Dhulipalla Narendra Kumar Arrest: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను (Dhulipalla Narendra) గుంటూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా అనుమర్లపూడి చెరువు వద్ద నరేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పొన్నూరు నియోజకవర్గంలో మట్టి మాఫియా జరుగుతోందని ఆరోపిస్తూ టీడీపీ నేతలు ఛలో అనుమర్లపూడికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు ధూళిపాళను అరెస్టు చేశారు. అయితే, పోలీసుల తీరుపై ధూళిపాళ నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి అనుమతులతో మట్టిని తవ్వుతున్నారని, వైసీపీ నేతల ఆగడాలకు అంతు లేకుండా పోతోందని ఆరోపించారు.
అయితే, ఛలో అనుమర్లపూడికి టీడీపీ నేతలు రానున్న వేళ ముందస్తుగానే ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు.
Chalo Narsipatnam: విశాఖపట్నం జిల్లాలోనూ హౌస్ అరెస్టులు
మరోవైపు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) ఇంటిపై దాడికి నిరసనగా టీడీపీ శ్రేణులు ‘ఛలో నర్సీపట్నం’కు కూడా పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు ఎక్కడికక్కడే తెలుగు దేశం నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు. అనకాపల్లిలో టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావును గృహ నిర్బంధం చేశారు. టీడీపీ రాష్ట్ర బీసీ కన్వీనర్ మళ్ల సురేంద్ర నర్సీపట్నం వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు.
ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు అయ్యన్న కుటుంబానికి అండగా నిలిచారు. అయ్యన్న ఇంటి గోడ కూల్చివేత కక్షపూరిత చర్యల్లో భాగమేనని మండిపడ్డారు. బీసీలను అణగదొక్కాలనే ప్రయత్నం తప్ప మరొకటి కాదని ధ్వజమెత్తారు. అయ్యన్నపాత్రుడే లక్ష్యంగా వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్న నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత, మృణాళిని ఇళ్ల వద్ద పోలీసులు మోహరించి వారు బయటికి రాకుండా చూస్తున్నారు. పరవాడ మండలం వెన్నెలపాలెంలో బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లా గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే కె.ఎ.నాయుడును పోలీసులు అరెస్టు చేశారు.