Shani Dev Effect: నవగ్రహాల్లో అత్యంత శక్తిమంతుడు శని. ఈయనకు కాకి వాహనం. మకరం,కుంభ రాశులకు అధిపతి శని. గోచారరీత్యా శని 12 రాశుల్లో సంచారం పూర్తిచేయడానికి మొత్తం 30 సంవత్సరాల సమయం పడుతుంది. 30 ఏళ్ళకు ఒకసారి ప్రతి ఒక్కరిపై ఏల్నాటి శని ప్రభావం ఉంటుంది.
ఏల్నాటి శని వల్ల కలిగే కష్టనష్టాలు ఇలా ఉంటాయి
జాతకునికి గోచారరీత్యా తన జన్మరాశి (జన్మ నక్షత్రాన్ని బట్టి చూసుకోవాలి) నుంచి 12,1,2 స్థానాల్లో శని సంచరించే కాలాన్ని ఏల్నాటి శని అంటారు. ఈ మూడు రాశుల్లో మొత్తం ఏడున్నర సంవత్సరాలు సంచరించడం వల్ల దీనిని దీనిని ఏలినాటి శని అని వ్యవహరిస్తారు.
శని 12 వ రాశిలో సంచరిస్తే: వ్యవహారాల్లో చిక్కులు, వ్యాపారాల్లో ఒడిదుడుకులు, ఊహించని మార్పులు, అనారోగ్యం, ఔషధ సేవనం, తరచూ ప్రయాణాలు.
శని జన్మరాశిలో సంచరిస్తే: ఆరోగ్యభంగం, నీలాపనిందలు, భాగస్వాములతో వైరం, మనశ్శాంతి లోపం, ధనవ్యయం, రుణబాధలు, వృత్తి, వ్యాపారాల్లో చికాకులు, స్థానచలన సూచనలు
శని రెండవ రాశిలో సంచరిస్తే: ఆశలు కల్పించి నిరాశ కల్పిస్తాడు. రుణబాధలు,అనారోగ్యం,మానసిక ఆందోళన వంటి ఫలితాలు ఉంటాయి.
Also Read: ఈ తేదీల్లో పుట్టినవారికి శత్రువులు కూడా స్నేహహస్తం అందిస్తారు, అక్టోబరు 8 న్యూమరాలజీ
మూడు రకాల శని
1.మంగు శని: జీవితంలో మొదటిసారి వచ్చే ఏల్నాటి శనిని మంగు శని
2.పొంగు శని: జీవితంలో రెండోసారి (30 సంవత్సరాల అనంతరం) వచ్చే ఏల్నాటి శనిని పొంగుశని అని అంటారు.
ఈ కాలంలో అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి బావుంటుంది, గృహయోగాలు, ఉద్యోగయోగం ఉంటుంది
3.మృత్యు శని: మూడో పర్యాయం వచ్చిన శనిని మృత్యుశని అంటారు. ఈ కాలంలో అనారోగ్య సమస్యలు, అపమృత్యుభయం ఎదుర్కొంటారు.
అలాగే జన్మరాశికి 4,8,10 స్థానాల్లో శని సంచరిస్తున్నప్పుడు అర్ధాష్టమ, అష్టమ, దశమ శని సంచారం అంటారు. ఇవి కూడా దోషకారకమే.
అర్ధాష్టమ శని
జన్మరాశి నుంచి నాలుగువ రాశిలో శని సంచరిస్తే అర్ధాష్టమ శని అంటారు. ఈ సమయంలో రాజకీయ, వ్యాపారాల్లో చిక్కులు, కుటుంబసమస్యలు, అశాంతి, ఆకస్మిక బదిలీలు, వ్యాపార, ఉద్యోగాల్లో మార్పులు వంటి ఫలితాలు ఉంటాయి. స్ధాన చలనం, స్ధిరాస్తి సమస్యలు, వాహన ప్రమాదాలు,తల్లికి అనారోగ్యం తప్పదు
అష్టమ శని
జన్మరాశి నుంచి 8వ స్థానంలో శని సంచరించడాన్ని అష్టమ శని అంటారు. ఈ కాలంలో ఉద్యోగాల్లో ఆటంకాలు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఆలోచనలు స్థిరంగా ఉండకపోవడం, అశాంతి, అనారోగ్య సమస్యలు వంటి ఫలితాలు ఉంటాయి.శత్రు బాదలు,ఊహించని నష్టాలు వస్తాయి.
Also Read: ఈ రాశివారు గతంలో చేసిన పొరపాటుకి ఇప్పుడు భయపడతారు, అక్టోబరు 8 రాశిఫలాలు
దశమ శని
జన్మరాశి నుంచి 10వ స్థానంలో శని సంచరిస్తున్నప్పుడు కంటక శని అంటారు. దీనివల్ల కోర్టు కేసులు, సాంఘిక-రాజకీయంగా అపవాదులు, అధికారులతో విభేదాలు, ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు వంటి ఫలితాలు ఉంటాయి.తండ్రితో గొడవలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
అయితే జాతకచక్రంలో శని మంచి స్థితిలో ఉన్నప్పుడు గోచారంలో గురు బలం ఉన్నప్పుడు ఏల్నాటి శని అంతగా బాధించడు. ఈ దోషాలు ఉన్న వారు శనికి తైలాభిషేకం చేయడం, శ్రమ చేయడం చేయడం ద్వారా కొంత ఉపశమనం పొందుతారు. శని శ్రమ కారకుడు కాబట్టి శ్రమకారక జీవులైన చీమలకు పంచదార, తేనె వేయడం వల్ల శనిబాధల నుంచి ఉపశమనం లభిస్తుంది.