South Africa vs Australia: భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా చరిత్ర మార్చాలన్న పట్టుదలతో ఉంది. వన్డే ప్రపంచకప్‌లో నాలుగుసార్లు  సెమీస్‌ చేరినా.. ఫైనల్లో అడుగుపెట్టని సఫారీలు ఐదోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే భారత్‌ తుది సమరానికి ఇరు జట్లకు సమాన అవకాశాలు ఉన్నాయి. కానీ ఆరంభంలో లీగ్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించిన దక్షిణాఫ్రికా మరోసారి అదే ఆటతీరు ప్రదర్శిస్తే ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. డికాక్‌ బ్యాట్‌తో మరోసారి చెలరేగితే ప్రొటీస్‌కు తిరుగుండదు. కానీ ప్రపంచకప్‌లో ఒక్కసారి కూడా నాకౌట్‌ గండాన్ని దాటని దక్షిణాఫ్రికాను గత చరిత్రే కలవరపెడుతోంది. మరోవైపు ఏకంగా ప్రపంచకప్‌ను అయిదుసార్లు కొల్లగొట్టిన ఆస్ట్రేలియా  కు గత చరిత్రే ఆయుధంగా మారనుంది. ఇరుజట్లు బలాబలాల్లో సమవుజ్జీలే అయినా.. ఒత్తిడిని జయించడంపైనే మ్యాచ్‌ ఆధారపడి ఉంది. కానీ ఈ కీలక ఆటగాళ్లు రాణిస్తే.. ఇరు జట్ల విజయావకాశాలు మెరుగుపడతాయి...


 

క్వింటన్‌ డికాక్‌: 

ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో క్వింటన్‌ డికాక్‌ ఒకడు. తొమ్మిది మ్యాచుల్లో డికాక్‌ 591 పరుగులు చేసి ఫామ్‌లో ఉన్నాడు. మరోసారి డికాక్‌ బ్యాట్‌ ఝుళిపిస్తే...ఆస్ట్రేలియాకు తిప్పలు తప్పవు. తన కెరీర్‌లోనే చివరి ప్రపంచకప్‌ ఆడుతున్న డికాక్‌ అంత తేలిగ్గా గెలుపును వదులుకోడు. 

 

వాన్‌డెర్‌ డసెన్‌: 

డసెన్‌ కూడా మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు. తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో 442 పరుగులు చేశాడు. మరోసారి డసెన్‌ బ్యాట్‌కు పని చెప్తే దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించడం ఖాయం.

 

మార్‌క్రమ్‌: ఈ ప్రపంచకప్‌లో మార్‌క్రమ్‌ 396 పరుగులు చేశాడు. శ్రీలంకపై కేవలం 49 బంతుల్లోనే సెంచరీ కొట్టి రికార్డు సృష్టించాడు. ప్రపంచకప్‌లో వేగవంతమైన రికార్డు ఇదే. ఈ రికార్డును మరోసారి సృష్టిస్తే కంగారులకు కంగారు తప్పదు.  క్లాసెన్‌,  హెండ్రింక్స్‌, మిల్లర్‌ కూడా తలా ఓ చేయి వేయాలని ప్రోటీస్‌ భావిస్తోంది.

 

మార్కో జాన్సెన్: ఈ ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌. ఇతనితో ఆస్ట్రేలియాకు ప్రమాదం పొంచి ఉంది. జాన్సెన్ 7 మ్యాచ్‌లలో 16 వికెట్లు పడగొట్టాడు. లెఫ్టార్మ్‌ సీమ్‌తో కంగారు బ్యాటర్లను జాన్సెన్‌ ఇబ్బంది పెట్టగలడు.

 

అలాగే ఎంగిడి, కేశవ్‌ మహరాజ్‌, షంసీ, రబాడ బౌలింగ్‌ అద్భుతాలు చేయగలరు. ఆస్ట్రేలియా రెండు వరుస ఓటముల తర్వాత అద్భుతంగా పుంజుకుంది. ఏడు వరుస విజయాలతో సెమీస్‌ చేరింది. ఆరంభంలో బాగా ఆడిన ఓపెనర్‌ వార్నర్‌ వరుసగా విఫలమవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మార్ష్‌ తిరిగి వచ్చిన తర్వాత భారీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకొన్నాడు. అఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్‌  అద్భుతమే చేశాడు. కెప్టెన్‌ కమిన్స్‌ నేతృత్వంలోని కంగారుల బౌలింగ్‌ బలంగా ఉంది. స్టార్క్‌, హాజెల్‌వుడ్‌ రాణిస్తున్నారు. జంపా అత్యధిక వికెట్లు తీసి కంగారులకు కీలకంగా మారాడు. కంగారులు స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శిస్తే మాత్రం దక్షిణాఫ్రికాకు ఇబ్బందులు తప్పవు. కానీ ఈసారి ఎలాగైనా సెమీస్ గండం దాటి ఫైనల్లో అడుగుపెట్టాలని భావిస్తున్న సఫారీలు... తమ బ్యాడ్‌ లక్‌ టీం మచ్చను చెరిపేసుకోవాలని పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే న్యూజిలాండ్‌పై సెమీస్‌లో విజయం సాధించి ఫైనల్‌ చేరిన టీమిండియా.... తమ ప్రత్యర్థి కోసం ఎదురుచూస్తోంది.