Kartik Purnima 2023 Date and Time:  హరిహరాదుల మాసం కార్తీకం. ఈ నెలంతా పూజ‌లు, ఉప‌వాసాల‌తో ఇళ్లు, ఆలయాలు సందడిగా ఉంటాయి. శివ కేశ‌వుల‌కు బేధం లేద‌ని చెప్ప‌డ‌మే ఈ మాసం ప్రాముఖ్య‌త‌. అందుకే  ఈ నెలల రోజులూ శివుడిని, శ్రీమహావిష్ణువుని సమానంగా ఆరాధిస్తారు. 


చాంద్రమానం ప్రకారం కార్తీకమాసం ఎనిమిదవది. శరదృతువులో రెండో నెల. ఈ నెలలో పౌర్ణమి రోజు చంద్రుడు కృత్తికా నక్షత్రం ద‌గ్గ‌ర‌లో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి “కార్తీకమాసం” (Karthika Masam 2023) అని పేరు వచ్చింది.


“న కార్తీక నమో మాసః
న దేవం కేశవాత్పరం!
నచవేద సమం శాస్త్రం
న తీర్థం గంగాయాస్థమమ్”
“కార్తీకమాసానికి సమానమైన మాసము లేదు. శ్రీమహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు.” అని అర్ధం. దీపావ‌ళి తెల్లారి నుంచి నెల రోజుల పాటు నియ‌మ నిష్ట‌ల‌తో కార్తీక వ్ర‌తాన్ని నిర్వ‌హిస్తారు చాలా మంది మ‌గువ‌లు. ఇక ఈ కార్తీకమాసం మొత్తంలో అన్నీ రోజులు ప్రత్యేకమైనవే అయినా కార్తీక పూర్ణ‌మి (Kartik Purnima 2023) చాలా ప్ర‌త్యేకం. 


Also Read: కార్తీకస్నానం ఆంతర్యం భక్తి మాత్రమే అనుకుంటున్నారా!


కార్తీక పౌర్ణమి విశిష్ట‌త (Importance Of Kartik Purnima 2023)



  • పూర్వం వేదాల‌ను అపహరించి సముద్రంలో దాక్కున్న సోమకుడనే రాక్షసుడిని సంహరించేందుకు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించినది  కార్తీక పౌర్ణమినాడే

  • పరమేశ్వరుడు త్రిపురాసురులను సంహరించింది కూడా  పౌర్ణమిరోజునే కావడంతో  దీనికి త్రిపుర పౌర్ణమి అని కూడా పిలుస్తారు

  • దేవదీపావళి , కైశిక పౌర్ణమి, జీటికంటి పున్నమి, కుమార దర్శనం అనే పేర్లతో కూడా పిలుస్తారు.

  • కార్తీక పౌర్ణమి రోజు కొన్నిచోట్ల వృషోత్సర్జనం అనే ఉత్సవం జరుపుకుంటారు. ఒక కోడెదూడను ఆబోతుగా స్వేచ్చగా కీర్తిశేషులైన పితృదేవతల ప్రీత్యర్థం వదులుతారు. ఇలా చేయడంవల్ల గయలోవారి ఆత్మశాంతి కోసం కోటిసార్లు శ్రాద్ధకర్మలు జరిపిన పుణ్యఫలం లభిస్తుంది.

  • తమిళనాడు తిరువణ్ణామలైలో జ్యోతిస్వరూపుడై వెలిసిన శివుడి అగ్నిలింగాన్ని దర్శించుకోవడానికి వేలమంది భక్తులు తరలివెళతారు

  • కార్తీక పౌర్ణమిరోజు  వెన్నెలలో పాలుకాస్తే ఆ పాలు అమృతతుల్యం అవుతాయని విశ్వాసం. అందుకే పూర్వకాలంలో కార్తీకపౌర్ణిమ వెలుగులో పొయ్యి వెలిగించి పాలను మిరియాలతోపాటు కాచి తాగేవారు.

  • కార్తీక పౌర్ణమిరోజు ఆకాశంలో చంద్రుడి నిండైన రూపంతోపాటు దానికి అతిచేరువలోనే దేవతల గురువైన బృహస్పతి (గురుగ్రహం) కూడా ఈరోజున సాక్షాత్కరిస్తుందట. ఆ గురుశిష్యులకి భక్తితో నమస్కరిస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.


Also Read: పాములు, నాగులు, సర్పాలు - మీరు వేటిని పూజిస్తున్నారు!


దంపతులు సరిగంగస్నానం ఆచరిస్తే..
తులా సంక్రమణం జరుగుతున్న కార్తీకమాస సమయంలో శ్రీ మహావిష్ణువు ప్రతి నీటిబొట్టులో వ్యాప్తిచెంది ఉంటాడు. అందుకే ఈ నెలలో ఓసారైనా నదీ స్నానం ఆచరిస్తే విశేష పుణ్యఫలం దక్కుతుంది. ప్రత్యేకింగా పౌర్ణమిరోజు ప్రాతఃకాలంలో దంపతులు సరిగంగ స్నానాలు చేస్తే ఆ దంపతులు   శివ,కేశవులు ఇద్దరి అనుగ్రహానికి పాత్రులువుతారు.


కార్తీక పౌర్ణమి రోజు దీపం వెలిగిస్తూ చదవాల్సిన శ్లోకం


కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః
జలే స్థలే యే నివసంతి జీవాః!
దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః
భవంతి త్వం శ్వపచాహి విప్రాః!!


Also Read: మనిషిలో విషసర్పం శేతత్వం పొందేందుకే నాగుల ఆరాధన, పుట్టలో పాలు పోసే టైమ్ ఇదే!


వెలిగించి దీప శిఖలో దామోదరుణ్ణి కానీ, త్రయంబకుడిని కానీ ఆవాహన చేసి పసుపు, కుంకుమ, అక్షతలు, పూలు వేయాలి. ఆ తర్వాత దీపదానం చేసి నమస్కారం చేయాలి. పౌర్ణమి రోజు దీపదానం చేయడం చాలా విశేషం. ఎందుకంటే నదీతీరాల్లో దీపకాంతి పడిన ప్రదేశం మొత్తం కీటాశ్చ - పురుగులు, మశకాశ్చ - దోమలు, ఈగలు...చెరువులో ఉండే రకరకాల పురుగులు జ్యోతి చూడగానే ఎగిరివస్తాయి. ఈ దీపాన్ని చూసినవన్నీ ఈశ్వర అనుగ్రహం పొంది ఆ భగవంతుడిని చేరుకోవాలని అర్థం. అందుకే ఈ శ్లోకం చెప్పి దీపం వెలిగించి నమస్కరించాలని చెబుతారు...