Varalakshmi Vratam Pooja Vidhanam:  గణపతి పూజ పూర్తైన తర్వాత  మళ్లీ ఆచమనీయం చేయాలి... అప్పుడు కలశ పూజ ప్రారంభించాలి.  ( గణపతి పూజ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)


 కలశపూజ 
కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితాః మూలేతత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ: స్థితాః కుక్షౌతుస్సాగరస్సర్వే సప్తద్వీపా వసుంధరా.. ఋగ్వేదోధ యజుర్వేదో స్సామవేదో అధర్వణః..అంగైశ్చ స్సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః  ఆయాంతు గణపతి పూజార్థం దురితక్షయకారకాః గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధూ కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు॥ అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపైన పూజాద్రవ్యాలపైన పూజ చేస్తున్నవారు తలపైన చల్లుకోవాలి.


అధంగపూజ
పువ్వులు లేదా అక్షతలతో కలశానికి పూజ చేయాలి. 
చంచలాయై నమః  పాదౌ పూజయామి  చపలాయై నమః  జానునీ పూజయామి
పీతాంబరాయైనమః ఉరుం పూజయామి  మలవాసిన్యైనమః  కటిం పూజయామి
పద్మాలయాయైనమః నాభిం పూజయామి మదనమాత్రేనమః స్తనౌ పూజయామి
కంబుకంఠ్యై నమః కంఠంపూజయామి సుముఖాయైనమః  ముఖంపూజయామి
సునేత్రాయైనమః  నేత్రౌపూజయామి రమాయైనమః కర్ణౌ పూజయామి
కమలాయైనమః  శిరః పూజయామి  శ్రీవరలక్ష్య్మైనమః - సర్వాంగాని పూజయామి.


(పూలు, పసుపు, కుంకుమతో అమ్మవారిని అష్టోత్తర శతనామాలతో పూజించాలి)


శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి ( మీకు అందుబాటులో లేకుంటే ఈ లింక్ క్లిక్ చేయండి..ఇందులో ఉంటుంది)
 
తోరాల పూజ  
 అక్షతలతో తోరాలకి పూజచేయాలి..
కమలాయైనమః  ప్రథమగ్రంథిం పూజయామి
రమాయైనమః  ద్వితీయ గ్రంథింపూజయామి
లోకమాత్రేనమః  తృతీయ గ్రంథింపూజయామి
విశ్వజనన్యైనమః  చతుర్థగ్రంథింపూజయామి
మహాలక్ష్మ్యై నమః పంచమగ్రంథిం పూజయామి
క్షీరాబ్ది తనయాయై నమః షష్ఠమ గ్రంథిం పూజయామి
విశ్వసాక్షిణ్యై నమః సప్తమగ్రంథిం పూజయామి
చంద్రసోదర్యైనమః అష్టమగ్రంథిం పూజయామి
శ్రీ వరలక్ష్మీయై నమః  నవమగ్రంథిం పూజయామి


 వరలక్ష్మీదేవికి ధూపం, దీపం, నైవేద్యం, హారతి ఇచ్చి ప్రార్థన చేయాలి.  అనంతరం అమ్మవారి దగ్గరున్న తోరం తీసుకుని చేతికి  కట్టుకోవాలి...


తోరం కట్టుకున్నప్పుడు చదవాల్సిన శ్లోకం 


బద్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే


వరలక్ష్మీవ్రత కథ


శౌనకాది మహర్షులతో సూత మహాముని ఇలా చెప్పారు. మునులారా! స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతాన్ని పరమేశ్వరుడు పార్వతీ దేవికి చెప్పాడు. ఆ వ్రతం గురించి మీకు చెబుతాను శ్రద్ధగా వినండి అని చెప్పారు. 


శివుడు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా నారదమహర్షి ఇంద్రాది దిక్పాలకులు కీర్తిస్తున్నారు. ఆ ఆనంద సమయంలో పార్వతీ దేవి భర్తని ఇలా అడిగింది..స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది సంతానం, ఐశ్వర్యంతో తరించే వ్రతాన్ని సూచించమని కోరింది. అప్పుడు శివుడు చెప్పిన వ్రతమే వరలక్ష్మీవ్రతం. శ్రావణమాసంలో రెండో శుక్రావరం ( పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం) ఆచరించాలని సూచించాడు పరమేశ్వరుడు. అప్పుడు పార్వతీదేవి..ఈ వ్రతాన్ని ఎవరు మొదట ఆచరించారో చెప్పమని కోరింది. 
 
పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఉండేది. బంగారు గోడలతో మిలమిలా మెరిసేది ఆ పట్టణంలో చారుమతి అనే ఓబ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె వినయవిధేయురాలు..భగవంతుడిపై భక్తిశ్రద్ధలున్న ఇల్లాలు. నిత్యం సూర్యోదయానికి ముందే నిద్రలేచి భర్తపాదాలకు నమస్కరించి ఇంటి పనులు పూర్తిచేసి అత్తమామలను సేవించేది. ఆమెకు కలలో కనిపించిన వరలక్ష్మీదేవి..శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వ్రతం ఆచరించమని ఎన్నో వరాలు ప్రసాదిస్తానని చెప్పింది. సంతోషించిన చారుమతి..ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పి ...శ్రావణ శుక్రవారం రోజు ఇరుగు పొరుగువారిని పిలిచి ఇంట్లోనే మండపం ఏర్పాటు చేసి అమ్మవారిని పూజించింది. తొమ్మిదిపోగులున్న కంకణాన్ని చేతికి కట్టుకుంది, తొమ్మి రకాల పిండివంటలు నివేదించింది. భక్తిశ్రద్ధలతో పూజచేసి ప్రదక్షిణ చేస్తుండగా  మొదటి ప్రదక్షిణకు కాలి గజ్జెలు, రెండో ప్రదక్షిణకు చేతులకు నవరత్న ఖచిత కంకణాలు, మూడో ప్రదక్షిణ సమయంలో సర్వా భరణ భూషితులుగా మారారు అందరూ. ఈ వ్రతాన్ని చేసిన చారుమతితో పాటూ చూసితరించిన వారు కూడా ఐశ్వర్యవంతులు అయ్యారు. అప్పటి నుంచి ఏటా శ్రావణశుక్రవారం రోజు వరలక్ష్మీదేవిని పూజించి సిరిసంపదలు పొందుతున్నారు. 


శివుడు..పార్వతికి చెప్పిన ఈకథను సూతమహాముని మహర్షులకు వివరించాడు.. ఈ వ్రతం చేసినవారు మాత్రమే కాదు ఈ వ్రతం చూసిన వారు, ఈ కథ విన్నవారిపై కూడా వరలక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని, సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్వైశ్వర్యాలు కలుగుతాయని చెప్పారు. ఈ కథ విని అక్షతలు తలపై వేసుకుని అనంతరం మహిళలు..ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి. 


భక్తితో వేడుకుంటే వరాలందించే  వరలక్ష్మీ వ్రతాన్నిఆచరించడానికి ఏ  నియమాలు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రత ఉంటే సరిపోతుంది. ఎంతో మంగళకరమైన ఈ వ్రతాన్ని ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయి.