ఏపీలో గత కొన్ని రోజులుగా రెండు జిల్లాల ప్రజలకు కంటి మీద కునుకు ఉండటం లేదు. ఓ వైపు శ్రీకాకుళం జిల్లా వాసులు ఎలుగు బంటి తమపై ఎప్పుడు దాడి చేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. గత కొన్ని రోజులుగా వజ్రపుకొత్తూరులో ఎలుగుబంట్లు వరుస దాడులు చేస్తున్నాయి. మరోవైపు కాకినాడ జిల్లాను రాయల్ బెంగాల్ టైగర్ గజగజ వణికిస్తోంది. దాదాపు నెల రోజులుగా కాకినాడ జిల్లాల్లో సంచరించిస్తున్నా అటవీ శాఖ అధికారులు పెద్ద పులిని మాత్రం పట్టుకోలేకపోయారు. పైగా తాము చెప్పిన తరువాత వచ్చి అటవీ అధికారులు పులి జాడ గుర్తించామని చెబుతున్నారంటూ జిల్లా వాసులు అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు వర్షాకాలం ప్రారంభం కావడంతో త్వరగా చికటి పడుతుండగా, ఇంటికి తిరిగి వెళ్లాలంటేనే పులి, ఎలుగు బంటి భయాలతో ఆ జిల్లాల్లో మహిళలు, చిన్నారులతో పాటు పురుషులు సైతం ప్రాణ భయంతో వణికిపోతున్నారు.


వజ్రపుకొత్తూరులో మరోసారి ఎలుగు బంటి దాడి.
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరుల ఎలుగు బంటి  మరోసారి దాడి చేసింది. ఎలుగు దాడిలో ఏడుగురికి  తీవ్రగాయాలు కాగా, చికిత్స అందించేందుకు పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఎలుగు బంటి దాడులు వరుసగా జరుగుతున్నా అటవీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయంటూ  స్దానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం పొలం పనులకు వెళ్లాలన్నా, ఇంట్లో నుంచి బయటికి రావాలన్నా భయంగా ఉందని చెబుతున్నారు. ఎలుగుబంటి ఎక్కడ తమపై దాడి చేస్తుందోనన్న భయమే వారిని ఏ పని చేయకుండా చేస్తుందని వాపోతున్నారు. 


ఎలుగుబంటి దాడిలో వ్యక్తి మృతి
వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగి గ్రామంలో ఆదివారం ఉదయం ఎలుగుబంటి చేసిన దాడిలో కలమట కోదండ రావు(50) అనే అన్నతాద మృతి చెందాడు. ప్రతిరోజూ లాగే ఉదయం నిద్ర లేచిన కోదండ రావు గ్రామ సమీపంలో ఉన్న తోటకు వెళ్తుండగా సమీప పొదల్లో దాగివున్న ఎలుగుబంటి ఒక్కసారిగా ఆయనపై దాడి చేసింది. ఎలుగు దాడితో ప్రాణ భయంతో ఆయన గట్టిగా కేకలు వేశారు. దగ్గర్లో ఉన్నవారు అక్కడికి వచ్చేసరికి ఎలుగు అక్కడ నుండి పారిపోయింది. ఎలుగు దాడిలో తీవ్ర గాయాలపాలైన ఆయన మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.


కాకినాడ జిల్లాలో బెంగాల్ టైగర్ కలకలం.... 
ప్లేసు మార్చిన పెద్దపులి... రోజుకో కొత్త ప్రాంతంలో తిష్టవేస్తున్న బెంగాల్ టైగర్ 
 పెద్దిపాలెం కిత్తమూరి పేట, పొట్టిమెట్ట వద్ద పులి పాదముద్రలు.. 
చుట్టూ ఎత్తైన కొండలు, దానికి ఆనుకుని దట్టమైన అటవీ ప్రాంతం.. కొండ ఇవతలి ప్రాంతం అంతా జనావాసాలు, పొలాలు. కొంచెం ముందుకు వెళితే దట్టంగా పెరిగిపోయిన సరుగుడు తోటలు, అడవి పొదలు. ఆకలి వేస్తే అందుబాటులో మేత మేస్తున్న పశువులు. కష్టపడి వేటాడకుండానే అందుబా టులో కావాల్సినంత ఆహారం.. ఇలా ఇన్ని అనుకూలతలున్న స్థలం దొరికిందని రాయల్ బెంగాల్ టైగర్ కాకినాడ జిల్లాలో తిష్ట వేసింది. దాదాపు నెల రోజులుగా అటవీ అధికారులకు చిక్కకుండా, దొరకుండా ముప్పు తిప్పలు పెడుతోంది. తాజాగా పెద్దిపాలెం కిత్తమూరి పేట, పొట్టిమెట్ట వద్ద పులి పాదముద్రలు గుర్తించడంతో స్థానికుల్లో భయాందోళన రెట్టింపైంది.


గత వారం రోజులుగా జాడ లేకుండా పోయిన బెంగాల్ టైగర్ తన పాదముద్రలతో మరోసారి ఇక్కడే ఉన్నా.. వదల బొమ్మాళీ అంటూ స్థానికులకు నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా ప్రత్తిపాడు మండల పరిధిలోని పెద్దిపాలెం శివారు కొత్తమూరిపేట, పొట్టిమెట్ట వద్ద పులి పాదముద్రలు అటవీశాఖ అధికారులు గుర్తించారు. వారి పరిశీలనలో గత 29 రోజులుగా అలజడి సృష్టిస్తోన్న పెద్దపులి, తాజాగా మరో కొత్త ప్రాంతంలో లభ్యమైన పాదముద్రలు ఒకటేనని తేల్చారు. ఇన్ని రోజులుగా మూడు మండలాల పరిధిలో దాదాపు 15 గ్రామాల్లో కలియతిరుగుతూ టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్న పెద్దపులి ఇక్కడే సెటిలైపోవడంతో సాధ్యమైనంత త్వరగా పులిని బంధించాలని కాకినాడ జిల్లా ప్రజలు అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు. 
Also Read: Kakinada News : ప్లేసు మార్చిన పెద్దపులి, రోజుకో కొత్త ప్రాంతంలో తిష్ట


Also Read: Anantapur Honor Killing : అనంతపురంలో పరువు హత్య, అల్లుడ్ని హత్య చేయించిన అత్త!