చిత్తూరు జిల్లా: గంగాధర నెల్లూరు పోలీస్ స్టేషన్‌ ప్రాంగణంలో భారీ పేలుడు కలకలం రేపింది. పోలీస్ స్టేషన్ ఆవరణలో శనివారం వేకువజామున 3 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడుతో శబ్ధం వచ్చింది. ఈ పేలుడు ఘటనతో పోలీసులు, స్థానికులు ఉలిక్కిపడి నిద్ర నుంచి మేల్కొన్నారని తెలుస్తోంది. ఈ భారీ పేలుడు ఘటనలో పోలీస్ స్టేషన్ లోని అద్దాలు, తలుపులు, కిటీకీలు, పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న, సీజ్ చేసిన కార్లు, బైకులు ధ్వంసం అయ్యాయి. 


అసలేం జరిగిందంటే.. 
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పోలీసు స్టేషనులో ఈ రోజు ఉదయం భారీ పేలుడు సంభవించింది. శనివారం వేకువజామున 3:45 గంటలకు ఒక్కసారిగా పేలుడు సంబంధించడంతో పోలీసులు, స్ధానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఏఎస్ఐ ఆంజనేయులు రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయని సమాచారం. పేలుడు దాటికి పీఎస్ లోని తలుపులు, ఫర్నీచర్ ధ్వంసమయ్యాయి. అద్దాలు పగిలి గాజు పెంకులు చెల్లాచెదురుగా పడ్డాయి. ఆస్తి నష్టం సంభవించిందని, ఎంత మేర అనే దానిపై అధికారులు అంచనా వేస్తున్నారు. 


అయితే 2018 జూన్ లో జరిగిన ఓ కేసుకు సంబంధించిన గన్ పౌడర్ ను సీజ్ చేసి నిర్వీర్యం చేశారు పోలీసులు. ఇందులో కొంత భాగాన్ని FSL కోసం ఉపయోగించిన గన్ పౌడర్ ను G.D.నెల్లూరు పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న మర్రిచెట్టు కింది భాగంలో పూడ్చిపెట్టారు. దీని వలన మర్రి చెట్టు దగ్గర చిన్న పాటి పేలుడు సంభవించినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ పేలుడులో ప్రజలకు కాని పోలీస్ సిబ్బందికి గాని ఎటువంటి గాయాలు కాలేదు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉంచిన వాహనాలు ధ్వంసమయ్యాయి. కాని పోలీస్ స్టేషన్ లో ఎలాంటి నష్టం జరగలేదని, ఇది చాలా చిన్న పేలుడని ఎటువంటి వదంతులను నమ్మవద్దని చిత్తూరు జిల్లా డిఎస్పి సుధాకర్ రెడ్డి తెలిపారు.