కోనసీమ పేరుపై సీఎం జగన్ ఏం నిర్ణయం తీసుకుంటారా అని రాష్ట్రం మొత్తం ఎదురుచూస్తుంది. ముందుగా ప్రభుత్వం పెట్టిన కోనసీమ జిల్లా పేరునే కొనసాగిస్తారా లేక తాజాగా ప్రతిపాదించిన అంబేడ్కర్ పేరును కోనసీమకు జిల్లా పేరుకు తగిలిస్తారా అనేది ఉత్కంఠగా మారింది.
గత నెలలో తీసుకున్న నిర్ణయానికి 30 రోజుల సమయం ఇచ్చిన ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను కోరింది. ఇప్పుడా గడువు ముగియడంతో జగన్ సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుందా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ మధ్యకాలంలో కోనసీమలో ముఖ్యంగా అమలాపురంలో జరిగిన సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి .
తెలుగు రాజకీయాల్లో సున్నితంగా మారిన కోనసీమ :
ఆంధ్రా కేరళగా పేరుపడ్డ కోనసీమ ప్రాంతం ప్రస్తుతం రాజకీయాల్లో సున్నితంగామారింది. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా తెరపైకి వచ్చిన కోనసీమ జిల్లా పేరు వివాదానికి కారణమైంది. జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్చాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని పైన మే 18 నుంచి జూన్ 18 లోపు అభ్యంతరాలు, సూచనలు తెలియజేయాలని కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది జగన్ ప్రభుత్వం. ఇప్పుడు ఆ గడువు ముగిసింది.
నెలరోజుల క్రితం ఈ నోటిఫికేషన్ విడుదల సందర్భంగా అమలాపురం కేంద్రంగా అల్లర్లు చోటు చేసుకున్నాయి. భారీ విధ్వంసం జరిగింది. ఏకంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లను దహనం చేశారు. అప్పటి నుంచి జిల్లాలో మకాం వేసిన పోలీసు బలగాలు అనుక్షణం పరిస్థితులనుగమనిస్తున్నారు.
అమలాపురం ఘటనలకు కారణమైన వారిని పెద్ద సంఖ్యలో అరెస్టు చేశారు. జిల్లాలో 144 సెక్షన్ విధించారు. 15 రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. పోలీసులు నమోదు చేసిన ఏడు కేసుల్లో ఇప్పటివరకు 170 మందికిపైగా అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి సైతం బదిలీ అయ్యారు. అమలాపురం గొడవల్లో ఆయనకు కూడా గాయాలైన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో కర్నూల్ ఏఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి అమలాపురం ఎస్పీగా నియమించారు.
మరోవైపు నిబంధనల ప్రకారం జిల్లా కలెక్టర్ పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ జిల్లాలోని 314 గ్రామాల ప్రజల నుంచి విజ్ఞాపనలు స్వీకరించారు. 79.17 శాతం అక్షరాస్యత గల అమలాపురం జిల్లాలో 17. 19 లక్షల మంది జనాభా ఉన్నారు. వారిలో చాలామంది తమ తమ అభిప్రాయాలను ,అభ్యంతరాలను ప్రభుత్వానికి తెలిపారు .
ఆరు వేలకు పైగా విజ్ఞప్తులూ .. అభ్యంతరాలు :
కోనసీమ పేరు మార్పు విషయమై అధికారులకు దాదాపు ఆరు వేలకుపైగా అభిప్రాయాలు అందినట్టుగా సమాచారం. దీనిపై ప్రభుత్వానికి ప్రాథమికంగా ఒక నివేదిక వెళ్లనుంది. కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం వద్ద ఏ అంశం చర్చకు రానుంది. అలాగే ఒక మంత్రి నివాసాన్ని తగులబెట్టడానికి దారి తీసిన పరిస్థితులపైనా కేబినెట్ చర్చించనున్నట్టు సమాచారం
జగన్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు :
ప్రస్తుతం ఏపీలో అత్యంత సున్నితమైన అంశంగా కోనసీమ పేరు వ్యవహారం రూపొందడంతో జగన్ ప్రభుత్వం జిల్లా అధికారుల నివేదిక ఆధారంగా కోనసీమ జిల్లా పేరును ఏమని పెడతారు అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. కోనసీమ జిల్లా పేరునే కొనసాగిస్తారా లేక దానికి అంబేడ్కర్ పేరును జోడిస్తారా.. అసలీ వివాదాలు రాకుండా కొత్త పేరు ఏదైనా తెరమీదకు తీసుకొస్తారా అనే చర్చ రాజకీయాల్లో జోరుగా సాగుతుంది. కేబినెట్ఈ భేటీలో దీనిపై స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. మరోసారి అమలాపురంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.
అల్లర్లు సమయంలోనే పేరు మార్చేది లేదని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని ఆందోళనలు చేసినా పేరులో వెనక్కి వెళ్లేది లేదని తేల్చి చెప్పేశారు. డిమాండ్‌పై చర్చలకు సిద్ధమని ప్రకటించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి... ఇలాంటి ఆందోళనలతో ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చలేరన్నారు.
ప్రభుత్వ నిర్ణయం పై విపక్షాల దృష్టి
కోనసీమ పేరు పై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందా అని విపక్షాలు ఎదురుచూస్తున్నాయి . కోనసీమ పేరునే కొనసాగించినా లేక దానికి మార్పులు చేసినా కశ్చితంగా ప్రజల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. దీన్ని ఉపయోగించుకుని ప్రభుత్వాన్ని ఇరుకున బెట్టడానికి విపక్షాలు చూస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ చిక్కుముడిని జగన్ ఎలా పరిష్కరిస్తారో అన్న అభిప్రాయం ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా మారింది .