The Power of Saligram in Telugu: శ్రీ మహావిష్ణువు ‘సాలగ్రామం’ అనే రాయి రూపాన్ని ధరించడం వెనుక ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది బృంద కథ. కాలనేమికి జన్మించిన బృంద.. జలంధరుడు అనే రాక్షసుడిని వివాహం చేసుకుంటుంది. ఆమె మహాపతివ్రత..జలంధరుడు మాత్రం అందర్నీ పీడిస్తుంటాడు. ఒకానొకసమయంలో ఏకంగా పరమేశ్వరుడి రూపం ధరించి పార్వతీదేవిని మోహించబోతాడు. నిజం తెలుసుకున్న పార్వతీదేవి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లి తనను కాపాడమని కోరుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బృంద పాతివ్రత్యాన్ని భంగం చేయకపోతే ఆ పుణ్యఫలంతో జలంధరుడు ఇలా ఉన్నాడని ఇక ఆమె ప్రాతివ్రత్యం భంగపరచాల్సిందే అంటుంది పార్వతీదేవి. సకలలోకాల క్షేమం కోరిన శ్రీ మహావిష్ణువు స్వయంగా జలంధరుడి రూపం ధరించి బృందని మోసగించి ఆ తర్వాత నిజరూపం ప్రకటిస్తాడు. తన దగ్గరకు వచ్చింది భర్తకాదని తెలుసుకుని ఆగ్రహం చెందిన బృంద..విష్ణువును శిలగా మారిపోమని శపిస్తుంద. అలా శ్రీ మహావిష్ణువులు సాలగ్రామరూపాన్ని ధరించాడని పురాణ కథనం.
Also Read: కార్తీకమాసంలో దీపదానం ఎలా చేయాలి - ఎన్ని వత్తుల దీపాన్ని దానం ఇవ్వాలి!
సాలగ్రామ శిలలు గండకీనదిలో లభిస్తాయి. ఇవి ఎంత చిన్నవిగా ఉంటే అంత మంచిదంటారు. విష్ణు భక్తులకు సాలగ్రామ ఆరాధనను మోక్షానికి మార్గంగా భావిస్తారు. శివారాధనలో బిల్వపత్రానికి ఎంత ప్రాధాన్యత ఉందో..విష్ణు పూజలో సాలగ్రామాలకు అంత ప్రాధాన్యత ఉంటుంది. సాలగ్రామరూపంలో కొలువైన నారాయణుడికి తులసీ దళాన్ని సమర్పించడం ద్వారా ప్రశన్నం చేసుకోవచ్చు.
సాలగ్రామ పూజ వల్ల సకల రోగాలు నశించి ఆయురారోగ్యాలు కలుగుతాయి. అశాంతి, ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వారు నిత్యం సాలగ్రామ శిలను పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన కార్తీకమాసంలో సాలగ్రామాన్ని దానంగా ఇస్తారు. వాటిపై ఉండే చక్రాలను బట్టి వివిధ పేర్లతో పిలుస్తారు.
ఓ చక్రం ఉంటే సుదర్శనం, 2 చక్రాలుంటే లక్ష్మీనారాయణ, 3 చక్రాలు ఉంటే అచ్యుతుడు, 4 చక్రాలుంటే జనార్ధుడు, 5 చక్రాలుంటే వాసుదేవుడు,
6 చక్రాలుంటే ప్రద్యుమ్నుడు, 7 చక్రాలుంటే సంకర్షణుడు , 8 చక్రాలుంటే పురుషోత్తముడు , 9 చక్రాలుంటే నవవ్యూహమని, 10 చక్రాలుంటే దశావతారమనీ, 11 చక్రాలుంటే అనిరుద్ధుడు, 12 చక్రాలుంటే ద్వాదశాత్ముడు అనీ..అంతకన్నా ఎక్కువ చక్రాలుంటే అనంతమూర్తి అని పిలుస్తారు.
Also Read: నవంబరు 12 or 13 క్షీరాబ్ధి ద్వాదశి ఎప్పుడు - కార్తీకమాసంలో ఈ రోజుకి ఎందుకంత ప్రాధాన్యత!
సాలగ్రామన్ని ఆవుపాలతోగానీ, పంచామృతంతోగానీ శుద్ధి చేయాలి...రుద్రాక్షధారణ చేసేటప్పుడు ఏ నియమాలు పాటిస్తారో అవే నియమాలు పాటించి సాలగ్రామాన్ని పూజించాలి. ఇంట్లో పూజించే సాలగ్రామానికి నిత్యం నైవేద్యం పెట్టాలి. కేవలం కుటుంబ సభ్యులు మినహా మిగిలినవాళ్లకి సాలగ్రామం చూపించకూడదు. సాలగ్రామాన్ని స్త్రీలు తాకరాదు.
సాలగ్రామం ఉన్న ప్రదేశంలో స్నానం చేసినా, దానిని దానం చేసినా కాశీ క్షేత్రంలో చేసిన దానాలతో సమానమైన ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో సమస్త విధివిధానాలతో సాలగ్రామాన్ని భక్తిశ్రద్ధలతో దానం చేస్తే కోటి యజ్ఞాలు చేసినంత , కోటి గోవులను దానం చేసిన ఫలం లభిస్తుంది.
Also Read: కార్తీక పౌర్ణమి ఈ ఏడాది (2024) ఎప్పుడొచ్చింది - ఈ రోజు విశిష్టత ఏంటి!