Semi Final World Cup 2023: వన్డే ప్రపంచకప్‌ సెమీ ఫైనల్లో భారత్‌ జట్టు గెలుపుతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. పటిష్టమైన కివీస్‌తో ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో చివరకు విజయం భారత్‌నే వరించడంపై ఆనందోత్సాహాలు వెలివిరిశాయి. వేలాదిమంది అభిమానులు చిన్న పెద్దా, తేడా లేకుండా రోడ్లపైకి వచ్చి  జాతీయ జెండాలను ప్రదర్శించారు. బాణాసంచా కాలుస్తూమిఠాయిలు పంచుతూ వేడుకలు చేసుకున్నారు. ప్రపంచకప్‌ సెమీస్‌లో భారత్‌ ప్రత్యర్థి న్యూజిలాండ్‌ కావడంతో ఉత్కంఠగా మ్యాచ్‌ను తిలకించిన అభిమానులు టీమిండియా విజయంతో దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకున్నారు. భారత్‌ గెలవగానే రోడ్లపైకి వచ్చేసిన అభిమానులు, ప్రజలు నృత్యాలతో హోరెత్తించారు. 


ముంబయి వాంఖడే స్టేడియం నుంచి బయటకు వచ్చిన అభిమానులు నృత్యాలు చేస్తూ హర్షం వ్యక్తం చేశారు. పెద్దసంఖ్యలో రోడ్లపైకి చేరుకొని అభిమానాన్ని చాటుకున్నారు. నాగ్‌పూర్‌, కాన్పూర్‌, ఆగ్రా, జమ్ము, బెంగళూరు తిరువనంతపురం తదితర నగరాల్లో ఇంటిల్లిపాది బాణాసంచా కాలుస్తూ మిఠాయిలు పంచుకున్నారు. జై భారత్‌ నినాదాలు చేస్తూ జాతీయ జెండాలను ప్రదర్శించారు. పుణెలో క్రికెట్‌ అభిమానులు భారీ సంఖ్యలో రోడ్లపైకి చేరుకోవడంతో పండుగవాతావరణం నెలకొంది. చిన్నపెద్దా తేడా లేకుండా సంబరాల్లో మునిగిపోయారు. డప్పులు వాయిస్తూ డ్యాన్స్‌ వేస్తూ బాణాసంచా కాల్చారు. జాతీయ జెండాలను ఎగరవేస్తూ.. భారత జట్టుకు మద్దతుగా నినాదాలు చేశారు. ఎక్కడికక్కడ అభిమానులు..... రహదారులపైకి రావడంతో తీవ్ర రద్దీ నెలకొంది. చాలా చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులకు అభిమానులను నియంత్రించడం కష్టంగా మారింది. వైజాగ్‌, హైదరాబాద్‌ నగరాల్లో అభిమానులు డీజేలు పెట్టి నృత్యాలు చేశారు. 


ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌  రోహిత్‌, గిల్‌, కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌ అద్భుత బ్యాటింగ్‌తో నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి 397 పరుగులు చేసింది. కళ్లముందు భారీ లక్ష్యం కనపడుతున్నా న్యూజిలాండ్ గొప్పగా పోరాడింది. అయినా భారత బౌలర్ల ముందు ఆ పోరాటం సరిపోలేదు. విలియమ్సన్‌, డేరిల్‌ మిచెల్‌ భారత అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. కానీ షమీ మరోసారి జూలు విదిల్చడంతో కివీస్‌ 48.5 327 పరుగులకు ఆలౌట్‌ అయింది. షమీ 7 వికెట్లతో న్యూజిలాండ్‌ పతనాన్ని శాసించాడు. 
  కోహ్లీ, అయ్యర్‌ భారత స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. కోహ్లీ అద్భుత బౌండరీలతో ఆకట్టుకోగా.. అయ్యర్‌ భారీ షాట్లతో అలరించాడు. క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ వన్డేల్లో చేసిన అత్యధిక సెంచరీల రికార్డును కోహ్లీ అధిగమించాడు. కోహ్లీ 113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులతో 117 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే  శ్రేయస్స్‌ అయ్యర్‌ కూడా సెంచరీ చేశాడు. కేవలం 67 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సులతో అయ్యర్‌ శతకం బాదేశాడు. అనంతరం స్కోరును పెంచే క్రమంలో 70 బంతుల్లో 105 పరుగులు చేసి అయ్యర్‌ వెనుదిరిగాడు. చివర్లో రాహుల్‌ కేవలం 20 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్సర్లతో 39 పరుగులు చేశాడు.  దీంతో నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి 397 పరుగులు చేసింది.