Heavy Rains In Hyderabad Telangana: హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు చురుకుగా కదలడంతో తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపుతున్నాయి. మూడు రోజుల కిందట నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించాయి. అదేరోజు అటు ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. తెలంగాణలోనూ గత మూడు రోజుల నుంచి ఏదో చోట తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. హైదరాబాద్ లో బుధవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి బయలుదేరే సమయంలో వాన పడటంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు కొన్ని మార్గాల్లో ఇబ్బంది పడుతున్నారు. 


అమీన్‌పూర్, కిష్టారెడ్డిపేట, కూకట్ పల్లి, లింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, నిజాంపేట తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. సరూర్ నగర్, సైదాబాద్ లలో వర్షం పడుతోంది. అటు మియాపూర్ నుంచి ఇటు వనస్థలిపురం వరకు సికింద్రాబాద్, హైదరాబాద్ వ్యాప్తంగా మరికొన్ని గంటలపాటు వర్షం కురుస్తుందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు.  






నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం దక్షిణ ఆంధ్రప్రదేశ్ దాని పరిసర ప్రాంతాలలో సముద్రమట్టానికి 3.1 నుంచి 4 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దీని ప్రభావం, నైరుతి రుతుపవనాల వ్యాప్తితో మరో రెండు, మూడు రోజులు తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వర్ష సూచన ఉన్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసి ప్రజల్ని అప్రమత్తం చేశారు.






సిద్దిపేట, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లోనూ వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ఈ జిల్లాలతో పాటు మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షం కురవనుంది. జీహెచ్ఎంసీ ప్రాంతాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.