IND Vs NZ, Match Highlights: నాలుగేళ్ల క్రితం కారిన ప్రతీ కన్నీటి బొట్టుకు టీమిండియా వడ్డీతో సహా ప్రతీకారం తీర్చుకుంది. రోహిత్‌, ధోనీ, కోహ్లీ సహా క్రికెట్‌ అభిమానులంతా కన్నీటి క్షణాలను గుర్తు చేసుకుని నాలుగేళ్లు పడిన వేదనను.. టీమిండియా తీర్చేసింది. ఏ వేదననైతే నాలుగేళ్ల పాటు తమకు మిగిల్చిందో... అదే వేదనను ఇప్పుడు న్యూజిలాండ్‌కు మిగిల్చింది. తమను ప్రపంచకప్‌ కలను దూరం చేసిన జట్టుకు.. అదే ప్రపంచకప్‌ కలను దూరం చేసింది. వాంఖడే వేదికగా విజయ గర్జన చేస్తూ టీమిండియా ఫైనల్లో అడుగుపెట్టింది. అది అలా ఇలా కాదు మొదట బ్యాట్‌తో కివీస్‌ బౌలర్లను ఊచకోత కోసిన బ్యాటర్లు భారీ స్కోరు అందించారు. అనంతరం బౌలింగ్‌లో కాస్త  తడబడ్డా కీలక సమయంలో పుంజుకుని టీమిండియా ఘన విజయం సాధించి సగర్వంగా టైటిల్‌ పోరుకు సిద్ధమైంది.


ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌  రోహిత్‌, గిల్‌, కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌ అద్భుత బ్యాటింగ్‌తో నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి 397 పరుగులు చేసింది. కళ్లముందు భారీ లక్ష్యం కనపడుతున్నా న్యూజిలాండ్ గొప్పగా పోరాడింది. అయినా భారత బౌలర్ల ముందు ఆ పోరాటం సరిపోలేదు. విలియమ్సన్‌, డేరిల్‌ మిచెల్‌ భారత అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. కానీ షమీ మరోసారి జూలు విదిల్చడంతో కివీస్‌ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌట్‌ అయింది. షమీ 7 వికెట్లతో న్యూజిలాండ్‌ పతనాన్ని శాసించాడు. 

 

భీకర ఫామ్‌లో ఉన్న భారత టాపార్డర్‌ జూలు విదిలిస్తే ఏట్లుంటదో ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్లకు తెలిసింది. ఆరంభం నుంచే టీమిండియా సారధి రోహిత్‌ శర్మ దూకుడుగా బ్యాటింగ్‌ చేశాడు. తొలి ఓవర్‌ నుంచే రోహిత్‌ విధ్వంసం ప్రారంభమైంది. గిల్‌తో కలిసి రోహిత్ శర్మ టీమిండియాకు అదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. తొలి ఓవర్‌లోనే పది పరుగులు రాబట్టిన రోహిత్‌... దొరికి బౌలర్‌ను దొరికనట్లు బాదేశాడు. గిల్‌ కూడా ధాటిగా ఆడడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 29 బంతులు ఎదుర్కొన్న రోహిత్‌ 4 ఫోర్లు, 4 సిక్సులతో 47 పరుగులు చేసిన హిట్‌ మ్యాన్‌ అర్ధ శతకానికి ముందు అవుటయ్యాడు. సౌధీ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడేందుకు యత్నించి రోహిత్ అవుటయ్యాడు. కానీ రోహిత్‌ అవుటయ్యే సరికే 8.2 ఓవర్లలో భారత్‌ స్కోరు 71 పరుగులకు చేరింది. గిల్‌ కూడా ధాటిగా ఆడాడు . 65 బంతుల్లో 8 ఫోర్లు, మూడు సిక్సర్లతో 79 పరుగులు చేశాడు. ఈ దశలో గిల్‌కు తొడ కండరాలు పట్టేయడంతో రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. 

