Southwest Monsoon: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ద్రోణి విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ, అంతర తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. తమిళనాడు తీరంలో నైరుతి బంగాళాఖాతంలో్ సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్లు, 5.6 కిలోమీటర్ల మధ్య తుఫాను తక్కువ ప్రభావం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు గుజరాత్ ప్రాంతంలోని మరికొన్ని ప్రాంతాలు, మధ్యప్రదేశ్, విదర్భలోని మరికొన్ని ప్రాంతాలు, ఛత్తీస్ గఢ్‌లోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, బిహార్ లోకి జూన్ 19న ప్రవేశించాయని పేర్కొంది.


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
నైరుతి రుతుపవనాలు రాబోయే రెండు రోజుల్లో మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, వాయువ్య బంగాళాఖాతం, ఛత్తీస్ గఢ్, ఒడిశాలోని మరికొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, ఈశాన్య ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు మరింత ముందుకు సాగే పరిస్థితులు ఉన్నాయి. కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలపడింది. నేడు యానాంతో పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో నేడు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.






దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. రాయలసీమలో మాత్రం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. విజయవాడ​, గుంటూరు, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. అన్నమయ్య జిల్లాలో విస్తరిస్తున్న భారీ వర్షాలు నేరుగా కడప జిల్లాలొకి విస్తరించనున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచనున్నాయి. వర్షాలతో రైతుల పంట, ధాన్యానికి నష్టం జరిగే అవకాశం ఉందని సూచించారు. 






తెలంగాణలో వర్షాలు
తెలంగాణలోనూ నేడు సైతం పలు జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. నిన్న సైతం రాష్ట్రంలో కొన్నిచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మూలుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.  వర్షాల నేపథ్యంలో వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.