Virat Kohli 50th ODI Century Reactions : ఎప్పటికైనా తన రికార్డును భారత ఆటగాడే తిరగరాస్తాడన్న సచిన్‌ నమ్మకాన్ని...విరాట్‌ నిలబెట్టాడు. తాను ఆరాధించే సచిన్‌ టెండూల్కర్‌  రికార్డును కింగ్ కోహ్లీ అధిగమించాడు.  విరాట్‌కు సచిన్‌ శుభాకాంక్షలు చెబుతూ  ఒక అద్భుతమైన ట్వీట్ చేశాడు. తను మొట్టమొదటిసారి కోహ్లీ ని చూసిన క్షణాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. ఆరోజు తన పాదాలను తాకే క్షణం నుంచి ఆట పై ఉన్న అభిరుచి, అంకితభావంతో తన హృదయాన్ని తాకే క్షణం వరకు కోహ్లీ ప్రయాణం తలచుకొని మురిసిపోయాడు. ఆ ఆకతాయి యువకుడి విరాట్ విశ్వ రూపాన్ని చూసి మైమరచిపోయాడు. కొడుకు ఎదుగుదల చూసి ఆనందించే తండ్రిలా , శిష్యుని విజయాన్ని ఆస్వాదించే గురువులా సంతోషపడిపోయాడు. 


ఎప్పటికైనా తన రికార్డును భారత ఆటగాడే తిరగరాస్తాడన్న సచిన్‌ నమ్మకాన్ని విరాట్‌ నిలబెట్టాడు.  160 బంతుల్లో 8 పోర్లు, 1 సిక్సర్‌తో వంద పరుగుల మైలురాయిని కింగ్ కోహ్లీ అధిగమించాడు. క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ వన్డేల్లో చేసిన అత్యధిక సెంచరీల రికార్డును అధిగమించిన వెంటనే మైదానంలోనే కోహ్లీ... సచిన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ బ్యాట్‌ చూపించాడు. తన ఆరాధ్య దైవం ముందే ఈ ఘనత సాధించిన కోహ్లీ మోకాళ్ళపై కూర్చొని గౌరవ వందనం చేశాడు. ఇంత చేసినా సచిన్‌ ఎప్పటికీ తన హీరోనే అంటాడు కోహ్లీ. ఎందుకంటే  సచిన్‌ను విరాట్‌ కేవలం ఒక క్రికెటర్‌గా మాత్రమే చూడలేదు. ఒక మార్గదర్శిగా.. గురువుగా... దేవుడిగా చూశాడు. సచిన్‌ కూడా విరాట్‌కు మార్గదర్శిగా మార్గం చూపి.. గురువుగా ఆటలో నైపుణ్యాలను పెంచుకునేలా చేసి... దేవుడిగా కష్టకాలంలో అండగా ఉన్నాడు. అందుకే సచిన్‌-విరాట్‌ బంధం.. చాలా ప్రత్యేకమైనది.


 డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీ-సచిన్ మధ్య లోతైన అనుబంధం ఉంది. ఆ విషయాన్ని ఇటు సచిన్, అటు కోహ్లీ కూడా చాలా సార్లు బయటపెట్టారు.  జీవిత ప్రారంభంలోనే తన తండ్రిని కోల్పోయిన కోహ్లీకి గురువుగా సచిన్‌ మార్గనిర్దేశం చేశాడు. కోహ్లీ-సచిన్‌ బంధం గురు- శిష్యుల బంధం కంటే పెద్దది. టెండూల్కర్ తరచుగా కోహ్లీని తన స్నేహితుడునే పిలుస్తాడు. కానీ కోహ్లి తరానికి,  అంతకు ముందు తరానికి కూడా సచిన్‌ కేవలం స్నేహితుడు కాదు. అంతకంటే ఎక్కువే. తాము ఆరాధించే వ్యక్తి సమక్షంలోనే ఉన్నామన్న ఆలోచనే యువ ఆటగాళ్లకు కొత్తగా ఉండేది. సచిన్‌ డ్రెస్సింగ్ రూమ్‌లోకి ప్రవేశించినప్పుడు అందరూ లేచి నిలబడతారు. దూరంగా నిలబడి సచిన్‌ మ్యాచ్‌కు సిద్ధమయ్యే విధానాన్ని చూసి అబ్బురపడతారు. అతడు షేక్‌ హ్యాండ్‌ ఇస్తే ఉబ్బితబ్బిబవుతారు. కోహ్లీ కూడా అలాంటి వాడే. అందుకే సచిన్ కి ఆ గౌరవాన్ని ఎప్పుడూ ఇస్తాడు కోహ్లీ. రికార్డ్ పూర్తి అయిన కోహ్లీని లేచి నిలబడి చెప్పట్లతో సచిన్ అభినందంచగా , విరాట్ మోకాళ్ళపై కూర్చొని సచిన్ కి సలాం చేయటమే అందుకు నిదర్శనం. ఈరోజు మ్యాచ్  విరాట్ విశ్వరూపాన్ని చూసిన వాళ్ళదే  కాదు సచిన్ ట్వీట్ చదివిన వారి మనస్సు కూడా  భావోద్వేగంతో నిండిపోయింది అనటం అతిశయోక్తి కాదు. 


సెంచరీ చేసిన అనంతరం కోహ్లీ 113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులతో 117 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే  శ్రేయస్స్‌ అయ్యర్‌ కూడా సెంచరీ చేశాడు. రోహిత్‌, గిల్‌, కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, రాహుల్‌  విధ్వంస బ్యాటింగ్‌తో నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి 397 పరుగులు చేసింది. మొత్తానికి  భారత బౌలర్ల ధాటికి కీవీస్‌ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.