Babar Azam Stepped Down as Pakistan Captain: భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో సెమీస్‌ కూడా చేరకుండా వెనుదిరిగిన పాకిస్థాన్‌పై క్రికెట్ విశ్లేషకులు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.  మాజీ క్రికెటర్లు, పాక్ అభిమానులు పాక్‌ క్రికెటర్లపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ మహా సంగ్రామంలో ప్రపంచ నెంబర్‌ 2 ర్యాంక్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజమ్‌ ఘోరంగా విఫలమయ్యాడు. ఆడిన తొమ్మిది ఇన్నింగ్స్‌లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. పాకిస్థాన్‌ జట్టులో ఆత్మ విశ్వాసం నింపడంలో కూడా బాబర్‌ విఫలమయ్యాడని మాజీలు తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో బాబర్‌ ఆజమ్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు.


పాకిస్థాన్‌ జట్టు కెప్టెన్‌ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు. అయితే, మూడు ఫార్మాట్లలోనూ ప్లేయర్‌గా మాత్రమే కొనసాగుతానని స్పష్టం చేశాడు. ప్రపంచకప్‌లో పాక్‌ వైఫల్యం తర్వాత పాక్‌ కెప్టెన్సీ బాధ్యతల నుంచి బాబర్‌ ఆజమ్‌ను తప్పిస్తారని ఊహగానాలు చెలరేగాయి. అయితే పాక్‌ కెప్టెన్సీ భాద్యతల నుంచి ఆ దేశ క్రికెట్‌ బోర్డు తప్పించేలోపే బాబర్‌ ఆజమే తానే సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 


పాక్‌ జట్టుకు సారథ్యం వహించాలని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు నుంచి తనకు 2019లో వచ్చిన పిలుపు ఇంకా తనకు గుర్తుందని కెప్టెన్సీ ప్రకటనలో బాబర్‌ ఆజమ్ జ్ఞాపకం చేసుకున్నాడు. గడిచిన నాలుగేళ్లుగా మైదానం వెలుపల, బయట ఎన్నో ఎత్తుపల్లాలను చూశానని... క్రికెట్‌ ప్రపంచంలో పాక్‌ గౌరవాన్ని నిలబెట్టాలని మనస్ఫూర్తిగా ప్రయత్నించానని అన్నాడు.  ఇప్పుడు అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నానని బాబర్‌ ప్రకటించాడు. ఇది కఠినమైన నిర్ణయం అయినా ఇందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు ఓ ప్రకటనలో బాబర్‌ వెల్లడించాడు. తదుపరి కెప్టెన్‌కు, జట్టుకు అన్ని విధాలా తన సహకారం ఉంటుందని బాబర్‌ అజామ్‌ ట్వీట్‌ చేశాడు. టర్‌లో పేర్కొన్నాడు.


వన్డే వరల్డ్‌కప్‌-2023లో పరాభవాలపై పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం ఆవేదన వ్యక్తం చేశాడు. తాము దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో గెలిస్తే సెమీస్‌ చేరి ఉండేవాళ్లమని బాబర్‌ అన్నాడు. బౌలింగ్‌, ‍బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌లో తప్పిదాలు చేశామని.. దానికి తగిన మూల్యం చెల్లించుకున్నామని వాపోయాడు. మిడిల్ ఓవర్‌లో స్పిన్నర్లు వికెట్లు తీయకపోతే ఏ జట్టుకైనా గెలవడం చాలా కష్టమని.. ఈ ప్రపంచకప్‌లో తమ జట్టు ఆ సమస్యను ఎదుర్కొందని తెలిపాడు. తప్పులతో పాటు కొన్ని సానుకూలాంశాలు కూడా ఉన్నాయని అన్నాడు. 


ఎన్నో ఆశలు.. మరెన్నో అంచనాలతో రెండు దశాబ్దాల కలను నెరవేర్చుకునేందుకు భారత్‌లో అడుగుపెట్టిన పాకిస్థాన్‌ సెమీస్‌ చేరకుండానే తిరుగు ముఖం పట్టింది. ఆరంభంలో రెండు మ్యాచ్‌లు గెలిచి ఈ మహా సంగ్రామాన్ని ఘనంగా ప్రారంభించిన పాక్‌ తర్వాత గాడి తప్పింది. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా చలామణి అవుతున్న బాబర్‌ ఆజమ్‌... మంచి ఫామ్‌లో ఉన్న రిజ్వాన్‌, ఇమాముల్‌ హక్‌, క్రికెట్‌ ప్రపంచంలో అత్యుత్తమ పేసర్లుగా గుర్తింపు పొందిన షహీన్‌ షా అఫ్రిదీ, హరీస్‌ రౌఫ్‌ ఇలా ఎలా చూసినా అద్భుత ఆటగాళ్లు ఉండడంతో పాక్ సెమీస్‌ చేరడం ఖాయమని మాజీ క్రికెటర్లు భావించారు. కానీ ఈ అంచనాలు తలకిందులయ్యాయి. పాక్‌ బ్యాటర్లు అంచనాలను అందుకోలేకపోయారు. ఈ ప్రపంచకప్‌లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన బాబర్‌ ఆజమ్‌ ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేదు. ఒక్క షహీన్‌ షా అఫ్రిదీ తప్పితే మిగిలిన పాక్‌ బౌలింగ్‌ దళం పూర్తిగా విఫలమైంది.