించడంలేదని కొందరు అంటున్నారు. అయితే, ఆమె పోలీసులతో పెట్టుకుందని, కేసు నుంచి బయటపడటం అంత ఈజీ కాదని అంటున్నారు. అయితే, డింపుల్ మాత్రం తన తప్పేమీ లేదని, ఇదంతా తన లాయర్లు చూసుకుంటున్నారని వెల్లడించారు. ఉద్దేశ పూర్వకంగా ఐపీఎస్ అధికారి కారును ధ్వంసం చేసినందుకు డింపుల్, డెవిడ్‌లను పోలీస్ స్టేషన్‌కు పిలిపించడమే కాకుండా, వారిపై 353, 341, 279 సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత 41 నోటీసులు ఇచ్చి పంపించేశారు.




రంగంలోకి దిగిన డింపుల్ లాయర్లు


ఈ కేసుపై డింపుల్ న్యాయవాది పాల్ సత్యనారాయణను ఆశ్రయించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డింపుల్‌పై తప్పుడు కేసు పెట్టారని తెలిపారు. డింపుల్‌తో డీసీపీ చాలాసార్లు ఇష్టానుసారంగా మాట్లాడారని, డింపుల్ పార్కింగ్ ప్లేస్‌లో కోన్స్ పెట్టేవారని పేర్కొన్నారు. చాలాసార్లు వాటిని అక్కడి నుంచి తొలగించాలని ఆమె చెప్పినా.. వినకపోవడంతో అసహనంతో వాటిని ఆమె తన్నారని తెలిపారు. దీంతో డీసీపీపై కేసు పెడతానని డింపుల్ బెదిరించారు. అయితే, వారే తిరిగి డింపుల్‌పై కేసు పెట్టారన్నారు. ఉద్దేశపూర్వకంగానే డీసీపీ డింపుల్‌ను వేదిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్స్‌లో కాకుండా ఆయన ఇక్కడ ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు. మరోవైపు డింపుల్‌పై ట్రాఫిక్ పోలీసులు ఎదురుదాడి మొదలుపెట్టారు. ఆమె కారుపై పెండింగులో ఉన్న చలానాల జాబితాను బయటకు తీస్తున్నారు. మరి, ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో. లేదా పెద్దలు కలుగజేసుకుని ఇద్దరికీ రాజీ కుదురుస్తారేమో చూడాలి. 


Also Read రంగమ్మత్తను మర్చిపోయేలా సుమతి క్యారెక్టర్ - అనసూయ మామూలుగా ఏడిపించదు!