Shani Jayanti 2024:  శని అనే మాట వింటేనే భయపడిపోతారు...కానీ శనీశ్వరుడిని కర్మఫలదాత అంటారు. సూర్యుడు - ఛాయాదేవి తనయుడే శనిదేవుడు. నవగ్రహాల సంచారాన్ని ఆధారంగా చేసుకుని జాతకచక్రం వేస్తారు. అయితే వీటిలో శని సంచారం అత్యంత ముఖ్యంగా పరిగణిస్తారు. జాతకచక్రంలో శని ఉన్న స్థానం మీ జీవితం ఎలా ఉంటుందో చెప్పేస్తుంది. ఇక ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నుంచి తప్పించుకోవడం ఎవ్వరి తరం కాదు. మిగిలిన గ్రహాలన్నీ నెలరోజులకోసారి రాశులు మారుతూ సంచరిస్తే..శనిదేవుడు మాత్రం రెండున్నరేళ్లకు ఓ రాశి చొప్పున మారుతుంటాడు..అందుకే శనిని మందరుడు అంటారు. వైశాఖ మాసం అమావాస్య శని జయంతి. ఈ రోజు కొన్ని నియమాలు పాటించడం, దానధర్మాలు చేయడం ద్వారా శనిదోషం నుంచి బయటపడతారని పండితులు చెబుతున్నారు...


Also Read: మీపై శని ప్రభావం ఉందో లేదో తెలుసుకోవడం ఎలా, ఉంటే ఏం చేయాలి!


శనీశ్వర జయంతి రోజు ఇలా చేయండి
వైశాఖ అమావాస్య రోజు శనీశ్వరుడిని ప్రశన్నం చేసుకునేందుకు... వేకువజామునే నిద్రలేచి అభ్యంగన స్నానం ఆచరించాలి. అనంతరం శని తండ్రి అయిన సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఇంట్లో దేవుడిమందిరంలో నువ్వులనూనెతో దీపం వెలిగించి శని స్తోత్రాలు, శ్లోకాలు చదువుకుని..ఆ తర్వాత ఆలయానికి వెళ్లి శనీశ్వరుడికి తైలాభిషేకం చేయాలి. ఈ రోజు పరమేశ్వరుడిని, ఆంజనేయుడిని పూజించినా శని ప్రభావం తగ్గుతుంది. నల్ల నువ్వులు, నల్లటి వస్త్రాలు దానం ఇవ్వాలి. శనీశ్వరుడికి సంబంధించి జపాలు, హోమాలు చేసేందుకు ఈరోజు చాలా విశిష్టమైనది. కాకులకు, కుక్కలకు రొట్టెలు వేయడం...నల్ల చీమలకు పంచదార ఆహారంగా అందించడం, పశువులు పక్షులకు నీళ్లు ఆహారం అందించడంతో పాటూ...పేదలకు ఆహారం, వస్త్రాలు, నల్లటి గొడుగు దానం చేస్తే శని ప్రభాం తగ్గుతుంది. రావిచెట్టుకి ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. ఈరోజు ఉల్లి వెల్లుల్లి, మాంసాహారానికి దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి...


Also Read: ఈ ఏడాదంతా ఏల్నాటి శని, అష్టమ శని ఉన్న రాశులివే!


ఈ రాశులవారిపై శని ప్రభావం
ప్రస్తుతం శని ప్రభావం కర్కాటకం, వృశ్చికం, మకరం, కుంభం, మీన రాశులవారిపై ఉంది. 


కర్కాటక రాశివారికి అర్ధాష్టమ శని నడుస్తోంది...ఈ ఫలితంగా అనారోగ్య సమస్యలు, వాహనప్రమాద సూచనలున్నాయి. జూన్ 6 గురువారం శని జయంతి సందర్భంగా పైన పేర్కొన్న నియమాలు పాటిస్తే శని ప్రభావం కొంతవరకూ తగ్గుతుంది.


వృశ్చిక రాశివారికి కూడా ఈ ఏడాదంతా అర్ధాష్టమ శని ఉంది. ఈ ప్రభావం మీపై అంతగా లేకపోయినా శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడం , శని చాలీశా చదువుకోవడం వల్ల మంచి జరుగుతుంది


మకర రాశి, కుంభ రాశి, మీన రాశి...ఈ మూడు రాశులవారికి ఏల్నాటి శని ఉంది. గురు , శుక్రుల బలం ఉంటే శని ప్రభావం ఉన్నప్పటికీ అన్నింటా మీదే పైచేయి అవుతుంది. అయితే శనీశ్వర జయంతి రోజు నియమాలు పాటించడం , శని ఆలయానికి వెళ్లి అభిషేకం చేయించడం ద్వారా మరిన్ని మెరుగైన ఫలితాలు పొందుతారు...


Also Read: శని వెంటాడుతోందా, నిత్యం ఇవి చదివితే ఆ ప్రభావం తగ్గుతుందట


కేవలం ఈ రాశులవారు మాత్రమే కాదు..శని జయంతి రోజు ఆలయంలో అయినా ఇంట్లో అయినా శని చాలీశా, శని స్తోత్రాలు చదువుకోవడం ద్వారా శనీశ్వరుడి అనుగ్రహం మీపై ఉంటుంది.