Shravana Masam 2024 Gold : శ్రావణ మాసం ఆధ్యాత్మికంగా హిందువులకు అత్యంత ప్రాధాన్యత కలిగిన నెల. అందుకే శ్రావణాన్ని శుభాల మాసం, పండుగల నెల అని కూడా అంటారు. ఈ నెలలో ప్రతిరోజూ శుభకరమే. దైవభక్తి ఉండే ప్రతి లోగిలిలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తుంది. ఆలయాలు భక్తులతో కిక్కిరిసి ఉంటాయి. ఈ నెల రోజులు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూలు, పండ్లు, తాంబూలం, నైవేద్యాలు ఒకరికి మరొకరు ఇచ్చిపుచ్చుకోవడంలో స్నేహశీలత కనిపిస్తుంది. వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా అంటువ్యాధులను నిర్మూలించేందుకు పసుపు వాడకం అధికంగా ఉంటుంది. గో పంచకం వినియోగం వెనుకున్న ఆంతర్యం కూడా ఇదే. అయితే వీటితో పాటూ శ్రావణమాసంలో తప్పనిసరిగా అందరినోటా వినిపించేమాట బంగారం. తమ శక్తి కొలది ఎంతో కొంత బంగారం కొనుగోలు చేస్తారు.
Also Read: వరలక్ష్మీ వ్రతం సులువుగా చేసుకునే విధానం - ఈ రోజు చదువుకోవాల్సిన వ్రత కథ!
శ్రావణంలో బంగారం ఎందుకు?
శ్రావణమాసంలో వచ్చే మంగళవారం, శుక్రవారం శక్తి ఆరాధనకు ప్రత్యేకం. శ్రావణంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీవ్రతం నిర్వహిస్తారు. ఆ రోజు వివాహితులు ఎంతోకొంత బంగారం కొనుగోలు చేసి అమ్మవారి దగ్గర పెట్టి పూజిస్తారు. కొందరు ఏడాదికో కాసు ( అమ్మవారి రూపు) కొనుగోలు చేసి కాసులపేరు చేయించుకుంటారు. మరికొందరు ఏటా ఒకటే రూపును అమ్మవారి దగ్గర పెడతారు. పసిడిని శ్రీ మహాలక్ష్మి సమానంగా చూస్తారు. దక్షిణాయణంలో వచ్చే అత్యంత విశిష్టమైన శ్రావణమాసం అంటే అమ్మవారికి ప్రీతి. విష్ణువు జన్మనక్షత్రం అయిన శ్రవణం పేరుమీద ఏర్పడడమే అందుకు కారణం. స్వామివారు యోగనిద్రలో ఉండే సమయంలో...ఐశ్వర్యానికి ప్రతీకగా భావించే బంగారంతో అమ్మవారిని సేవిస్తే...ఆ ఇంట సిరిసంపదలుంటాయంటారు. అందుకే ఎవరి శక్తి కొలది వారు బంగారం కొనుగోలు చేస్తారు. ఏటా బంగారం కొనుగోలు చేయలేనివారు పాత కాసునే పాలు, నీళ్లు, పంచామృతాలతో శుభ్రంచేసి వినియోగించవచ్చు.
Also Read: వరలక్ష్మీ వ్రతం ఇలా ఈజీగా చేసేసుకోండి - సిద్ధం చేసుకోవాల్సిన పూజాసామగ్రి , గణపతి పూజా విధానం!
శ్రీ మహా విష్ణువు - లక్ష్మీదేవి ఎంత అన్యోన్యంగా ఉంటారో..శ్రావణంలో వరలక్ష్మీదేవిని పూజించేవారి దాంపత్యం కూడా అంతే అన్యోన్యంగా సాగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే శ్రావణంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజు అమ్మవారికి ప్రత్యేక పూజ చేస్తారు. కోరిన వరాలిస్చే తల్లిగా భావిస్తారు కాబట్టే వరలక్ష్మీదేవిగా పూజిస్తారు. శక్తికొలది బంగారం, పిండివంటలు సమర్పిస్తారు. ఐశ్వర్యం, ఆయుష్షు, సంతానం, ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థిస్తారు.
శ్రీ మహాలక్ష్మీ ద్వాదశనామ స్తోత్రం (Sri Lakshmi Dwadasa Nama Stotram)
శ్రీదేవీ ప్రథమం నామ ద్వితీయమమృతోద్భవా |
తృతీయం కమలా ప్రోక్తా చతుర్థం లోకసుందరీ ||
పంచమం విష్ణుపత్నీ చ షష్ఠం స్యాత్ వైష్ణవీ తథా |
సప్తమం తు వరారోహా అష్టమం హరివల్లభా ||
నవమం శార్ఙ్గిణీ ప్రోక్తా దశమం దేవదేవికా |
ఏకాదశం తు లక్ష్మీః స్యాత్ ద్వాదశం శ్రీహరిప్రియా ||
ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |
ఆయురారోగ్యమైశ్వర్యం తస్య పుణ్యఫలప్రదమ్ || ౪
ఇతి శ్రీ లక్ష్మీ ద్వాదశనామ స్తోత్రమ్ ||
Also Read: శ్రావణమాసంలో అమ్మవారి పూజ చేస్తున్నారా.. ఈ తప్పులు పొరపాటున కూడా చేయకండి!