QS World University Rankings: దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలుగా వెలుగొందుతున్న ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ ప్రపంచస్థాయిలో సత్తాచాటాయి. ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీల ర్యాంకింగ్స్‌లో పోటీపడి ప్రపంచంలోని టాప్‌-150 ఉన్నత విద్యాసంస్థల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. లండన్‌లో విడుదలైన క్వాక్వెరెల్లీ సైమండ్స్‌ (క్యూఎస్‌) వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్‌-2025 ప్రకారం.. అమెరికాకు చెందిన మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(MIT) 100 స్కోరుతో ప్రపంచంలోనే అత్యుత్తమ యూనివర్సిటీగా వరుసగా 13వ సారి ప్రథమ స్థానంలో నిలిచింది. 

ఇక మన దేశం నుంచి ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ ర్యాంకింగ్‌ను మెరుగుపరుచుకున్నాయి. గతేడాది 149వ ర్యాంకు సాధించిన ఐఐటీ బాంబే ఈసారి 31 ర్యాంకులు ఎగబాకి 56.3 స్కోరుతో 118వ స్థానంలో నిలిచింది. ఉద్యోగితతోపాటు సామాజిక స్పృహ, పర్యావరణ విభాగాల్లో ఐఐటీ బాంబేని భారత్‌లోని అత్యుత్తమ ఉన్నత విద్యాసంస్థగా నిర్ణయించారు.  ఇక ఐఐటీ ఢిల్లీ 47 స్థానాలు మెరుగుపరచుకొని 52.1 స్కోరుతో 150వ స్థానంలో నిలవడం విశేషం. గౌరవనీయ యూనివర్సిటీల ర్యాంకింగ్స్‌లో.. గ్రాడ్యుయేట్లకు మెరుగైన ప్లేస్‌మెంట్లు అందిస్తున్న ఐఐటీ ఢిల్లీ 44 స్థానంలో నిలిచినట్లు క్యూఎస్‌ జాబితా పేర్కొంది. 2025 క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ కోసం.. 17 మిలియన్ల పరిశోధన పత్రాలు, 176 మిలియన్ అనులేఖనాలు (సైటేషన్స్), ప్రపంచవ్యాప్తంగా 5,600 విద్యాసంస్థల నుండి డేటాను సేకరించినట్లు క్యూఎస్ తెలిపింది. ఇంకా 1,75,798 విద్యావేత్తలను, 105,476 ఉద్యోగ సంస్థలను సంప్రదించినట్లు పేర్కొంది.

➥ ఇక బెంగళూరులోని ఐఐఎస్సీ 14 స్థానాలు మెరుగుపర్చుకుని ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 225 నుంచి 211కి చేరుకుంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్‌పూర్ (IIT-KGP) 2024లో 271 నుండి ఈ సంవత్సరం 222 ర్యాంకుకు చేరుకుంది.

➥ ఆ తర్వాతి స్థానంలో ఐఐటీ మద్రాస్ 58 స్థానాలు ఎగబాకి 285 నుంచి 227కి చేరింది. ఇక ఐఐటీ కాన్పూర్‌ 278 నుంచి 263 ర్యాంకుకి చేరినప్పటికీ.. ఐఐటీ మద్రాస్ తర్వాతి స్థానంలో నిలిచింది.

➥ దేశంలో మొదటి మూడు స్థానాల్లో వరుసగా ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ, ఐఐఎస్సీ-బెంగళూరు నిలవగా.. నాలుగో స్థానంలో ఐఐటీ ఖరగ్‌పూర్, 5వ స్థానంలో ఐఐటీ మద్రాస్, 6వ స్థానంలో ఐఐటీ కాన్పూర్ నిలిచింది.

➥ మరోవైపు గతేడాది 407వ స్థానంలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ(DU) 79 ర్యాంకులు మెరుగుపడి 328 స్థానంలో నిలిచింది. గతేడాది ఢిల్లీ యూనివర్సిటీ దేశంలోనే 9వ స్థానంలో నిలవగా.. ఈ ఏడాది 7వ స్థానానికి ఎగబాకింది.

➥ వీటితోపాటు ఐఐటీ రూర్కీ, ఐఐటీ గువాహటి, అన్నా యూనివర్సిటీ వరుసగా 8, 9, 10 ర్యాంకుల్లో నిలిచాయి.

➥ ఆ తర్వాతి స్థానాల్లో టాప్-15లోపు ఐఐటీ ఇండోర్ 11వ ర్యాంకు, ఐఐటీ వారణాసి (BHU) 12వ ర్యాంకు, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ(JNU) 13వ ర్యాంకు, షూలిని యూనివర్సిటీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్ 14వ ర్యాంకు, సావిత్రిబాయ్ పూలే పూణే యూనివర్సిటీ 15వ ర్యాంకులో నిలిచాయి.

టాప్-10 విద్యాసంస్థలు ఇవే..

ర్యాంకు యూనివర్సిటీ స్కోరు
1 మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ  100
2 ఇంపీరియల్ కాలేజ్ లండన్   98.5
3 యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్  96.9
4 హార్వర్డ్ యూనివర్సిటీ  96.8
5 యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్  96.7
6 స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ  96.1
7 ETH జ్యూరిచ్, స్విట్జర్‌లాండ్  93.9
8 నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్  93.7
9 యూసీఎల్   91.6
10 కాలిఫోర్నియా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ   90.90

ప్రపంచ అత్యుత్తమ యూనివర్సిటీల పూర్తి జాబితా కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..