సోషల్ మీడియాలో తన కుమార్తెపై వస్తున్న అసభ్య ట్రోలింగ్‌పై చర్యలు తీసుకోవాలని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు బెండపూడి స్కూల్ విద్యార్థి తల్లి. కొన్నిరోజుల నుంచి ఈ స్కూల్ విద్యార్థులపై ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. అమెరికన్ స్లాంగ్‌తో ఇంగ్లీష్‌లో ఇరగదీసిన ఈ స్కూల్‌  విద్యార్థులు రోజుల వ్యవధిలోనే ఫేమస్ అయిపోయారు. మొదట్లో పాజిటివ్‌గా ట్రోలింగ్స్ నడిచాయి. క్రమంగా ఆ ట్రోలింగ్స్ శ్రుతిమించిపోతున్నాయి. ముఖ్యంగా పదోతరగతి రిజల్ట్స్‌ వచ్చిన తర్వాత నుంచి వీళ్లపై నెగటివ్‌ ట్రోలింగ్స్ ఎక్కువయ్యాయి. వాళ్లు పదో తరగతి మంచి మార్కులతో పాసైనప్పటికీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. 


నెగటివ్ ట్రోలింగ్స్‌ను మొదట పెట్టించుకోని ఈ బెండపూడి విద్యార్థులు తర్వాత వివరణ ఇచ్చుకున్నారు. తమకు పార్టీలతో సంబంధం లేదని.. ఉపాధ్యాయుల సహకారంతో తాము ఇంగ్లీష్‌లో ఫ్లూయెన్స్‌గా మాట్లాడగలుగుతున్నామని... పదోతరగతి మంచి మార్కులు కూడా వచ్చాయని తెలిపారు. దయచేసి తమపై తప్పుడు ప్రచారం చేయొద్దని వేడుకున్నారు.  అయినా సరే ట్రోలింగ్స్‌ దాడి ఆగలేదు. 


బెండపూడి విద్యార్థుల్లో ఒకరైన మేఘనను టార్గెట్ చేసుకొని కొందరు దుష్ప్రచారం చేస్తుండటాన్ని తల్లిదండ్రులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలా చూస్తు ఊరుకుంటే తమ బిడ్డ భవిష్యత్‌కు ప్రమాదమని గ్రహించి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తొండంగి పోలీస్ స్టేషన్‌లో మేఘన తల్లి కంప్లైంట్ ఇచ్చారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా HOST/@lapalapababa అనే ట్విట్టర్ ఖాతా నిర్వాహకునిపై సెక్షన్ 509 ఏపీసీ,  సెక్షన్ ఎస్‌ఈసీ 67 ఆఫ్‌ ఐటీ యాక్ట్‌ 2020 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. 


కాకినాడ జిల్లా బెండపూడి గ్రామం, తొండంగి మండలానికి చెందిన మేఘనా ఉపాధ్యాయుల సహకారంతో అమెరికన్ ఇంగ్లీష్ మాట్లాడం నేర్చుకుందని.. సీఎంను కలిసిన సందర్భంగా మాట్లాడిన వీడియోను వక్రీకరించి HOST/@lapalapababa అనే ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్రోల్లింగ్ చేస్తున్నారని మేఘన తల్లి దుర్గ ఫిర్యాదు చేశారు. అసభ్యకరమైన పదజాలంతో, తమ అమ్మాయి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ట్విట్టర్ అకౌంట్‌లో చేసిన పోస్టింగ్ మాకు చాలా బాధ కలిగించాయని పేర్కొన్నారు.  కష్టపడి చదువుతున్నా తమ అమ్మాయి మీద ఇటువంటి ప్రచారాలు చేయడం ద్వారా తన భవిష్యత్తుపై చెడు ప్రభావం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు ట్విట్టర్ అకౌంట్, ఆ అకౌంట్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవలసిందిగా ఫిర్యాదులో పేర్కొన్నారు. 


సోషల్ మీడియా వేదికగా ఎవరైనా ట్రోల్లింగ్, అసభ్యకరమైన పదజాలం, వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టింగ్ చేస్తే చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా ఇలాంటి సోషల్ మీడియా వేధింపులకు గురైతే  ఉపేక్షించకుండా ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలనీ సూచించారు.