Anantapur Honor Killing : అనంతపురం జిల్లాలో పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. ఉరవకొండలో పరువు హత్య ఘటన మరువక ముందే కనగానపల్లిలో మరో ఘటన చోటుచేసుకుంది. తమ కూతురు వేరే కులం అబ్బాయిని పెళ్లి చేసుకుందనే కారణంతో యువతి తల్లి దారుణానికి పాల్పడింది. యువకుడ్ని కిడ్నాప్ చేసి గ్రామ శివారుకు తీసుకెళ్లి గొంతుకోసి హత్యచేశారు. ఈ హత్యకు యువతి తల్లి ముగ్గురు యువకులను పురమాయించినట్లు తెలుస్తోంది.
అసలేం జరిగింది?
కనగానపల్లికి చెందిన మురళి అదే ప్రాంతానికి చెందిన వీణలు ప్రేమించుకున్నారు. ఇద్దరి సామాజిక వర్గాలు వేరు కావడంతో వీరి పెళ్లికి ఇరు కుటుంబాల్లోని పెద్దలు అంగీకరించలేదు. దీంతో వారిద్దరూ ఇంట్లోంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నారు. అయితే ఈ పెళ్లిని ఒప్పుకోని వీణ తల్లి బెదిరింపులకు పాల్పడింది. పనిమీద బయటకు వెళ్లిన మురళీ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో వీణ పోలీసుల్ని ఆశ్రయించింది. మురళీ కోసం పోలీసుల గాలిస్తున్న సమయంలోనే అతడు దారుణ హత్యకు గురయ్యాడు. విగతజీవిగా పడి ఉన్న భర్త మృతదేహాన్ని చూసి వీణ గుండెలు పగిలేలా రోధించింది. తల్లి యశోదమ్మ తన భర్తను చంపించిందని ఆరోపించింది.
ఏడాది క్రితం ప్రేమ పెళ్లి
రాప్తాడు మండలం లింగనపల్లి గ్రామ పొలాల్లో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అతడు కనగానపల్లికి చెందిన చిట్రా మురళిగా పోలీసులు గుర్తించారు. కనగానపల్లికి చెందిన చిట్రా మురళి ఏడాది క్రితం అదే గ్రామానికి చెందిన మరో సామాజిక వర్గం యువతి ములుగూరి వీణను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ 8 నెలల నుంచి రాప్తాడులో నివాసం ఉంటున్నారు. వీణ కనగానపల్లి మండలం ఎలకుంట్ల సచివాలయంలో మహిళా సచివాలయ పోలీస్ గా పనిచేస్తుంది. మురళి కియా అనుబంధ సంస్థలో పనిచేస్తున్నాడు. మురళి గురువారం కియా సంస్థకు వెళ్లేందుకు రాప్తాడు వై జంక్షన్ వద్ద బస్ కోసం వేచి ఉండగా కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి అపహరించినట్లు తెలుస్తోంది. తన తల్లి, కుటుంబీకులు మురళిని గొంతు కోసి హత్య చేసినట్లు వీణ ఆరోపిస్తున్నారు.
దోషులను కఠినంగా శిక్షించాలి- ఎంపీ గోరంట్ల మాధవ్
మురళి హత్య గురించి తెలుసుకున్న అతని తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. తమ ఒక్కగానొక్క కొడుకు అతి దారుణంగా హత్య చేశారని రోధించారు. ఈ హత్యను ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రి పరిటాల సునీతపై విమర్శలు చేశారు. మురళి హత్యకు పరిటాల సునీత, బాలకృష్ణ, పయ్యావుల కేశవ్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పరువు హత్యపై కురుబ సామాజిక వర్గం నేతలు ఆందోళనకు దిగారు. మురళి హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ పరువు హత్యపై పోలీసులు రంగంలోకి దిగారు. అన్ని కోణాల్లో ఆరాతీస్తున్నామన్నారు కొద్దిరోజుల వ్యవధిలోనే అనంతపురం జిల్లాలో రెండు పరువు హత్యలు జరగడంతో తీవ్ర కలకలం రేపుతోంది.