Virat Kohli Creates History: వాంఖడే వేదికగా మరో అద్భుతం సాకారమైంది. ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్‌ కోహ్లీ రికార్డుల మీద రికార్డులు సృష్టించాడు. క్రికెట్‌ గాడ్‌, తన ఆరాధ్య ధైవం సచిన్‌ టెండూల్కర్‌ ఎదుటే.. అతని మైదానంలోనే  రెండు దశాబ్దాలుగా తన పేరిట ఉన్న రికార్డును విరాట్‌ బద్దలు కొట్టేశాడు. 2011 ప్రపంచకప్‌ను టీమిండియా సగర్వంగా అందుకున్న చోటే.. క్రికెట్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని రికార్డు కింగ్ కోహ్లి వశమైంది. ముందుగా వన్డేల్లో సచిన్‌ 50వ శతకం రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ... ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌ 2003లో క్రికెట్‌ గాడ్‌ 673 పరుగలు చేయగా... భారత్‌ వేదికగా 2023 ప్రపంచకప్‌లో ఈ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ ప్రపంచకప్‌లో మొత్తం 10 ఇన్నింగ్స్‌ల్లోనే కోహ్లీ 711 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. ఆడిన పది ఇన్నింగ్సుల్లో విరాట్‌ మూడు సెంచరీలు, అయిదు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ ప్రపంచకప్‌లో భీకర ఫామ్‌లో ఉన్న విరాట్ ఇప్పటికే 711 పరుగులు చేసి సత్తా చాటాడు. సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులతో 117 పరుగులు చేసి సత్తా చాటాడు. 


 

  2003 ప్రపంచకప్‌లో సచిన్‌  అద్భుత బ్యాటింగ్‌తో టీమిండియాను ఫైనల్‌ చేర్చాడు. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో సచిన్‌ ఇన్నింగ్స్  అతడి కెరీర్‌లోనే అద్భుత ఇన్నింగ్స్‌గా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ ప్రపంచకప్‌లోనూ న్యూజిలాండ్‌తో సెమీఫైనల్లో చేసిన కోహ్లీ సెంచరీ చేసి అలాంటి మన్ననలే పొందాడు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే అనేక రికార్డులను కోహ్లీ తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే క్రికెట్‌ చరిత్రలోనే 50 సెంచరీలు చేసిన తొలి ప్లేయర్‍‌గా విరాట్ కోహ్లీ నూతన చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో సూపర్ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లి.. సచిన్ రికార్డును అధిగమించాడు. ఇదే టోర్నీలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ కొట్టి సచిన్ అత్యధిక సెంచరీల రికార్డును సమం చేసిన కోహ్లి.. కివీస్‌తో జరిగిన కీలకపోరులో సెంచరీతో మెరిశాడు. 

 

పదిహేనేళ్ల కెరియర్‌‌‌‌‌‌‌‌లో ఎన్నో రికార్డులను విరాట్ కోహ్లీ నెలకొల్పాడు. మరెన్నో రివార్డులను అందుకున్నాడు. వన్డేల్లో ఇప్పటివరకు మొత్తం 50 సెంచరీలు చేసి.. లెజెండరీ క్రికెటర్ సచిన్‌ ఆల్‌‌‌‌టైమ్‌‌‌‌ రికార్డును అధిగమించాడు. తన సుదీర్ఘ ఇంటర్నేషనల్ కెరియర్‌‌‌‌‌‌‌‌లో 80 సెంచరీలు నమోదు చేశాడు కోహ్లీ. వన్డేల్లో 50, టెస్టుల్లో 29, టీ20ల్లో ఒక శతకం చేశాడు. ఇప్పుడు సచిన్ రికార్డు బ్రేక్ చేశాడు. కోహ్లీ క్రికెట్ జర్నీలో ఎన్నో మైలు రాళ్లు, ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఎదురుదెబ్బలు తిన్నా ఎప్పటికప్పుడు ఆటను మెరుగుపరుచుకుంటూ ఉన్నత స్థానంలో ఉంటున్నాడు. 2023లో కోహ్లి అంతర్జాతీయ పరుగులు 1500 దాటాయి. ఏడు సెంచరీలు చేశాడు. ప్రపంచకప్ కంటే ముందు ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో అద్భుత శతకంతో అభిమానులను ఉర్రూతలూగించాడు. భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో తనదైన ఆటతో అదరగొడుతున్నాడు. 10 ఇన్నింగ్స్‌ల్లో దాదాపు 90 సగటుతో 713కిపైగా పరుగులు సాధించాడు. అందులో మూడు శతకాలతో పాటు నాలుగు అర్ధసెంచరీలున్నాయి.