హిందూ సంస్కతిలో సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు అన్నీ ప్రకృతిలో ముడిపడి ఉంటాయి. పండుగల పేరిట చెట్లను, జంతువులను, నదులను పూజిస్తారు. వాటివల్లనే మన జీవనం సుఖవంతంగా సాగుతోందని విశ్వసిస్తారు. అలాగే ప్రకృతిలో ప్రధాన పాత్ర వహించే చెట్లను భక్తిప్రపత్తులతో పూజిస్తారు. ముఖ్యంగా మర్రి చెట్టుకు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. దీనిని వటవృక్షం అని కూడా అంటారు. మర్రిచెట్టు వరుణుడి స్థలంగా దేవతలు మునులు కీర్తిస్తారు. దీనిని న్యగ్రోధ వృక్షం అని కూడా పిలుస్తారు.  న్యగ్రోధ వృక్షమంటే కిందకు పెరిగే చెట్టు (మర్రి చెట్టు ఊడలు కిందికి పెరుగుతాయి)అని అర్థం. ప్రళయ కాలంలో జగమంతా జలమైనప్పుడు  శ్రీమహావిష్ణువు బాలుని రూపంలో వటపత్రంపై  మార్కండేయ మహామునికి దర్శనము ఇచ్చాడని భాగవతం చెబుతోంది. ఈ అశ్వత్థ వృక్షం దేవతల నివాస స్థానం అని అధర్వణ వేదంలో ప్రస్తావించారు. 


Also Read:  అనారోగ్యం, శనిబాధలు తొలగిపోవాలంటే మంగళవారం ఇలా చేయండి


ఆధ్యాత్మిక పరంగా మర్రిచెట్టును త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు. బెరడులో శ్రీ మహావిష్ణువు, వేరులో బ్రహ్మ, కొమ్మల్లో శివుడు ఉంటారని విశ్వసిస్తారు. మర్రిచెట్టును పూజిస్తే సంతానాన్ని, సంపదను అందిస్తుందని విశ్వసిస్తారు. సంతానం లేని వారు మర్రిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు.  దక్షిణా మూర్తి మర్రిచెట్టు కింద కూర్చుని ధ్యానం చేసినట్టు పురాణాల్లో ఉంది. భగవద్గీతలో జీవితానికి అర్ధాన్ని అర్జునునికి బోధించే సమయంలో కృష్ణభగవానుడు చెప్పిన ఉదాహరణ మర్రిచెట్టే. 


మర్రిచెట్టును పూజిస్తే ఆధ్యాత్మికంగా ఎన్నో ప్రయోజనాలని చెబుతారు అవేంటంటే....
వ్యాపారం, ఉద్యోగంలో వచ్చిన కష్టనష్టాల నుంచి బయటపడాలంటే మర్రిచెట్టు కింద నెయ్యి దీపం వెలిగిస్తే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి.
ఇంట్లో ఎవరైనా చాలా కాలంగా అనారోగ్యంతో ఉంటే, రాత్రిపూట వారి దిండుకింద మర్రివేరు ఉంచితే ఆరోగ్యం క్రమంగా మెరుగు పడుతుందని విశ్వసిస్తారు.
మర్రిచెట్టు కింద కూర్చుని హనుమాన్ చాలీసా పఠించడం వల్ల భయం తొలగిపోయి మానసిక ఒత్తిడి తగ్గుతుందని చెబుతారు
శనివారం మర్రి కాండం మీద పసుపు, కుంకుమ సమర్పించడం వల్ల వ్యాపారంలో పురోభివృద్ధి కలుగుతుంది
ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉంటే, గుడి దగ్గరున్న మర్రి చెట్టు కొమ్మను తీసుకొచ్చి ఇంట్లో పెడితే పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుందని చెబుతారు
మర్రి చెట్టుపై తెల్లటి నూలు దారాన్ని 11 సార్లు కట్టి నీరుపోస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి


Also Read: వివాహం, సంతానం, శని బాధలు ఇలా సుందరకాండలో ఏ ఘట్టం చదివితే ఎలాంటి సమస్యలు తీరుతాయో తెలుసా


దక్షిణామూర్తి శ్లోకం 


గురవే సర్వలోకానాం భిషజే భవరోగినాం
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః


సర్వలోకాలకు గురువు, భవరోగులకు ( సంసార బంధాలలో చిక్కుకుపోయిన వాళ్ళకు ) వైద్యుడు, సకల విద్యలకు నెలవు ( నివాసం ) అయిన దక్షిణామూర్తి కి నమస్కారములు


నోట్: పండితుల నుంచి, కొన్ని పుస్తకాల నుంచి సేకరించిన సమాచారం ఇది. దీన్ని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.


Also Read: హనుమాన్ చాలీసా ఎందుకు చదవాలి, పఠిస్తే కష్టాలెందుకు తీరుతాయి