Hyderabad Metro Trains Stopped: హైదరాబాద్ మెట్రో రైళ్లు మియాపూర్ - ఎల్బీ నగర్ మార్గంలో నిలిచిపోయాయి. సాంకేతిక కారణాలతోనే రెడ్ లైన్‌లో రైళ్లను నిలిపివేసినట్లుగా మెట్రో రైలు లోకో పైలట్లు చెబుతున్నారు. హైదరాబాద్ లో అసలే భారీ వర్షం కురియడంతో విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో చాలా మంది రోడ్డు మార్గం ద్వారా కాకుండా మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. ఇంతలో రైళ్ల రాకపోకలు ఆగిపోవడంతో స్టేషన్లు అన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. అటు ఎల్బీ నగర్ మెట్రోలో ఎగ్జిట్ మెషిన్లు కూడా పని చేయడం లేదని ప్రయాణికులు చెబుతున్నారు. దాంతో ప్రయాణికులు బయటకు వెళ్లలేకపోతున్నారు.






అయితే, వెంటనే సమస్యను పరిష్కరించినట్లుగా ఎల్ అండ్ టీ మెట్రో రైలు సంస్థ ప్రకటించింది. ఓ చిన్న లోపం కారణంగా రైళ్లు నిలిచాయని.. ఆ సమస్యను 7 నిమిషాల్లోనే పరిష్కరించామని వెల్లడించింది. ఈ మేరకు ఎక్స్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది.


‘‘చిన్న అంతరాయం వేగంగా పరిష్కరించాం. హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులకు ఈ సాయంత్రం స్వల్ప అంతరాయం ఏర్పడింది. ఎంజీబీఎస్ వద్ద ట్రాన్స్‌ కో ఫీడర్ ట్రిప్పింగ్ అవ్వడం వల్ల ఈ సమస్య వచ్చింది. ఈ సమస్యను మా టీం 7 నిమిషాల్లోనే పరిష్కరించింది. మియాపూర్ వద్ద ఉన్న మరొక ఫీడర్‌కు కనెక్ట్ చేశాం. తద్వారా మెట్రో రైలు సర్వీసులు కాసేపట్లో ఇక యథావిధంగా నడుస్తాయి. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ప్రయాణికుల సౌకర్యమే మా మొదటి ప్రాధాన్యత’’ అని ఎల్ అండ్ టీ మెట్రో రైలు సంస్థ ఎక్స్‌లో ఓ ప్రకటన విడుదల చేసింది.