Ksheerabdhi Dwadashi Vrat Katha


తులసీవ్రత మహాత్మ్యం శ్రోతవ్యం పుణ్యవాంచ్ఛినః
యదిచ్ఛేద్విష్ణు సాయుజ్యం శ్రోతవ్యంబ్రాహ్మణైస్సహ
విష్ణోః ప్రీతిశ్చ కర్తవ్యా శ్రోత వ్యాతులసీకథా
ద్వాదశ్యాం శ్రవణాత్తస్యాః పునర్జన్మ న విద్యతే


పాండవులు రాజ్యం పోగొట్టుకుని ద్వైతవనంలో ఉన్న సమయంలో అక్కడకు వచ్చిన వ్యాసమహర్షికి సకల ఉపచారాలు చేశారు. మనుషుల ధర్మబద్ధమైన కోర్కెలు ఏ ఉపాయంతో సిద్ధిస్తాయో సెలవీయండి అని అడిగాడు. అప్పుడు వ్యాసమహర్షి రెండు వ్రతాలు సూచించారు. వాటిలో మొదటిది  క్షీరాబ్ధి ద్వాదశి వ్రతం, రెండోది క్షీరాబ్ధి శయన వ్రతం. కార్తీకమాసంలో పౌర్ణమి ముందు వచ్చే ద్వాదశి రోజు క్షీరాబ్ధి ద్వాదశీవ్రతం చేస్తారు.. ఆ వ్రతం గురించి వ్యాసమహర్షి ఇలా చెప్పారు


Also Read: నవంబరు 12 or 13 క్షీరాబ్ధి ద్వాదశి ఎప్పుడు - కార్తీకమాసంలో ఈ రోజుకి ఎందుకంత ప్రాధాన్యత!
 
యోగనిద్రలో ఉండే శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశి రోజు సూర్యాస్తమయం తర్వాత పాలసముద్రం నుంచి నిద్రలేచి శ్రీ మహాలక్ష్మి సమేతంగా, దేవతలు మునుల సమేతంగా బృందావనానికి వచ్చారు. ఈ రోజు ఎవరైనా తులసి పూజ చేసి భక్తితో దీపదానం చేస్తే వారు మరణానంతరం వైకుంఠానికి చేరుకుంటారని వరం ఇచ్చాడని వ్యాసుడు వివరించి..వ్రత విధానం కూడా వివరంగా చెప్పారు.   


ఏకాదశి రోజు ఉపవాసం చేసి ద్వాదశి రోజు సూర్యాస్తమయ సమయానికి తులసికోట దగ్గర శుభ్రంచేసి ముగ్గు పెట్టి, అందంగా అలంకరించి తులసి మొక్కలోనే ఉసిరి మొక్కను/కొమ్మను ఉంచాలి. అనంతరం లక్ష్మీసమేతుడైన శ్రీ మహావిష్ణువును భక్తితో సర్వోపచారాలు చేసి నైవేద్యం సమర్పించాలి. అనంతరం కన్నుల పండువగా దీపాలు వెలిగించి..తులసీసహిత లక్ష్మీనారాయణ మహత్మ్యం, దీపదాన ఫలం విని బ్రాహ్మణులకు శక్తికొలది తాంబూలం సమర్పించుకోవాలి.  


దీపదాన ఫలితం గురించి వ్యాసమహర్షి ఇలా చెప్పారు


కార్తీక శుద్ధ ద్వాదశి రోజు బృందావనం/తులసికోట దగ్గర దీపదానం చేయాలి. ఓ దీపంలో దానం ఇస్తే సకల పాపాలు నశిస్తాయి. భక్తితో  ఓ వత్తి వేస్తే బుద్ధిశాలి అవుతారు, నాలుగొత్తులు వేస్తే రాజవుతారు, పది వత్తులు  విష్ణుసాయుజ్యం, వేయివత్తులు వేస్తే వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. దానం చేసే దీపంలో ఆవునేయి వేయాలి. నువ్వులనూనె పర్వాలేదు. ఇతర నూనెను వినియోగించాల్సి వస్తే అందులో కాస్త ఆవునేయి వేస్తే దోషం ఉండదు.  ఇప్పనూనె భోగాన్నిస్తుంది, ఆవనూనె కోర్కెలు తీరుస్తుంది, అవిసెనూనె శత్రువులను తగ్గిస్తుంది, ఆముదం ఆయుష్షు నాశనం చేస్తుంది, బర్రె నేయి గతంలో చేసిన పుణ్యాన్ని తొలగించేస్తుందని వివరించారు. అందుకే ఆవునేయి, నువ్వులనూనె దీపాన్ని దానం చేయడం శ్రేష్ఠం అని చెప్పారు వ్యాసమహర్షి.


Also Read: కార్తీక పౌర్ణమి ఈ ఏడాది (2024) ఎప్పుడొచ్చింది - ఈ రోజు విశిష్టత ఏంటి!


వ్యాసమహర్షి చెప్పిన తులసి మహత్యం


కార్తీకమాసంలో తులసిపూజ చేసేవారు ఉత్తమలోకాలను పొందుతారు. ఉత్థానద్వాదశి రోజు కూడా తులసి పూజ చేయనివారు కోటి జన్మలు చంఢాలురై పుడతారు. తులసిమొక్కను వేసి పెంచిన వారు దానికి ఎన్ని వేళ్లు ఉంటాయో..అన్ని యుగాలు విష్ణులోకంలో ఉండే అదృష్టం పొందుతారు. తులసీదళం కలసిన నీటిలో స్నానం ఆచరించేవారి పాపాలు పటాపంచలు అవుతాయి. తులసి ఉన్నచోట అకాల మృత్యులు దరిచేరదు.  పూర్వకాలంలో కాశ్మీరదేశంలో హరిమేధ ,సుమేద అనే ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేస్తూ ఓ చోట తులసితోట చూశారు. వెంటనే సుమేధుడు భక్తితో ప్రదక్షిణ చేశాడు. అది చూసి హరిమేథుడు ఎందుకని అడిగితే..ఇలా చెప్పాడు సుమేధుడు. దేవతలు - రాక్షసులు క్షీరసాగర మథనం చేసినప్పుడు జన్మించిన ఎన్నో పుణ్యవస్తువులలో తులసి ఒకటి. తులసి అంటే శ్రీమహావిష్ణువుకి ప్రత్యేకం. అందుకే తులసికి నమస్కరిస్తే సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడిని నమస్కరించినట్టే అని చెప్పాడు సుమేధుడు. ఈ కథ పూర్తైన వెంటనే వాళ్లు కూర్చున్న చెట్టు రెండుగా చీలిపోయి అందులోంచి ఇద్దరు పురుషులు బయటకు వచ్చారు. తాము దేవలోకానికి చెందినవారం..అప్సరసలతో భోగంలో ఉంటూ రోమశమహామునికి తపోభంగం చేశామని ఆ శాప ఫలితంగా ఈ చెట్టు తొర్రలో రాక్షసులుగా ఉన్నాం..ఇప్పుడు తులసి కథ విన్నాక శాపవిమోచనం పొందామని చెప్పి దేవలోకానికి వెళ్లిపోయారు. క్షీరాబ్ధి ద్వాదశి రోజు ఈ కథను విన్నవారికి సర్వపాపాలు నశిస్తాయని.. ధర్మరాజుకి వివరించారు వ్యాసమహర్షి...


Also Read: కార్తీక పూర్ణిమ ఎందుకు ప్రత్యేకం - ఈ రోజు దంపతులు సరిగంగ స్నానాలు చేస్తే