Karthika Masam Ksheerabdi Dwadasi 2024 Date and Time:  కార్తీకం  నెలంతా అత్యంత పవిత్రమైనదే.. మరీ ముఖ్యంగా కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకూ 5 రోజులు మరింత విశేషమైనవి. ఎందుకంటే కార్తీక శుద్ద ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు నిద్రనుంచి మేల్కొంటాడు..అందుకే దీనిని ఉత్థాన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఆ మర్నాడు వచ్చే ద్వాదశిని చిలుకు ద్వాదశి / క్షీరాబ్ది ద్వాదశి అని  పిలుస్తారు. ఏకాదశి రోజు యోగనిద్ర నుంచి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజు  శ్రీ మహాలక్ష్మితో కలసి భూలోకానికి వస్తాడట. అందుకే  విష్ణువు కొలువైన ఉసిరికి... మహాలక్ష్మిగా భావించే తులసికి కళ్యాణం జరిపిస్తారు.


Also Read: కార్తీక పౌర్ణమి ఈ ఏడాది (2024) ఎప్పుడొచ్చింది - ఈ రోజు విశిష్టత ఏంటి!
 
వాసుకిని తాడుగా, మందర పర్వతాన్ని కవ్వంగానూ చేసుకుని పాలసముద్రాన్ని చిలకడం ప్రారంభించిన రోజు ఇదే..అందుకే చిలుక ద్వాదశి అంటారని పురాణాల్లో ఉంది. అలాగే క్షీరసాగరానికి గుర్తుగా క్షీరాబ్ది ద్వాదశి అని కూడా  అంటారు. పాలకడలి నుంచి ఉద్భవించిన క్షీరాబ్ది కన్య శ్రీ మహలక్ష్మి విష్ణువును వివాహం చేసుకున్నది ఈ రోజే..అందుకు గుర్తుగా కూడా క్షీరాబ్ది ద్వాదశి అంటారు.


ఆషాఢ శుద్ద ఏకాదశి రోజు ప్రారంభించి చాతుర్మాస్య దీక్ష కార్తీక శుద్ద ద్వాదశి రోజుతో ముగుస్తుంది. అందుకే ఈ పవిత్రమైన తిథిని యోగీశ్వర ద్వాదశి అని కూడా అంటారు.


నవంబరు 12 మధ్యాహ్నం వరకూ ఏకాదశి ఘడియలు ఉండి ఆ తర్వాత ద్వాదశి ప్రారంభమైంది...నవంబరు 13 బుధవారం ఉదయం పదిన్నర సమయానికి ద్వాదశి ఘడియలు పూర్తవుతున్నాయి...అందుకే ఏకాదశి, క్షీరాబ్ధి ద్వాదశి నవంబరు 12నే జరుపుకోవాలనేవారూ ఉన్నారు..అయితే ద్వాదశి ఘడియలు  సూర్యోదయ సమయానికి ఉన్న రోజునే పరిగణలోకి తీసుకోవాలని అందుకే ద్వాదశి దీపాలు నవంబరు 13నే పెట్టుకోవాలని చెబుతున్నారు పండితులు. 


Also Read: లక్ష్మీనారాయణుల అనుగ్రహం కోసం క్షీరాబ్ధి ద్వాదశి పూజ ఇలా ఈజీగా చేసేసుకోండి !


క్షీరాబ్ధి ద్వాదశి విశిష్టత గురించి భాగవతంతో పాటూ కార్తీకపురాణంలోనూ ఓ కథ ఉంది...


శ్రీ మహావిష్ణువుకి... భక్త ప్రహ్లాదుడిలాగానే అంబరీషుడు కూడా అత్యంత ప్రియమైన భక్తుడు. ఇక్ష్వాకు వంశానికి చెందిన నభగ మహారాజు కుమారుడైన  అంబరీషుడు నిత్యం హరినామస్మరణలో మునిగితేలేవాడు. కార్తీకమాసంలో వచ్చే ఏకాదశి రోజు వ్రతం ఆచరించాడు. అంటే ఏకాదశి మొత్తం ఉపవాసం ఉంజి..ద్వాదశి రోజు బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాము ఉపవాసం విరమించాలి. ఈ వ్రతం సమయంలో ఇంటికి వచ్చారు దూర్వాస మహర్షి. స్నానానికి వెళ్లొస్తానని చెప్పి ద్వాదశి ఘడియలు దాటిపోతున్నా కానీ రాలేదు. ఆ ఘడియలు దాటితే ఉపవాసం ఫలితం ఉండదని భావించిన అంబరీషుడు..తులసి నీళ్లు తాగి దీక్ష విరమిస్తాడు.  అప్పుడే అక్కడకు వచ్చిన దూర్వాసుడు..తన దివ్యదృష్టితో జరిగింది తెలుసుకుని ఆగ్రహించి...పదిరకాల జన్మలు ఎత్తమని శపిస్తాడు...అంతేకాదు ఓ రాక్షసుడిని సృష్టించి అంబరీషుడిని సంహరించమంటాడు. కానీ అంబరీషుడి భక్తి ముందు ఆ రాక్షసుడు నిలువలేకపోతాడు. తన భక్తుడిని శపించినందుకు ఆగ్రహించిన శ్రీ మహావిష్ణువు దూర్వాసుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. అలా తప్పించుకునేందుకు ప్రయత్నించిన దూర్వాసుడు విధిలేక శ్రీహరి ముందు మోకరిల్లుతాడు. అప్పటికి శాంతించిన విష్ణువు.. తన భక్తుడైన అంబరీషుడికి ఇచ్చిన శాపాన్ని తాను తీసుకుంటానని చెప్పాడు...అవే పది అవతారాలు. దుష్ట శిక్షణ కోసం ఒక్కో అవతారంలో జన్మిస్తూ వస్తున్నాడు విష్ణువు..ఇక ఆఖరి అవతారం కల్కి మిగిలిఉంది. 


ద్వాదశి రోజు ఈ కథ చదివినా, విన్నా పాపాలు నశించి విష్ణు సాయుజ్యం లభిస్తుందని కార్తీక పురాణంలో ఉంది...


Also Read:  క్షీరాబ్ధి ద్వాదశి వ్రత కథ ఇదే.. తులసి కోట దగ్గర దీపాలు వెలిగించాక చదువుకోవాలి!