 

గిల్‌ వెనుదిరిగగానే కోహ్లీ, అయ్యర్‌ భారత స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. కోహ్లీ అద్భుత బౌండరీలతో ఆకట్టుకోగా.. అయ్యర్‌ భారీ షాట్లతో అలరించాడు. ఓవర్‌కు కనీసం ఒక భారీ షాట్‌ ఆడేలా ప్రణాళిక రచించి దానిని పక్కాగా ఆమలు చేశారు. క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ వన్డేల్లో చేసిన అత్యధిక సెంచరీల రికార్డును కోహ్లీ అధిగమించాడు. కోహ్లీ 113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులతో 117 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే  శ్రేయస్స్‌ అయ్యర్‌ కూడా సెంచరీ చేశాడు. కేవలం 67 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సులతో అయ్యర్‌ శతకం బాదేశాడు. అనంతరం స్కోరును పెంచే క్రమంలో 70 బంతుల్లో 105 పరుగులు చేసి అయ్యర్‌ వెనుదిరిగాడు. చివర్లో రాహుల్‌ కేవలం 20 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్సర్లతో 39 పరుగులు చేశాడు.  దీంతో నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి 397 పరుగులు చేసింది. భారత బౌలర్ల ధాటికి కీవీస్‌ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. టిమ్‌ సౌథీ 10 ఓవర్లలో వంద పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ట్రెంట్ బౌల్ట్‌ 10ఓవర్లలో 86 పరుగులు ఇచ్చి 1 వికెట్‌ తీసుకున్నాడు. ఫెర్గూసన్ 8 ఓవర్లలో 65, రచిన్‌ రవీంద్ర 7 ఓవర్లలో 60 పరుగులు ఇచ్చారు. 

 

అనంతరం 398 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ గొప్పగా పోరాడింది. ఓ దశలో క్రికెట్‌ అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. కానీ మహ్మద్‌ షమీ కివీస్‌ పతనాన్ని శాసించాడు. 9.5 ఓవర్లలో 57 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీశాడు. ఆరంభంలో కాన్వే, రచిన్‌ రవీంద్ర వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. కానీ ఎప్పుడైతే షమీ వచ్చాడో పరిస్థితి మారిపోయింది. ఈ సెమీస్‌లో వేసిన తొలి బంతికే షమీ వికెట్‌ తీశాడు. తర్వాత మరో ఓవర్‌ మంచి ఫామ్‌లో ఉన్న రచిన్‌ను వెనక్కి పంపాడు. కానీ కేన్‌ విలియమ్సన్‌.. డేరిల్‌ మిచెల్‌  టీమిండియాను భయపెట్టారు. మూడో వికెట్‌కు వడివడిగా పరుగులు జోడించి లక్ష్యం దిశగా కివీస్‌ను నడిపించారు. 

39 పరుగుల వద్ద రెండో వికెట్‌ పడగా... 220 పరుగుల వరకు మరో వికెట్‌ పడకుండా ఆడి మళ్లీ భయాన్ని కలిగించారు. కానీ మరోసారి షమీ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి టీమిండియాను పోటీలోకి తెచ్చాడు. విలియమ్సన్‌ అవుటైనా డేరిల్‌ మిచెల్‌ ఒంటరి పోరాటం చేశాడు.  విలియమ్సన్‌ 73 బంతుల్లో 69 పరుగులు చేసి అవుటయ్యాడు. టీమిండియా బౌలర్లపై మిచెల్‌ ఎదురుదాడికి దిగాడు. 119 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సులతో 134 పరుగులు చేసిన మిచెల్‌ చివరి ఓవర్ల వరకూ క్రీజులోనే ఉండి భయపెట్టాడు. కానీ రన్‌రేట్‌ పెరగడంతో అవతల వికెట్లు పడిపోయాయి. మిచెల్‌ను కూడా షమీనే పెవిలియన్‌ చేర్చాడు. చివర్లో రన్‌రేట్‌ పెరగడంతో ఒత్తిడి పెరిగి కివీస్‌ వరుసగా వికెట్లు కోల్పోయింది. 42 ఓవర్‌లో అయిదో వికెట్‌ కోల్పోయిన కివీస్‌ 49వ ఓవర్‌లో ఆలౌట్‌ కావడంతో భారత్ సగర్వంగా ఫైనల్లోకి దూసుకెళ్లింది.